బై.. బై.. ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడుల వాతావరణం దెబ్బతింది. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం, వెళ్లిపోయేవరకూ పొగపెట్టడంతో చివరకు అమరరాజా చిత్తూరు జిల్లాలో తమ పరిశ్రమ విస్తరణ ఆలోచనను విరమించుకుంది.

Published : 04 Dec 2022 04:54 IST

రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్న పరిశ్రమలు
విధానాల లోపమే ప్రధాన కారణం
ఈటీవీ ప్రతిధ్వని చర్చలో నిపుణులు

ఈటీవీ, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడుల వాతావరణం దెబ్బతింది. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం, వెళ్లిపోయేవరకూ పొగపెట్టడంతో చివరకు అమరరాజా చిత్తూరు జిల్లాలో తమ పరిశ్రమ విస్తరణ ఆలోచనను విరమించుకుంది. ఒక్క అమరరాజాయే కాదు... గతంలో లులూ, ఫాక్స్‌కాన్‌, జాకీ, రిలయన్స్‌ ఇలానే రాష్ట్రాన్ని వీడాయి. పెద్ద కంపెనీలు ఎందుకు ఆంధ్రాను వీడుతున్నాయి? ఈ పరిణామాలతో రాష్ట్రానికి జరుగుతున్న నష్టమేమిటనే అంశంపై శనివారం ‘ఈటీవీ ప్రతిధ్వని’ చర్చ చేపట్టింది. ఇందులో పాలొన్న నిపుణుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.


పారిశ్రామిక విధానంలో దార్శనికత లోపం

రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల ఏర్పాటులో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంలోనే లోపం ఉంది. వైకాపా అధికారంలోకి వచ్చాక పారిశ్రామిక విధానంలో దాదాపు ఏడాదికిపైగా స్పష్టత లేదు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాలను తమకు అవకాశం కల్పించాలని వేడుకునే కాలం పోయింది. ఏ పారిశ్రామికవేత్త అయినా దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశిస్తారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మారిపోతుంటే పెట్టుబడులకు వెనుకాముందూ ఆలోచిస్తారు. రాష్ట్రంలో పన్నులు ఎక్కువగా ఉన్నాయి. పెట్రోలియం ఉత్పత్తుల ధర ఇతర రాష్ట్రాల కంటే రెండు రూపాయలు ఎక్కువ. దీని ప్రతికూల ప్రభావం చాలా ఉంటుంది. ఏ రాష్ట్రం ఎక్కువ ప్రోత్సాహకాలు ఇస్తోంది? రాజకీయంగా, మౌలిక సదుపాయాలపరంగా తమకు అనుకూల వాతావరణం ఉందా? అని ఎవరైనా ఆలోచిస్తారు. పారిశ్రామికవేత్తలను తమకు అవి కావాలి, ఇవి కావాలి, తాము చెప్పింది చేయాలనే షరతులు పెట్టి, ఒత్తిళ్లు తెస్తే అంత ఖర్చు చేసేవారి మనోధైర్యం సన్నగిల్లుతుంది. మూడు రాజధానులు, 30 రాజధానులు అంటే కూడా పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపరు. రిలయన్స్‌ వంటి దిగ్గజ పరిశ్రమలు ఇక్కడ పెట్టుబడుల్ని ఉపసంహరించుకోవాలనుకుంటే చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తలు ఎలా నిలబడగలరు? పారిశ్రామికవేత్తలు కోరుకునే భూమిని ఓటుబ్యాంకు రాజకీయాలతో పంచిపెడితే భవిష్యత్తులో పరిశ్రమలకు భూమి ఎక్కడ దొరుకుతుంది? రాష్ట్రంలోని రాజకీయాల కారణంగా తెలంగాణ లబ్ధి పొందుతోంది. ప్రముఖ కంపెనీలు రాష్ట్రాన్ని ఎందుకు వీడుతున్నాయనే విషయంలో ప్రభుత్వం అంతర్మథనం చేయాలి. తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌ అటోమొబైల్‌ హబ్‌గా తయారైంది. అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో లేవు. ఇటీవల ఓ అధ్యయనం ప్రకారం అప్పుల్లో అగ్రస్థానంలో నిలిచిన తొలి ఐదు రాష్ట్రాలు పారిశ్రామికంగా వెనుకబడ్డాయని తేలింది. అప్పులు తక్కువగా ఉన్న రాష్ట్రాలు పారిశ్రామికంగా ముందజంలో ఉంటున్నాయి.

ఎస్‌.అనంత్‌, ఆర్థికరంగ విశ్లేషకుడు


పెట్టుబడి వాతావరణమే దెబ్బతింది

రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడుల వాతావరణం దెబ్బతింది. సుమారు రూ.10వేల కోట్ల పెట్టుబడిని అమరరాజా తెలంగాణలో పెడుతుంటే పదేళ్లలో భారీగా జీఎస్టీని రాష్ట్రప్రభుత్వం కోల్పోయినట్టే. నిర్మాణరంగ దిగ్గజాలైన ఎల్‌అండ్‌టీ, షాపూర్జీ పల్లోంజీ పనులను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాయి. ఓ పరిశ్రమ వేరేచోటకు వెళ్లిపోయిందంటే.. ఆ ఒక్క పెట్టుబడినే లెక్కగా చూడకూడదు. అనేక అనుబంధరంగాల అభివృద్ధి, ఉపాధి అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాలి. 10వేల మందికి ఉపాధి చూపించే పరిశ్రమ వల్ల పరోక్షంగా మరో 40వేల మందికి ఉపాధి వస్తుంది. ఆ ప్రాంతంలో అనేక వసతులు, సౌకర్యాలు సమకూరుతాయి. సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా పరిశ్రమలు రావాలి. అవి రాష్ట్రానికి శాశ్వత సంపదగా మారాలి. కులం, రాజకీయం, పార్టీల ముద్రవేసి కక్షపూరితంగా వ్యవహరించడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు. నియంతృత్వ విధానాల వల్ల తాత్కాలిక ప్రయోజనమే తప్ప దీర్ఘకాల ఉపయోగం లేదనడానికి ఇరాక్‌, లిబియా, ఉత్తరకొరియా దేశాలు ఉదాహరణగా చెప్పొచ్చు. జీడీపీ ఆదాయం ఎక్కువగా వచ్చే పరిశ్రమలు తరలిపోతే ఖజానా ఆదాయం తగ్గిపోతుంది.

ఓ.నరేశ్‌కుమార్‌, ఐటీ రంగ నిపుణుడు


Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు