పొరుగు సేవల ఉద్యోగులపై వేటు

రాష్ట్రంలోని వివిధ శాఖల్లో కొన్నేళ్లుగా పనిచేస్తున్న పొరుగుసేవల ఉద్యోగుల మెడపై ప్రభుత్వం కత్తి పెట్టింది.

Published : 05 Dec 2022 03:02 IST

వర్క్స్‌ అండ్‌ ఎకౌంట్స్‌ విభాగంలో 17 మంది తొలగింపు
గురుకుల సంక్షేమ వసతి గృహాల్లో 350 మంది ఇంటికే
సోమవారం నుంచి హాజరు తీసుకోవద్దని ఆదేశాలు
పంచాయతీరాజ్‌ శాఖలోనూ అలజడి
కాంట్రాక్టు, పొరుగుసేవల ఉద్యోగులపై వేలాడుతున్న కత్తి

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని వివిధ శాఖల్లో కొన్నేళ్లుగా పనిచేస్తున్న పొరుగుసేవల ఉద్యోగుల మెడపై ప్రభుత్వం కత్తి పెట్టింది. మొదటగా డైరెక్టర్‌ ఆఫ్‌ వర్క్స్‌ అండ్‌ అకౌంట్స్‌ విభాగంలో పదేళ్లలోపు సర్వీసు ఉన్న 17 మందిపై వేటు వేస్తూ డిసెంబర్‌ 1న మెమో ఇచ్చింది. సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల వసతి గృహాల్లో పనిచేస్తున్న సుమారు 300-350 మంది వంట కార్మికులు, కమాటీలు, సహాయకుల్ని తొలగిస్తూ ఆదివారం ఆదేశాలిచ్చింది. సోమవారం నుంచి వారి హాజరు తీసుకోవద్దని స్పష్టంచేసింది. పంచాయతీరాజ్‌ శాఖలో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డ్రైవర్లు, ఆఫీస్‌ సబార్డినేట్లు, స్వీపర్లు, వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న సుమారు 700 మందిలోనూ అలజడి మొదలైంది. మున్ముందు మిగిలిన విభాగాల్లోనూ పొరుగుసేవలు, ఒప్పంద ఉద్యోగులను వదులుకునేందుకు అడుగులు పడుతున్నాయని వాపోతున్నారు. వివిధ శాఖల్లో ఇప్పటికే మంజూరైన పోస్టుల రద్దు, ఉద్యోగుల కుదింపుపై ఉన్నతస్థాయిలో కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. తదనుగుణంగా పొరుగుసేవల ఉద్యోగుల తొలగింపు చేపట్టిందని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.40 లక్షల మంది ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో లక్ష మందిని ప్రభుత్వం ఆప్కాస్‌ విభాగంలోకి తెచ్చింది. 1.40 లక్షల మంది ఇంకా ఏజెన్సీలు, థర్డ్‌ పార్టీల ద్వారా సేవలందిస్తున్నారు. మొత్తంగా పదేళ్లలోపు సర్వీసున్న వారు 60వేల వరకు ఉంటారని అంచనా. ప్రభుత్వ నిర్ణయంతో వీరందరి భవిష్యత్తు ప్రశ్నార్థకం కానుంది. ప్రస్తుతం ఆప్కాస్‌లో చేర్చిన వారిలోనే 17 మందిపై వేటు పడటం గమనార్హం.

ఖాళీ పోస్టుల రద్దు, పునర్‌వ్యవస్థీకరణపై కసరత్తు

గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేసిన వైకాపా ప్రభుత్వం.. 1.31 లక్షలకు పైగా ఉద్యోగుల్ని, 2.52 లక్షల మంది వాలంటీర్లను నియమించింది. ఈ ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్ని రద్దుచేసి, శాఖలను పునర్‌వ్యవస్థీకరిస్తోందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. కొంతకాలంగా దీనిపై కసరత్తు జరుగుతోంది. విభాగాల వారీగా చూస్తే రాష్ట్రస్థాయిలో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్లు, జిల్లాల్లో సీనియర్‌ అకౌంటెంట్లు, జూనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ అకౌంటెంట్లు తదితర పోస్టుల్లో చాలా ఖాళీలున్నాయి. కిందిస్థాయిలో అటెండర్లు, జమేదారు, దఫేదారు పోస్టులూ ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయాల్సిన అవసరం లేదని, రద్దు చేయొచ్చనేది ప్రభుత్వ భావనగా ఉంది. అందుకే కొత్త నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు.

తొలగింపే శరణ్యమని..

ఏదైనా ఒక పోస్టును భర్తీ చేయాలంటే.. అందుకు ప్రభుత్వం నుంచి మంజూరు తప్పనిసరి. అలా ఖాళీగా ఉంటేనే అందులో శాశ్వత నియామకాలు చేపట్టడమో, లేదంటే ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులతో భర్తీ చేయడమో సాధ్యం. ఇలా మంజూరైన జూనియర్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టుల్లోనే కొన్నాళ్లుగా ఒప్పంద, పొరుగు సేవల కింద డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డేటా ప్రాసెసింగ్‌ ఆఫీసర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ అకౌంటెంట్లుగా పనిచేస్తున్నారు. శాశ్వత నియామకాలు లేకుండా ఖాళీగా ఉన్న ఈ పోస్టుల్ని రద్దు చేయాలంటే ముందుగా అక్కడ పనిచేస్తున్న వారిపై వేటు తప్పనిసరి. ఈ క్రమంలోనే తొలి వేటు వర్క్స్‌ అండ్‌ అకౌంట్స్‌ విభాగంలోని 17 మందిపై పడిందని సమాచారం.

* సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గతంలో 1:80 విధానంలో వంటవారు, సహాయకులు, కమాటీలను నియమించేవారు. ఇప్పుడు 1:120కి మార్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 300-350 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోతున్నారని అంచనా.

* పంచాయతీరాజ్‌ పరిధిలో ఉపాధిహామీ పథకం కింద ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డ్రైవర్లు, ఆఫీస్‌ సబార్డినేట్లు, స్వీపర్లు, వాచ్‌మెన్‌గా పలువురిని నియమించారు. వీరంతా ఆప్కాస్‌లో ఉన్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద చేపట్టే నిర్మాణాలకు మంజూరైన నిధుల్లోంచి 3% చొప్పున అడ్మినిస్ట్రేటివ్‌ ఛార్జీలుగా వసూలు చేస్తారు. అందులో నుంచే వీరికి జీతాలు చెల్లిస్తున్నారు. పదేళ్లలోపు వారిని తొలగిస్తున్న నేపథ్యంలో తమ పరిస్థితి ఏమిటనే ఆందోళన వీరిలో వ్యక్తమవుతోంది.

పదేళ్ల ప్రామాణికంలో మతలబు?

గ్రామ, వార్డు సచివాలయాల్లోని సిబ్బంది ద్వారా క్షేత్రస్థాయికి సేవలను చేరువ చేశామని ప్రభుత్వం చెబుతోంది. అలాంటప్పుడు అదే తరహా సేవలందించే ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగుల అవసరమేంటన్న ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అభిప్రాయం మేరకు వారిపై వేటు వేస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో అధిక శాతం గత ప్రభుత్వ హయాంలో నియమితులైన వారే. 2009-2014 మధ్య కూడా కొందరిని తీసుకున్నారు. పదేళ్లకు మించి పనిచేస్తున్న వారికి ప్రస్తుతానికి ఉపశమనం లభించినా.. భవిష్యత్తులో వారికీ ఉద్వాసన తప్పదని ఉద్యోగవర్గాలు పేర్కొంటున్నాయి. ఉద్యోగుల్లో ఆగ్రహావేశాలు రాకుండా ఉండేందుకు వర్క్స్‌ అండ్స్‌ అకౌంట్స్‌ విభాగానికే ఈ నిర్ణయాన్ని పరిమితం చేసినట్లుగా ప్రభుత్వం నమ్మిస్తోందని చెబుతున్నారు.

తొలగింపు మెమో భావ్యం కాదు

‘వర్క్స్‌ అండ్‌ అకౌంట్స్‌ విభాగంలో పదేళ్లలోపు పనిచేసిన ఉద్యోగులను విధుల్లోంచి తొలగించాలని ఇచ్చిన మెమోపై ఉన్నతాధికారులను సంప్రదించగా.. అది ఆ ఒక్క శాఖలోని వారికి మాత్రమేనని, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇచ్చామని చెప్పారు. మిగిలిన శాఖల్లోని ఉద్యోగులకు, ఈ మెమోకు సంబంధం లేదన్నారు. కాబట్టి ఆందోళన అవసరం లేదు’ అని ఏపీ జేఏసీ అమరావతి నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, వైవీ రావు, ఏపీ కాంట్రాక్టు, ఒప్పంద ఉద్యోగుల జేఏసీ నాయకులు కె.సుమన్‌, భానోజీరావు పేర్కొన్నారు. ‘ఉద్యోగుల తొలగింపు ఆదేశాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. ఆ విభాగంలో ప్రత్యేక కారణాలుంటే మరో శాఖలో సర్దుబాటు చేయాలి’ అని డిమాండు చేశారు. ‘ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులతో కలిపితే రాష్ట్రంలో పది లక్షల మంది ఉంటారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌లో పనిచేసే ప్రతి ఒక్కరినీ క్రమబద్ధీకరిస్తామని, శాశ్వతంగా నియమిస్తామని ఎన్నికల సమయంలో జగన్‌ హామీ ఇవ్వడంతోనే.. వారంతా ఆయనకు ఓటేసి గెలిపించారు. ఖాళీగా ఉన్న 2.32 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని జగన్‌ నెరవేర్చకపోగా.. ఉన్న ఉద్యోగులనే తీసేస్తున్నారు. ప్రైవేటు సంస్థల్లో పనిచేసిన వారిని తొలగించాలన్నా.. ముందు నోటీసు ఇచ్చి, మూడు నెలల జీతం చెల్లిస్తారు. పదేళ్లు పనిచేసి, వయోపరిమితి కోల్పోయాక ఇప్పుడు బయటకు పంపిస్తే వారు ఎక్కడికి వెళ్లాలి’ అని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.హేమంత్‌కుమార్‌ పశ్నించారు.


ఉద్యోగ సంఘాల ఆగ్రహం

ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నేతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అధికారంలోకి వస్తే ఒక్క ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగినీ తొలగించబోమని హామీ ఇచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి.. అందుకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడుతున్నారు. దీనిపై పోరాటానికి సిద్ధమని స్పష్టం చేస్తున్నారు. ‘చాలీచాలని జీతాలతో ఎనిమిదేళ్లకు పైగా పనిచేస్తున్న ఉద్యోగుల్ని, వారి కుటుంబాల్ని రోడ్డున పడేయటం మంచిది కాదు. తక్కువ మంది ఉద్యోగులతోనే కోర్టు కేసులు, అధిక పనిభారాన్ని మోస్తున్నాం. మిగతా శాఖలకు లేని నిబంధనలు ఈ శాఖకే ఎందుకు? 17 మంది ఉద్యోగుల్ని తొలగిస్తూ ఇచ్చిన మెమోను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి. వారిని విధుల్లోకి తీసుకోవాలి. అసోసియేషన్‌ తరఫున వారికి అండగా నిలుస్తాం’ అని ఏపీ పే అండ్‌ అకౌంట్స్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌ఎస్‌ హరనాథ్‌, సీహెచ్‌వీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ‘ఉద్యోగులను ఉన్నపళంగా తొలగించాలని ఆదేశాలివ్వడాన్ని ఖండిస్తున్నాం. అన్ని శాఖల్లోనూ ఇదే నిర్ణయం అమలుకు తొలి అడుగు వేసినట్లు భావిస్తున్నాం. తొలగింపు ఆదేశాలను వెనక్కి తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేస్తాం’ అని ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక జేఏసీ ఛైర్మన్‌ ఏవీ నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎం.బాలకాశి హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని