సాగర నగరాన నేరగాళ్ల పడగ
విశాఖపట్నం ప్రశాంతతకు నిలయం. ఆహ్లాదానికి చిరునామా. రాష్ట్రానికి ఆర్థిక రాజధాని. దేశ భద్రతకు సంబంధించిన రక్షణ స్థావరాలున్న కీలక ప్రాంతం.
ఆందోళన కలిగిస్తున్న వరుస నేరాలు
హత్యలు, భూకబ్జాలు, అపహరణలు, సెటిల్‌మెంట్లతో కలకలం
విపక్షాలను కట్టడి చేయడంలో పోలీసులు బిజీ
అదే నేరగాళ్లు రెచ్చిపోవడానికి కారణమని విమర్శలు
ఈనాడు- విశాఖపట్నం, అమరావతి: విశాఖపట్నం ప్రశాంతతకు నిలయం. ఆహ్లాదానికి చిరునామా. రాష్ట్రానికి ఆర్థిక రాజధాని. దేశ భద్రతకు సంబంధించిన రక్షణ స్థావరాలున్న కీలక ప్రాంతం. అలాంటి నగరంలో వరుస హత్యలు, అపహరణలు, రౌడీషీటర్ల దందాలు, భూకబ్జాలు, సెటిల్‌మెంట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. నేర నియంత్రణ, ఛేదన, శాంతిభద్రతల పరిరక్షణ వంటి వాటి కంటే అధికార పార్టీ నాయకులకు గిట్టనివారిపైన కేసులు బనాయించటం, ప్రతిపక్ష నాయకులు, ప్రజాసంఘాల నేతలను అడ్డుకోవటం, నిర్బంధించటమే ప్రధాన విధి అన్నట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేరగాళ్లకు ఇది అవకాశంగా మారుతోంది. ఫలితంగా అంతకు ముందు అయిదేళ్లతో పోలిస్తే.. వైకాపా అధికారం చేపట్టిన తర్వాత మూడున్నరేళ్లలో నేరాలు పెరిగాయి. శాంతిభద్రతలు దిగజారుతున్నాయి. నేర నియంత్రణ కొరవడింది. హత్యాసంస్కృతి వేగంగా విస్తరిస్తోంది. భూ మాఫియా వేళ్లూనుకుంటోంది.
భయం గొలిపేలా హత్యలు.. హత్యాయత్నాలు
విశాఖలో 2018లో హత్యాయత్నాలు 55 నమోదయ్యాయి. గతేడాది ఆ సంఖ్య 76కు పెరిగింది. 2018లో 32 హత్యలు చోటుచేసుకోగా నిరుడు 36 హత్య కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జులై నుంచి సెప్టెంబరు మధ్య మూడు నెలల్లో 11 హత్యలు జరిగాయి.
* ఆగస్టు 17న ఎంవీపీ కాలనీ ఉషోదయ కూడలిలో రౌడీషీటర్ అనిల్‌ను ఇద్దరు చంపారు. కనీస గస్తీ ఉన్నా, పోలీసులు సత్వరమే ఘటనాస్థలానికి చేరుకోగలిగినా ఈ హత్యను నియంత్రించేందుకు వీలుండేది.
* ఈ ఏడాది సెప్టెంబరు 8న మదీనాబాగ్ జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలోని ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు తల్లీ కుమారులను అంతమొందించారు.
* ఓ సీరియల్ కిల్లర్.. జులై 9న పెందుర్తి బృందావన్ గార్డెన్స్‌లో నల్లమ్మపై తొలుత దాడి చేశాడు. ఆగస్టు 8న చినముషిడివాడలో అపార్ట్‌మెంటు కాపలాదారులైన ఎస్.అప్పారావు, లక్ష్మిలను రాడ్‌తో కొట్టి చంపాడు. ఆగస్టు 14న సుజాతనగర్ నాగమల్లి లే అవుట్‌లో కాపలాదారు హత్య చేశాడు. మొదటి ఘటన జరిగినప్పుడే పోలీసులు అప్రమత్తమై హంతకుడ్ని పట్టుకుని ఉంటే మిగతావి చోటుచేసుకునే అవకాశం ఉండేది కాదు.
రౌడీషీటర్లదే రాజ్యం
హత్యలు, సెటిల్‌మెంట్లు, ఇతర నేరాల్లో రౌడీషీటర్ల ప్రమేయం పెరిగింది. ప్రాంతాలవారీగా పంచుకుని పంచాయితీలు చేస్తున్నారు. రౌడీషీటర్ల మధ్య ఆధిపత్య పోరు, పంపిణీల్లో విభేదాలు తీవ్రమై హత్యలకూ దారితీస్తున్నాయి. కొందరు స్థిరాస్తి వ్యాపారులు రౌడీషీటర్లను అడ్డం పెట్టుకుని బెదిరిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో పాసి రామకృష్ణ అనే స్థిరాస్తి వ్యాపారిని కొంతమంది రౌడీషీటర్లు ఓ గదిలో బంధించి, మెడపై కత్తి పెట్టి బెదిరించి రూ.కోటి డిమాండు చేశారు. పోలీసులు వారిని పట్టుకున్నా, ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. తన దగ్గర తీసుకున్న రూ.500 తిరిగివ్వాలని అడిగినందుకు ధర్మాల అప్పలరెడ్డి (అప్పన్న) అనే వ్యక్తిని రౌడీషీటర్ గౌరీశంకర్ దారుణంగా చంపేశాడు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
* ప్రభుత్వ భూములను రౌడీషీటర్లు ఆక్రమిస్తున్నారు. తిరగబడలేని వారిని గుర్తించి, వారి స్థలాలకు నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేస్తున్నారు. అగనంపూడిలోని సర్వే నంబరు 141లో చేకూరి సత్యవతి, అయినంపూడి సత్యవతిలకు అయిదేసి సెంట్ల చొప్పున భూమి ఉంది. గాజువాకకు చెందిన రౌడీషీటర్ పువ్వుల శ్రీనుతో పాటు మరికొందరు నకిలీపత్రాలు సృష్టించి, కబ్జాకు ప్రయత్నించారు. బాధితుల్ని బెదిరించడంతో వారిపై కేసు నమోదైంది. ఈ తరహా ఘటనలు విశాఖలో తరచూ చోటుచేసుకుంటున్నాయి.
150 మంది రౌడీషీటర్లూ హత్య కేసుల్లో నిందితులే
విశాఖలో 646 మంది రౌడీషీటర్లు ఉన్నారు. వీరిలో 150 మంది హత్య కేసుల్లో నిందితులే. అదే తమ అర్హతగా భావిస్తూ వీరు తమ ప్రాంతాల్లో సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. హింసాత్మక నేరాలకు పాల్పడుతున్నారు. గంజాయి, మాదకద్రవ్యాల సరఫరా, బెట్టింగ్‌ల్లో వీరి ప్రమేయం ఉంటోంది. ఈ ముఠాలపైన, వీరిని నడిపించేవారిపైన పోలీసుల నిఘా పెద్దగా ఉండట్లేదు. 150 మందికి పైగా రౌడీషీటర్లు పోలీసు రికార్డుల్లోని చిరునామాల్లో లేరు. పోలీసులు వారి ఆచూకీ కనుక్కొని, కదలికలు, కార్యకలాపాలపై నిఘా పెట్టలేకపోతున్నారు. రౌడీషీటర్లలో చాలామందికి అధికార పార్టీ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. కొందరైతే అధికార పార్టీ నేతలకు ముఖ్య అనుచరులు. పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో వారు మరింత రెచ్చిపోతున్నారు. ఫలితంగా నగరంలో దాడులు పెరిగాయి. 2018లో దాడులపై 545 కేసులు నమోదయితే.. గతేడాది ఆ సంఖ్య 667కు పెరిగింది.
విస్తరిస్తున్న ముఠాల సంస్కృతి
విశాఖ నగరంలో ఇటీవల క్రిమినల్ గ్యాంగ్‌ల సంస్కృతి శరవేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం హైపర్‌బోయ్స్, దండుపాళ్యం, చిట్టిమాము, ఖాసిం గ్యాంగ్, త్రీస్టార్ గ్యాంగ్ వంటివి క్రియాశీలకంగా ఉంటున్నాయి. చిట్టిమాము ప్రత్యర్థి ఖాసిం హత్యకు గురైనా, అతని అనుచర వర్గం చురుగ్గానే ఉంది. చిట్టిమాము- ఖాసిం ముఠాల మధ్య గ్యాంగ్‌వార్ నడుస్తోంది. చిట్టిమాము తన చుట్టూ ఆరుగురు బౌన్సర్లను పెట్టుకుని తిరుగుతాడని పోలీసులే గుర్తించారు. ఇటీవల కొత్తగా తెరపైకి వచ్చిన ‘హైపర్ బాయ్స్’ గ్యాంగ్ కత్తులు, మారణాయుధాలతో బెదిరిస్తూ సెటిల్‌మెంట్లకు పాల్పడుతోంది. గంజాయి, మాదకద్రవ్యాల సరఫరా, నేరాలు, సెటిల్‌మెంట్లతో ఈ గ్యాంగులు సొమ్ములు సమకూర్చుకుంటున్నాయి.
ఫిర్యాదులకు.. కేసులకు పొంతనే లేదు
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూ వివాదాలపై విచారణ కోసం ‘ప్రీ లిటిగేషన్ కౌన్సెలింగ్ ఫోరం (పీఎల్‌సీఎఫ్)’ ఏర్పాటు చేశారు. ఈ విభాగానికి ఇప్పటి వరకూ 1,252 ఫిర్యాదులు అందాయి. కానీ వాటిపై 25 కేసులే నమోదు చేశారు. ఆ కేసుల్లోనూ భూకబ్జా నిరోధక చట్టం కింద సెక్షన్లను వర్తింపజేయట్లేదన్న విమర్శలున్నాయి. కేసు నమోదు చేయదగ్గ ఫిర్యాదులకూ సివిల్ వివాదాల ముద్ర వేసి కోర్టులోనే తేల్చుకోవాలని పంపేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఈ ఉదాసీనతే కబ్జాదారులకు ఊతమవుతోంది. గతంలో కమిషనరేట్ పరిధిలో పోలీసు సబ్‌డివిజన్‌కు ఒకటి చొప్పున ‘డాక్యుమెంట్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ సెల్’ ఏర్పాటు చేసి సీఐ స్థాయి అధికారితో కబ్జా కేసులపై దర్యాప్తు చేయించేవారు. తెదేపా హయాంలో 2015లో భూ కబ్జాలకు సంబంధించి 35 కేసులు నమోదు చేశారు. 198 మంది నిందితుల్ని గుర్తించారు. వారిలో 17 మందిపై రౌడీషీట్లు తెరిచారు. భూకబ్జాలకు పాల్పడిన వారి నుంచి 21 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ప్రస్తుతం అలాంటి చర్యలు కొరవడ్డాయి.
ఎక్కువ సమయం ఆ విధుల్లోనే..
ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ప్రభుత్వ విధానాల్ని వ్యతిరేకిస్తూ ఏదైనా నిరసనకు పిలుపునిస్తే చాలు ముందస్తు అరెస్టులు, నోటీసులు, గృహనిర్బంధాలు, ఆంక్షల పేరిట పోలీసు యంత్రాంగం ఆ విధుల్లోనే ఉంటోంది.
* తెదేపా అధినేత రెండేళ్ల కిందట ఉత్తరాంధ్ర పర్యటనకు వెళితే ఆయన్ను విశాఖపట్నం విమానాశ్రయంలోనే అడ్డుకుని వెనక్కి పంపేశారు.
* జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జనవాణి నిర్వహించేందుకు వెళితే.. వాహనం నుంచి బయటకు కనిపించేందుకు వీల్లేదంటూ ఆంక్షలు విధించి మరీ అడ్డుకున్నారు. అర్ధరాత్రి తర్వాత ఆయన బస చేసిన హోటల్‌లోకి ప్రవేశించి అలజడి సృష్టించారు. మంత్రుల కాన్వాయిపై రాయి విసిరారని జనసేన శ్రేణులపై కేసులు పెట్టారు. రాత్రికి రాత్రే వారిని యుద్ధప్రాతిపదికన గాలించి మరీ అరెస్టు చేశారు.
* రుషికొండలో నిర్మాణాలను పరిశీలించేందుకు వెళ్తున్న తెదేపా శ్రేణులను అడ్డుకుని రణరంగం సృష్టించారు.
* ముఖ్యమంత్రి పర్యటనలు ఉన్నప్పుడు మొత్తం బారికేడ్లు పెట్టేయటం, పరదాలతో కప్పేయటం, ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల నాయకుల్ని గృహనిర్బంధం చేయటం వంటి వాటికే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. ప్రతిపక్షాలు కార్యక్రమాలకు పిలుపునిచ్చినప్పుడల్లా రోజుల తరబడి సెక్షన్ 30, ఐపీసీ సెక్షన్ 144 కింద ఆంక్షలు విధించి అడ్డుకుంటున్నారు. అధికార పార్టీ చెప్పిన పనులు చక్కబెట్టడంలో పోలీసులు బిజీగా ఉంటే నేరగాళ్లు, రౌడీలు నేర కార్యకలాపాలతో రెచ్చిపోతున్నారన్న విమర్శలున్నాయి
ఆ చర్యలు సరిపోవట్లేదు
విశాఖలో నేర నియంత్రణకు సంబంధించి నగర పోలీసులు కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో దాదాపు 50 మందికి పైగా రౌడీషీటర్లను, వారికి సహకరిస్తున్న మరో 30 మందిని వివిధ కేసుల్లో అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇద్దరు రౌడీషీటర్లను నగర బహిష్కరణ చేశారు. రౌడీషీటర్లు, గ్యాంగుల కార్యకలాపాలపైన నిఘా పెడుతూ అదుపులోకి తీసుకుంటున్నారు. గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేకంగా ‘యాంటీ నార్కోటిక్ సెల్’ ఏర్పాటు చేశారు. అయితే నేర నియంత్రణకు ఈ చర్యలు సరిపోవట్లేదు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Maharashtra: మహారాష్ట్ర నూతన గవర్నర్‌గా కెప్టెన్ అమరీందర్ సింగ్..?
-
General News
JEE Main 2023: జేఈఈ మెయిన్ JAN 28- 30 అడ్మిట్ కార్డులొచ్చేశాయ్.. డౌన్లోడ్ చేసుకోండిలా!
-
Movies News
Rajinikanth: మద్యానికి బానిసైన నన్ను ఆమె ఎంతో మార్చింది..: రజనీకాంత్
-
India News
Cheetahs: మళ్లీ ఎగిరొస్తున్న చీతాలు.. ఈసారి ఎక్కడినుంచంటే..?
-
Movies News
Jamuna: ఏడాదిపాటు మాట్లాడుకోని సావిత్రి - జమున
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు