Ap High Court: పాత్రికేయుడు అంకబాబుపై కేసులో సీఐడీకి హైకోర్టు షాక్‌

సీనియర్‌ పాత్రికేయుడు కొల్లు అంకబాబుపై నమోదు చేసిన కేసులో సీఐడీకి హైకోర్టు గట్టి షాకిచ్చింది.

Updated : 03 Dec 2022 08:26 IST

ఎఫ్‌ఐఆర్‌ కొట్టివేత
సీఐడీ నమోదు చేసిన సెక్షన్లు వర్తించవని స్పష్టీకరణ
రెండు గ్రూపుల మధ్య విద్వేషం కలిగించలేదని వెల్లడి

ఈనాడు, అమరావతి: సీనియర్‌ పాత్రికేయుడు కొల్లు అంకబాబుపై నమోదు చేసిన కేసులో సీఐడీకి హైకోర్టు గట్టి షాకిచ్చింది. నమోదు చేసిన సెక్షన్లు ఆయన విషయంలో వర్తించవని స్పష్టం చేసింది. రెండు గ్రూపుల మధ్య విద్వేషం రేకెత్తించిన ప్రస్తావనే లేదంది. పిటిషనర్‌ ఫార్వర్డ్‌ చేసిన మెసేజ్‌ అని చెబుతున్న దాని వల్ల సీఎం కార్యాలయ సిబ్బంది, ఇతర వ్యక్తులకు దురభిప్రాయం/ద్వేషం (ఇల్‌విల్‌) లేదా పగ పెంపునకు కారణం అయ్యింది అనుకున్నప్పటికీ.. ఈ విషయంలో సెక్షన్‌ 153ఏ, 505ఏ వర్తించదని తేల్చి చెప్పింది. అసలు రెండు గ్రూపుల ప్రస్తావనే లేదంది. సీఎంవో కార్యాలయానికి వ్యతిరేకంగా దురభిప్రాయం సృష్టించడం.. రెండు గ్రూపుల మధ్య దురభిప్రాయం లేదా ద్వేషం కలిగించడం కిందకు రాదంది. ఒకవేళ రెండు గ్రూపుల మధ్య విద్వేషం కలిగించారనుకున్నా.. ఇక్కడ అ సెక్షన్‌ వర్తించదని తెలిపింది. ఎందుకంటే ఇది మతం, తెగల మధ్య శతృత్వం పెంచిన వ్యవహారం కాదంది. ఈ నేపథ్యంలో సెక్షన్‌ 153ఏ, 505ఎలు వర్తించవని పేర్కొంది. ఆ రెండు సెక్షన్లు వర్తించకపోతే అసలు 120బి వర్తించే ప్రశ్నే ఉత్పన్నం కాదంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని పిటిషనర్‌పై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు శుక్రవారం ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చారు. గన్నవరం విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్‌ ఘటనతో సీఎంవోలోని ఓ కీలక అధికారికి సంబంధం ఉందంటూ వచ్చిన పోస్టును వాట్సప్‌ గ్రూపులో ఫార్వర్డ్‌ చేశారనే ఆరోపణలతో అందిన ఫిర్యాదు ఆధారంగా 73 ఏళ్ల వృద్ధుడైన సీనియర్‌ పాత్రికేయుడు కొల్లు అంకబాబుపై సీఐడీ కేసు నమోదు చేసి, అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. సీఎంవో కార్యాలయ మేనేజరు తిరుపతి రమేశ్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ అంకబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫున న్యాయవాది టి.శ్రీధర్‌ వాదనలు వినిపిస్తూ... ‘ఐపీసీ సెక్షన్‌ 153(ఎ), 505(ఎ) రెడ్‌విత్‌ 120బి కింద కేసు నమోదు చేశారు. వివిధ గ్రూపుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు. పిటిషనర్‌పై నేరాన్ని ఆపాదించడానికి వీల్లేదు. ఫిర్యాదులోని ఆరోపణలు, రిమాండ్‌ రిపోర్టులోని అంశాలేవి సెక్షన్‌ 153ఏ, 505(ఎ) కిందకు రావు. ఇతరులతో కలిసి పిటిషనర్‌ కుట్రకు పాల్పడ్డారనేందుకు ఆధారాలే లేవు. ఈ నేపథ్యంలో సెక్షన్‌ 120బి కింద నమోదు చేసిన సెక్షన్‌ చెల్లదు...’ అని పేర్కొన్నారు. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. శుక్రవారం తన నిర్ణయాన్ని వెల్లడించారు.

సెక్షన్ల మధ్య వ్యత్యాసాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది

‘సహజంగా దర్యాప్తు ప్రక్రియలో న్యాయస్థానం జోక్యం చేసుకోవడానికి అయిష్టత చూపుతుంది. ఫిర్యాదులోని అంశాలు, దర్యాప్తులో తేలిన అంశాలను పరిగణనలోకి తీసుకొని న్యాయం చేసేందుకు జోక్యం చేసుకోవచ్చు. సెక్షన్‌ 153ఏ, 505ఏ కింద నేరానికి పాల్పడినట్లు తేలితేనే ఐపీసీ సెక్షన్‌ 120బీని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సెక్షన్‌ 153ఏ, 505ఏ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐపీసీ సెక్షన్‌ 153ఏ కింద నేరానికి పాల్పడినట్లు నిర్ధారించాలంటే నిందితుడు.. మాటలు లేదా రాతపూర్వకంగా, ఇతర పద్ధతుల్లో వివిధ మతాలు, కులాలు, తెగలు, గ్రూపుల మధ్య శతృత్వం పెంచేలా ఉండాలి. సామరస్యాన్ని దెబ్బతీసేదిగా ఉండాలి. సెక్షన్‌ 153ఏలోని ఉప క్లాజులు ఏ,బీ,సీల కింద నేరానికి పాల్పడ్డారని చెప్పేందుకు గ్రూపుల మధ్య విరోధానికి కారణమై ఉండాలి. ఒక గ్రూపుపై దురభిప్రాయం/ద్వేషం కలిగి ఉంటే మాత్రం ఈ సెక్షన్‌ వర్తించదు. విరోధం పెంచాలన్న ఉద్దేశంతో చేసిన పని అయిఉండాలి. కేవలం మతాలు, తెగలు, భాష, కులాల మధ్య శతృత్వానికి దారి తీసినప్పుడు మాత్రమే ఆ సెక్షన్లు వర్తిస్తాయి...’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.  సీఐడీ ప్రత్యేక పీపీ శివకల్పనరెడ్డి వాదనలు వినిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని