సీమగర్జనకు బలవంతంగా జనసమీకరణ.. పరీక్షలు వాయిదా, విద్యాసంస్థలకు సెలవు

మూడు రాజధానులకు జై కొట్టించేందుకు తలపెట్టిన ‘సీమగర్జన’ను విజయవంతం చేయాలని వైకాపాతో పాటు అధికార యంత్రాంగం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి.

Updated : 05 Dec 2022 09:18 IST

బ్యానర్లు, కరపత్రాల బాధ్యత కార్పొరేషన్‌ అధికారులకు

ఈనాడు, కర్నూలు: మూడు రాజధానులకు జై కొట్టించేందుకు తలపెట్టిన ‘సీమగర్జన’ను విజయవంతం చేయాలని వైకాపాతో పాటు అధికార యంత్రాంగం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ మైదానంలో సోమవారం ఉదయం పది గంటలకు సభ ప్రారంభం కానుంది. ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల నుంచి ప్రజలను తరలించాలని వైకాపా అధిష్ఠానం శ్రేణులను ఆదేశించింది. ఆయా జిల్లాల నుంచి రవాణాశాఖ 770 పాఠశాల బస్సులను ఆధీనంలోకి తీసుకుంది.

ఒక్కో మహిళా సంఘం నుంచి ఇద్దరు-ఐదుగురిని తరలించేలా సంఘం లీడర్లకు ఆదేశాలందాయి. సభకు రాని సంఘాలకు రూ.వంద జరిమానా ఉంటుందని సెల్‌ఫోన్‌లలో సందేశాలు పంపారు. నగరంలో ఉదయం ఆరు గంటల నుంచే ట్రాఫిక్‌ ఆంక్షలు అమలవుతాయని, దుకాణాలను మూసివేయాలని ఆదేశాలిచ్చారు. ఇటీవల కర్నూలు జిల్లాలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటనకు విశేష స్పందన రావడంతో అదేచోట మూడు రాజధానుల స్వరాన్ని వినిపించాలని అధికార పార్టీ భావిస్తోంది. జేఏసీ పేరుతో ముందుండి నడిపిస్తోంది.

* రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో సోమవారం నుంచి పీజీ, బీపీఈడీ, ఎంపీఈడీ రెండో సెమిస్టర్‌ పరీక్షలు జరగాల్సి ఉండగా తొమ్మిదో తేదీకి వాయిదా వేశారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. విద్యార్థులను బడి బస్సుల్లో సభకు పంపించాలని యాజమాన్యాలకు వైకాపా నేతలు మౌఖిక ఆదేశాలిచ్చారు. ఫార్మెటివ్‌-2 పరీక్షలుండటంతో పాఠశాల యాజమాన్యాలు తలలు పట్టుకున్నాయి.

* కర్నూలు ఎస్పీ కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమాన్ని రద్దుచేశారు. ఉమ్మడి కర్నూలుతోపాటు కడప, అనంతపురం జిల్లాల నుంచి వెయ్యి మంది పోలీసులకు గర్జనసభ బందోబస్తు విధులు అప్పగించారు.

* సభ ఏర్పాట్లలో కర్నూలు కార్పొరేషన్‌ కీలకంగా వ్యవహరించింది. అధికారులు సొంత నిధులతో కరపత్రాలు, బ్యానర్లు వేయించేలా ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. నిర్వహణ ఖర్చు ఎవరు భరించాలన్న అంశంపై విభేదాలు రాగా, వైకాపా జిల్లా కార్యాలయం నుంచి ఉమ్మడి జిల్లాలోని ద్వితీయ శ్రేణి నాయకులకు ఫోన్‌ చేసి విరాళాలు సేకరించినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని