చంద్రబాబు, నారాయణ వ్యాజ్యాలపై విచారణ వాయిదా

అమరావతి అసైన్డ్‌ భూముల విషయంలో సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ 2021లో హైకోర్టులో వేసిన వ్యాజ్యాలపై విచారణ 2023 జనవరి 24కి వాయిదా పడింది.

Published : 03 Dec 2022 04:45 IST

ఈనాడు, అమరావతి: అమరావతి అసైన్డ్‌ భూముల విషయంలో సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ 2021లో హైకోర్టులో వేసిన వ్యాజ్యాలపై విచారణ 2023 జనవరి 24కి వాయిదా పడింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఈమేరకు ఆదేశాలిచ్చారు. వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2021 ఫిబ్రవరిలో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ పోలీసులు చంద్రబాబు, నారాయణలపై ఎస్సీ,ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంతో పాటు ఏపీ అసైన్డ్‌ భూముల బదిలీ నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ దాఖలు చేసిన వ్యాజ్యాలపై 2021 మార్చి 19న విచారణ జరిపిన కోర్టు.. సీఐడీ నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేసిన విషయం విదితమే. మధ్యంతర ఉత్తర్వులను ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తోంది.

తొందరేముంది

శుక్రవారం తాజాగా ఈ వ్యాజ్యం విచారణకురాగా సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ.. ఎఫ్‌ఐఆర్‌ దశలోనే దర్యాప్తు నిలిచిపోయిందన్నారు. వ్యాజ్యాలపై త్వరగా విచారణ చేయాలన్నారు. నాలుగైదేళ్ల కిందట మధ్యంతర ఉత్తర్వులిచ్చిన వ్యాజ్యాలు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. తొందరేముందని ప్రశ్నించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, గింజుపల్లి సుబ్బారావు స్పందిస్తూ.. ఈ వ్యాజ్యాల్లో వాదనలు వినిపించేందుకు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వస్తారన్నారు. ఇరువైపు వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి విచారణను జనవరి 24కి వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని