అందరూ గురువులేనట!

రాష్ట్రంలో తూర్పు, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉపాధ్యాయుల ఓటరు నమోదు దరఖాస్తులను తిరస్కరిస్తున్న అధికారులు ప్రైవేటు ఉపాధ్యాయుల జాబితాలను యథాతథంగా ఆమోదించేస్తున్నారు.

Updated : 04 Dec 2022 05:20 IST

ప్రైవేటు ఉపాధ్యాయుల పేరుతో బోగస్‌ ఓట్ల నమోదు
ఎమ్మెల్సీ ఎన్నికల కోసం వైకాపా కుటిల యత్నాలు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో తూర్పు, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉపాధ్యాయుల ఓటరు నమోదు దరఖాస్తులను తిరస్కరిస్తున్న అధికారులు ప్రైవేటు ఉపాధ్యాయుల జాబితాలను యథాతథంగా ఆమోదించేస్తున్నారు. పాఠశాలకు సంబంధం లేకున్నా ఓటరుగా నమోదు చేసేస్తున్నారు. అనంతపురం, నెల్లూరు, వైఎస్‌ఆర్‌ జిల్లాల్లో ఈ తంతు ఎక్కువగా కనిపిస్తోంది.  పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం పరిధిలో ఉమ్మడి కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలున్నాయి. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఉమ్మడి చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలున్నాయి. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ అధికార వైకాపా మద్దతు ఇస్తున్న అభ్యర్థులు ప్రైవేటు పాఠశాలల యజమానులే కావడం విశేషం. ఈ నెల 9వరకు ఓటర్లుగా నమోదు, అభ్యంతరాల స్వీకరణ గడువు ఉంది.

ప్రభుత్వ ఉపాధ్యాయుల ఓట్లకు కొర్రీలు

ప్రభుత్వ ఉపాధ్యాయులు కొందరు విద్యాలయానికి సమీపంగా ఉండేందుకు తరచూ తమ నివాసాలను మార్చుకుంటారు. వారి ఆధార్‌లో, సాధారణ ఓటు హక్కు కార్డులలో పాత నివాసం చిరునామానే ఉంటుంది. దీన్ని సాకుగా చూపి వారి ఓట్ల నమోదుకు అధికారులు అనేక ఆంక్షలు పెడుతున్నారు. ఇక్కడ ఆధార్‌, ఓటుహక్కు లేదంటూ దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. కొన్నిచోట్ల అసలు దరఖాస్తులనే తీసుకోవడం లేదు. ప్రైవేటు ఉపాధ్యాయులకు వచ్చేసరికి వారి యాజమాన్యాలే దరఖాస్తులను నేరుగా ఇచ్చేస్తున్నాయి. కొన్నిచోట్ల జిల్లాల విద్యాధికారుల సీల్‌, సంతకాలను వారు ఫోర్జరీ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రైవేటు బడుల్లో 1-5 తరగతులు బోధించేవారు, క్లర్కులు సైతం ఉపాధ్యాయులమంటూ ఓటర్లుగా నమోదు చేయించుకుంటున్నట్లు విమర్శలున్నాయి. అధికార వైకాపా నాయకుల ఒత్తిళ్లతో వారి దరఖాస్తులకు ఉన్నతాధికారులు యథాతథంగా ఆమోదిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

కడపలోని ఒక ప్రైవేటు పాఠశాలలో 12 మంది ఉపాధ్యాయులు ఉండగా.. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏకంగా 40 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. విజయవాడలోని ఓ కార్పొరేషన్‌లో పొరుగు సేవల కింద పనిచేస్తున్న ఉద్యోగిని ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నట్లు చూపించి వైఎస్‌ఆర్‌ జిల్లాలోనే ఓటరుగా నమోదు చేశారు.

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మాంసం దుకాణంలో పనిచేసే ఒకరిని ప్రైవేటు పాఠశాలలో బోధిస్తున్నట్లు చూపి ఓటర్ల జాబితాలో చేర్చారన్న ఆరోపణలున్నాయి. ఈ ఒక్క జిల్లాలోనే 2,892 ప్రైవేటు ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదయ్యారు. ఇందులో 500 వరకు బోగస్‌వేనని తెలుస్తోంది.

ఉపాధ్యాయుల ఓట్ల నమోదు సమయంలో అనంతపురం, నెల్లూరు జిల్లాల విద్యాధికారులను బదిలీ చేశారు. అధికార పార్టీ నేతల మాట వినడం లేదనే కారణంతోనే వారిని బదిలీ చేసినట్లు విమర్శలొచ్చాయి. రెండు చోట్ల కొత్తవారిని నియమించకుండానే ప్రాంతీయ సంయుక్త సంచాలకులను ఇన్‌ఛార్జులుగా కొనసాగిస్తున్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని