నారా లోకేశ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట

కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై విజయవాడలోని సూర్యారావుపేట పోలీసులు గతేడాది నమోదు చేసిన కేసును ఏపీ హైకోర్టు కొట్టేసింది.

Updated : 03 Dec 2022 05:56 IST

పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేత

ఈనాడు, అమరావతి: కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై విజయవాడలోని సూర్యారావుపేట పోలీసులు గతేడాది నమోదు చేసిన కేసును ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఆ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా విజయవాడలోని మొదటి అదనపు మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో జరుగుతున్న కేసు విచారణను రద్దు చేసింది. పబ్లిక్‌ సర్వెంట్‌ జారీచేసిన ఉత్తర్వులను పిటిషనర్‌ ఉల్లంఘించలేదని, అలాంటప్పుడు కేసు నమోదు చేయానికి వీల్లేదని సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేశారు. ఈఎస్‌ఐ సేవల ఒప్పందాల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణతో మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత అచ్చెన్నాయుడిని 2020లో అవినీతి నిరోధక శాఖ (అనిశా) అరెస్ట్‌ చేసి విజయవాడ కోర్టులో హాజరుపరచడానికి తీసుకొచ్చింది. కోర్టు వద్దకు వెళ్లిన లోకేశ్‌తో పాటు పలువుర్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మీడియాతో మాట్లాడారు. కొవిడ్‌ నిబంధనలు, తమ ఉత్తర్వులను ఉల్లంఘించారని పోలీసు అధికారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సూర్యారావుపేట పోలీసులు లోకేశ్‌పై కేసు నమోదు చేశారు. ఆ కేసు ప్రస్తుతం విజయవాడ కోర్టులో విచారణ జరుగుతోంది. తనపై పెట్టిన కేసును కొట్టేయాలని లోకేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని