మరో ఇద్దరు సలహాదారులు

వ్యవసాయ రంగంలో ఇటీవలి వరకు ఒక్కరే సలహాదారు ఉండేవారు. ఇప్పుడు ఇద్దరయ్యారు. వ్యవసాయశాఖకు తిరుపాల్‌రెడ్డిని, ఉద్యానశాఖకు శివప్రసాద్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది.

Updated : 04 Dec 2022 06:19 IST

తిరుపాల్‌రెడ్డి, శివప్రసాద్‌రెడ్డిలను వ్యవసాయ, ఉద్యాన శాఖలకు నియమించిన ప్రభుత్వం
ఇద్దరూ వైయస్‌ఆర్‌ జిల్లా వారే

ఈనాడు, అమరావతి: వ్యవసాయ రంగంలో ఇటీవలి వరకు ఒక్కరే సలహాదారు ఉండేవారు. ఇప్పుడు ఇద్దరయ్యారు. వ్యవసాయశాఖకు తిరుపాల్‌రెడ్డిని, ఉద్యానశాఖకు శివప్రసాద్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. వారిద్దరికీ ఆ రంగంలో ఏమైనా అనుభవం ఉందా.. ఆదర్శ రైతులా అంటే అలాంటి చరిత్రా లేదు. వైకాపా నాయకులు కావడమే వారి అర్హత. కొత్తగా నియమితులైన ఇద్దరూ వైయస్‌ఆర్‌ జిల్లా వారే. ముఖ్యమంత్రి జగన్‌కు దగ్గరి బంధువు కావడమే ఒకరికి అదనపు అర్హత. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పాటయ్యాక వ్యవసాయశాఖకు సలహాదారుగా అంబటి కృష్ణారెడ్డి ఉండేవారు. ఇటీవల ఆయన పదవీకాలం పూర్తికావడంతో ముఖ్యమంత్రి బంధువు, వైయస్‌ఆర్‌ జిల్లా దువ్వూరు మండలం పుల్లారెడ్డిపేటకు చెందిన ఐ.తిరుపాల్‌రెడ్డిని వ్యవసాయశాఖకు సలహాదారుగా నియమించారు. ఆయన గతంలో డీసీసీబీ ఛైర్మన్‌గా వ్యవహరించారు. డిగ్రీ కళాశాల ఉంది. భూఆక్రమణల వివాదాలున్నాయి. వ్యవసాయ భూములు ఉన్నా.. సొంతంగా వ్యవసాయం అంతంతమాత్రమే. ఉద్యానశాఖ సలహాదారుగా నియమితులైన వైయస్‌ఆర్‌ జిల్లా కమలాపురం మండలానికి చెందిన పుట్టా శివప్రసాద్‌రెడ్డి కూడా వ్యవసాయ సలహామండలి ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భూములున్నా.. పండించేది మినుము, సెనగ, వరి తదితర వ్యవసాయ పంటలే. ఉద్యాన పంటలను సాగు చేయట్లేదు. ఇద్దరూ రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతారని నవంబరు 22న అప్పటి వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య వేర్వేరు ఉత్తర్వులు ఇచ్చారు. వ్యవసాయ, ఉద్యాన శాఖల్లో సలహాదారులంటే.. ఆ రంగంలో పనిచేసేవారైతే రైతులకు ప్రయోజనం. కర్షకుల కష్ట, నష్టాలేంటో తెలుస్తాయి. వాటిని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేసే అవకాశం ఉంటుంది. సలహాదారులుగా నియమితులైన ఇద్దరూ కనీసం వ్యవసాయ, ఉద్యానరంగంలో పట్టభద్రులూ కారు. ఈ రంగంలోని విశ్రాంత అధికారులూ కారు!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని