చింతామణి నాటకాన్ని పూర్తిగా నిషేధిస్తే జీవనోపాధి దెబ్బతింటుంది

చింతామణి నాటక ప్రదర్శన పూర్తిస్థాయి నిషేధంతో కళాకారుల జీవనోపాధి దెబ్బతింటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అభ్యంతరకర భాగాన్ని ప్రదర్శించకుండా కట్టడి చేసే ప్రతిపాదన ఏమైనా ఉందా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

Published : 03 Dec 2022 03:49 IST

పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేయడం మంచిది
అభిప్రాయపడిన హైకోర్టు

ఈనాడు, అమరావతి: చింతామణి నాటక ప్రదర్శన పూర్తిస్థాయి నిషేధంతో కళాకారుల జీవనోపాధి దెబ్బతింటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అభ్యంతరకర భాగాన్ని ప్రదర్శించకుండా కట్టడి చేసే ప్రతిపాదన ఏమైనా ఉందా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సమస్య పరిష్కారం ముఖ్యమని పేర్కొంది. సామరస్య పూర్వకంగా పరిష్కరించేందుకు కళాకారులు, రచయితలు, సాహితీవేత్తలు, నాటకంపై అభ్యంతరం తెలుపుతున్న వ్యక్తుల భాగస్వామ్యంతో కమిటీ వేసే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. స్పందన తెలుసుకొని కోర్టుకు తెలియజేయాలని ప్రభుత్వ న్యాయవాది సుభాష్‌కు సూచన చేసింది. విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ దుప్పల వెంకటరమణతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. వ్యాజ్యం విచారణ సందర్భంగా ప్రస్తుత సినిమాల్లో అశ్లీలతపై ఆందోళన వ్యక్తంచేసింది. చెడును నెమ్మదిగా ప్రజల్లోకి చొప్పిస్తున్నారని పేర్కొంది. పాత సినిమాలను గుర్తుచేసింది. మంచి సినిమాలను తెలుగు ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారంది. చింతామణి నాటక ప్రదర్శనపై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిల్‌ వేసిన విషయం తెలిసిందే. ఇదే వ్యవహారంపై కళాకారుడు ఎ.త్రినాథ్‌ మరో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లు శుక్రవారం హైకోర్టులో విచారణకు వచ్చాయి. ఎంపీ తరఫు న్యాయవాది పీవీజీ ఉమేశ్‌ చంద్ర వాదనలు వినిపించారు. నాటకంలో ఓ పాత్రపై అభ్యంతరం ఉన్న కారణంగా మొత్తం నాటకాన్ని నిషేధించడం సరికాదన్నారు. నాటకంపై ఆధారపడిన వారి జీవనాధారం దెబ్బతింటుందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని