పోలవరం నిధుల కోసం మరో కమిటీ

పోలవరం ప్రాజెక్టులో రీయింబర్స్‌మెంటు నిధులు, అడ్‌హాక్‌ నిధుల అంశాన్ని పరిశీలించేందుకు కేంద్రం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ సభ్యులతో హైదరాబాద్‌లోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయంలో శనివారం ఒక సమావేశం నిర్వహించారు.

Updated : 04 Dec 2022 06:10 IST

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో రీయింబర్స్‌మెంటు నిధులు, అడ్‌హాక్‌ నిధుల అంశాన్ని పరిశీలించేందుకు కేంద్రం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ సభ్యులతో హైదరాబాద్‌లోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయంలో శనివారం ఒక సమావేశం నిర్వహించారు. పోలవరం చీఫ్‌ ఇంజినీరు సుధాకర్‌బాబు, ఎస్‌ఈ నరసింహమూర్తి ఈ సమావేశంలో పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టులో ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం ఖర్చుచేసిన నిధులు, వచ్చే జూన్‌ వరకూ చేయబోయే పనులకు అడ్‌హాక్‌గా నిధులు కలిపి రూ.10,100 కోట్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోరుతోంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశంలో ఇటీవలే ఈ విషయం చర్చకు వచ్చింది. అంతకుముందే జలవనరులశాఖ ఉన్నతాధికారులు దిల్లీ వెళ్లి కేంద్ర జల్‌శక్తి అధికారులతో చర్చించారు. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి కార్యదర్శి పంకజ్‌కుమార్‌తో తాజాగా ఒక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో చర్చల మేరకు నలగురు సభ్యులతో కేంద్ర జల్‌శక్తిశాఖ ఒక కమిటీని నియమించింది. డిజైన్ల డైరెక్టరేట్‌ నుంచి ఇద్దరు, ప్రాజెక్టు వ్యయ డైరెక్టరేట్‌ నుంచి ఇద్దరు అధికారులను ఈ కమిటీలో నియమించారు. పోలవరంలో ఇంతకుముందే అనుమతి పొందిన డీపీఆర్‌ను దాటి, ఆ పరిధిలోకి రాని అంశాలకు నిధులు ఇవ్వబోమని కేంద్రం, పోలవరం అథారిటీ అడ్డుచెబుతూ వస్తున్నాయి. మరోవైపు డ్యాం డిజైన్‌ రివ్యూప్యానెల్‌ సూచించిన సిఫార్సులు, వారు ఆమోదించిన డిజైన్ల మేరకే పనులు చేసినందున వాటికి అయ్యే అదనపు నిధులు కేంద్రం ఇవ్వాల్సిందేనని రాష్ట్రం పట్టుబడుతోంది. ఆ వివాదం తేలకపోవడంతో వివిధ కారణాలను చూపుతూ కేంద్రం పోలవరం నిధులను సరిగా రీయింబర్సు చేయట్లేదు. దీంతో తాజా కమిటీ ఆ అంశాలను అధ్యయనం చేసి కేంద్ర జల్‌శక్తి శాఖకు అవసరమైన సిఫార్సులు చేస్తుంది. ఈ కమిటీ సభ్యులతో హైదరాబాద్‌ పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయంలో శనివారం వివిధ అంశాలపై చర్చలు జరిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని