కోర్టు ముందు హాజరైన ఈడీ అదనపు డైరెక్టర్‌

ఫెమా కేసులో అప్పీలు దాఖలు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తరఫున మూడు వాయిదాలుగా ఎవరూ హాజరుకాకపోవడంతో వారెంట్‌ జారీతో శుక్రవారం ఈడీ అదనపు డైరెక్టర్‌ పరుచూరి దినేష్‌ తెలంగాణ హైకోర్టు ముందు హాజరయ్యారు.

Published : 03 Dec 2022 04:45 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఫెమా కేసులో అప్పీలు దాఖలు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తరఫున మూడు వాయిదాలుగా ఎవరూ హాజరుకాకపోవడంతో వారెంట్‌ జారీతో శుక్రవారం ఈడీ అదనపు డైరెక్టర్‌ పరుచూరి దినేష్‌ తెలంగాణ హైకోర్టు ముందు హాజరయ్యారు. విశాఖపట్టణానికి చెందిన ప్రభాత్‌ స్టోర్స్‌ తదితరులకు సంబంధించి అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఉత్తర్వులపై 2017లో ఈడీ అప్పీలు దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ పై జస్టిస్‌ ఎం.లక్ష్మణ్‌ విచారణ చేపట్టగా మూడు వాయిదాలుగా ఈడీ తరఫున ఎవరూ హాజరుకాలేదు. దీంతో న్యాయమూర్తి నవంబరు 25న బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేస్తూ, రూ.10 వేలు బెయిలు బాండ్‌ కింద సమర్పించాలని, ఈ మొత్తాన్ని హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీకి చెల్లించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈడీ అదనపు డైరెక్టర్‌ దినేష్‌ న్యాయమూర్తి ముందు హాజరై బేషరతు క్షమాపణ చెప్పారు. ఈడీ తరఫున డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ జి.ప్రవీణ్‌కుమార్‌ స్పందిస్తూ సమాచారం అందకపోవడంతో సమస్య తలెత్తిందన్నారు. కోర్టు ఉత్తర్వుల పట్ల ఈడీకి గౌరవం ఉందని తెలిపారు. దీనికి అనుమతించిన న్యాయమూర్తి వారెంట్‌ను రద్దు చేస్తూ కేసు విచారణను 7వ తేదీకి వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని