ఫిబ్రవరి 23 నుంచి శ్రీవారి బాలాలయ నిర్మాణం

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి కంపార్ట్‌మెంట్లలో రాత్రినుంచి వేచి ఉన్న భక్తులకు ఉదయాన్నే దర్శనం కల్పించేందుకే ఈ నెల 1నుంచి బ్రేక్‌ సమయం మార్చినట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.

Published : 04 Dec 2022 04:34 IST

బ్రేక్‌ దర్శన సమయం మార్పుతో సత్ఫలితాలు
తితిదే ఈవో ధర్మారెడ్డి

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి కంపార్ట్‌మెంట్లలో రాత్రినుంచి వేచి ఉన్న భక్తులకు ఉదయాన్నే దర్శనం కల్పించేందుకే ఈ నెల 1నుంచి బ్రేక్‌ సమయం మార్చినట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. దీంతో మూడు రోజులుగా మంచి ఫలితాలు వస్తున్నాయని, నెల రోజులు పరిశీలించాక ఈ విధానాన్ని కొనసాగిస్తామని చెప్పారు. తిరుమలలోని అన్నమయ్యభవన్‌ నుంచి శనివారం డయల్‌ ఈవో కార్యక్రమంలో ఆయన భక్తుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వివరాలు..

* ఆనంద నిలయానికి బంగారు తాపడం చేసేందుకు ఫిబ్రవరి 23 నుంచి బాలాలయ నిర్మాణం ప్రారంభిస్తాం. ఆరు నెలల్లో ఈ పనులు పూర్తిచేయాలన్నది ప్రణాళిక. 1957-58లో స్వర్ణతాపడం సందర్భంగా అనుసరించిన దర్శనం పద్ధతులనే ఇప్పుడూ అమలుచేస్తాం.

* తిరుమలలో ఈ నెల 5న చక్రతీర్థ ముక్కోటి, 7న కార్తికపర్వ దీపోత్సవం, 12 నుంచి 18వరకు ధర్మగిరి వేదవిజ్ఞాన పీఠంలో శ్రీశ్రీనివాస విశ్వశాంతి హోమం నిర్వహిస్తాం. 16న ధనుర్మాసం ప్రారంభం కానుండడంతో 17 నుంచి జనవరి 14 వరకు స్వామివారికి వేకువజామున సుప్రభాతసేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. 27న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఉంటుంది.

నిత్యం 80 వేలమందికి వైకుంఠద్వార దర్శనం

జనవరి 2న వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజుల పాటు అంటే 11వ తేదీ వరకు శ్రీవారి మూలమూర్తిని వైకుంఠద్వార ప్రదక్షిణం చేసి దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో తెలిపారు. ‘ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆన్‌లైన్‌లో ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300), ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు జారీచేస్తాం. సర్వదర్శనం టోకెన్లను రోజుకు 50వేల చొప్పున పది రోజులకు సరిపడా 5 లక్షల మందికి తిరుపతి, తిరుమలలోని 10 కేంద్రాల ద్వారా ఒకే దఫాలో నిరంతరాయంగా అందిస్తాం. భక్తులు ఆధార్‌కార్డుతో రావాలి. ప్రత్యేక దర్శనం టికెట్లను రోజుకు 25వేల చొప్పున 2.5 లక్షల టికెట్లను ఆన్‌లైన్‌లో జారీచేస్తాం. జనవరి నెల కోటాతో పాటు వీటినీ విడుదల చేస్తాం. శ్రీవాణి టికెట్ల (రూ.10వేలు+రూ.500)ను రోజుకు 2వేల చొప్పున ఆన్‌లైన్‌లో ఇస్తాం. పది రోజుల పాటు స్వయంగా వచ్చే ప్రొటోకాల్‌ వీఐపీలకే టికెట్లు కేటాయిస్తాం. సిఫార్సు లేఖలు తీసుకోం. గతేడాది మాదిరిగానే వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రజలకు రోజుకు వెయ్యిమందికి అవకాశం కల్పిస్తాం’ అని వివరించారు. నూతన సంవత్సరం, వైకుంఠద్వార దర్శనం దృష్ట్యా ఈనెల 29 నుంచి జనవరి 3 వరకు గదుల ముందస్తు బుకింగ్‌ను రద్దు చేశామని, ఆయా రోజుల్లో సీఆర్వోలోనే మరిన్ని కౌంటర్లు పెంచి గదులు కేటాయిస్తామని చెప్పారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని