నేడు రాష్ట్రానికి రాష్ట్రపతి

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అధికారిక హోదాలో తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం ఆమె దిల్లీ నుంచి బయలుదేరి 10.50 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.

Published : 04 Dec 2022 03:02 IST

రెండు రోజులపాటు విజయవాడ, విశాఖ, తిరుపతిలలో పర్యటన

ఈనాడు, అమరావతి: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అధికారిక హోదాలో తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం ఆమె దిల్లీ నుంచి బయలుదేరి 10.50 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 11.25-12.15 మధ్య పోరంకిలో ఉన్న ఒక ప్రైవేటు కన్వెన్షన్‌ సెంటర్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రపతికి పౌరసన్మానం జరుగుతుంది. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో పాటు రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆమెను సత్కరిస్తారు. ఆ తర్వాత రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్‌ అధికారిక విందు ఇవ్వనున్నారు. అనంతరం 2.35గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నంకు రాష్ట్రపతి బయల్దేరి వెళతారు. అక్కడ రక్షణశాఖ, ఉపరితల రవాణాశాఖలకు చెందిన పలు ప్రాజెక్టులను వర్చువల్‌ విధానంలో ఆమె ప్రారంభిస్తారు. కొన్నింటికి శంకుస్థాపనలు చేస్తారు. సాయంత్రం 4.25 నుంచి 6గంటల వరకు విశాఖ ఆర్కే బీచ్‌లో నిర్వహించనున్న నౌకాదళ విన్యాసాలను తిలకిస్తారు. రాత్రి 8 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 8.40కి తిరుపతి చేరుకుంటారు. రాత్రి తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో బస చేస్తారు. సోమవారం ఉదయం 5.30గంటలకు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఉదయం 10.50 నుంచి 11.10గంటల వరకు విద్యార్థినులతో జరిగే ముఖాముఖిలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొంటారు. అనంతరం రాష్ట్ర పర్యటన ముగించుకుని ఉదయం 11.40గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి దిల్లీకి బయలుదేరి వెళతారు.

రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికేందుకు సిద్ధం

విశాఖపట్నం(వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ స్వాగతం పలకనున్నారు. రాష్ట్రపతి ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకుంటారు. రాష్ట్రపతి వెంట గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రానున్నారు. విశాఖ పర్యటన అనంతరం తిరుపతికి రాష్ట్రపతితో పాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా వెళతారు.

వర్చువల్‌ పద్ధతిలో పలు పథకాల ప్రారంభం

కర్నూలు జిల్లాలో నౌకాదళం ఏర్పాటు చేసిన నేషనల్‌ ఓపెన్‌ ఎయిర్‌ రేంజ్‌ (ఎన్‌ఓఏఆర్‌)ను, ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ చేపట్టిన రాయచోటి-అంగళ్లు జాతీయ రహదారి పనుల సహా నాలుగు పనులను, కేంద్ర గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి ఉభయగోదావరి, విజయనగరం జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలను రాష్ట్రపతి వర్చువల్‌ విధానంలో ప్రారంభించనున్నారు. మరో జాతీయ రహదారి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు