Andhra News: అగ్నిపర్వతం సినిమా చూపిస్తూ మెదడుకు శస్త్రచికిత్స

అత్యంత క్లిష్టమైన మెదడు శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలో ఆ రోగి మెలకువగా ఉండటమే కాదు.. అతనికి ఎంతో ఇష్టమైన సూపర్‌స్టార్‌ కృష్ణ నటించిన అగ్నిపర్వతం సినిమా, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం వీడియో చూపించారు.

Updated : 25 Jan 2023 17:02 IST

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: అత్యంత క్లిష్టమైన మెదడు శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలో ఆ రోగి మెలకువగా ఉండటమే కాదు.. అతనికి ఎంతో ఇష్టమైన సూపర్‌స్టార్‌ కృష్ణ నటించిన అగ్నిపర్వతం సినిమా, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం వీడియో చూపించారు. గుంటూరులోని శ్రీసాయి హాస్పిటల్‌ న్యూరోసర్జన్‌ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి ఈ శస్త్రచికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో ఉచితంగా చేశారు. ఆ వివరాలను శ్రీనివాసరెడ్డి, మరో వైద్యుడు డాక్టర్‌ త్రినాథ్‌ విలేకరులకు శనివారం తెలిపారు. ప్రకాశం జిల్లా పుల్లలచెర్వు మండలం ఇసుకత్రిపురాంతకం గ్రామానికి చెందిన గోపనబోయిన పెద ఆంజనేయులు(43) ఏడేళ్లుగా ఎన్ని మందులు వాడినా ఫిట్స్‌ తగ్గట్లేదు. దీంతో గుంటూరులో చూపించుకోగా.. మెదడులో కీలకమైన ఫ్రంటల్‌ ఫ్రీ మోటార్‌ ప్రాంతంలో 7.5 సెంటీమీటర్ల కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కాలు, చేయి పనితీరును ప్రభావితం చేసే మెదడులోని కీలక ప్రాంతంలో కణితి ఉండటంతో రోగి మెలకువగా ఉండగానే శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. గతనెల 25న ఓ వైపు మెదడుకు శస్త్రచికిత్స జరుగుతుంటే మరోవైపు రోగికి ఇష్టమైన కృష్ణ నటించిన అగ్నిపర్వతం సినిమాను ప్రదర్శించారు. రోగి మాట్లాడుతుండగానే శస్త్రచికిత్స ప్రారంభించారు. మధ్యలో తనకు సీఎం జగన్‌ ఇష్టమని చెప్పడంతో ఆయన ప్రమాణస్వీకారం వీడియోను చూపించారు. శస్త్రచికిత్స కచ్చితంగా చేయడానికి కంప్యూటర్‌ నేవిగేషన్‌ సాయం తీసుకున్నారు. సాధారణంగా మెదడుకు శస్త్రచికిత్స చేయాలంటే జనరల్‌ ఎనస్థీషియా ఇస్తారు. కానీ కీలక ప్రాంతంలో కణితి ఉన్నందున స్కాల్ప్‌ బ్లాక్‌ ఎనస్థీషియా ఇచ్చి సర్జరీ పూర్తిచేశారు. రోగి పూర్తిగా కోలుకున్నందున శనివారం ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి చేశారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని