దేశ భాషలందు తెలుగు లెస్స
దేశ భాషలందు తెలుగు లెస్స అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కొనియాడారు.
కొనియాడిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
జై ఆంధ్రప్రదేశ్ అన్న ప్రథమ పౌరురాలు
రాష్ట్రపతి హోదాలో తొలిసారి రాష్ట్రానికి
పౌర సన్మానం చేసిన ప్రభుత్వం
ఏపీ వ్యాపారానికి అనుకూలం: గవర్నర్
మహిళా సాధికారతకు ముర్ము ప్రతిబింబం: సీఎం జగన్
ఈనాడు, అమరావతి: దేశ భాషలందు తెలుగు లెస్స అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కొనియాడారు. దేశ భాషల్లో శ్రేష్ఠమైనదిగా తెలుగు ప్రాచుర్యం పొందిందని.. నన్నయ, తిక్కన, ఎర్రనల రచనలు అద్భుతమైన భావవ్యక్తీకరణకు నిదర్శనాలని ప్రస్తుతించారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టాక ఆదివారం తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ద్రౌపదీ ముర్ముకు విజయవాడ పోరంకిలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో రాష్ట్ర ప్రభుత్వం పౌర సన్మానం నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ 550 ఏళ్ల కిందటే ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ మొల్ల రచించిన ‘మొల్ల రామాయణం’ భారత సాహిత్య చరిత్రలో శిఖరాగ్రాన నిలిచిందని గుర్తుచేశారు. గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కం నేటికీ ప్రజల గుండెల్లో కొలువై ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన దుర్గాబాయి దేశ్‌ముఖ్ వందేళ్ల కిందటే ఆంధ్ర మహిళా సభను ఏర్పాటు చేసి మహిళా సాధికారత కోసం కృషి చేశారన్నారు. ఏపీ కోడలైన సరోజినీ నాయుడు ఉప్పు సత్యాగ్రహంలో కీలకంగా వ్యవహరించారని.. 1947లో ఉత్తర్‌ప్రదేశ్‌కు తొలి గవర్నర్‌గా కూడా పనిచేశారని చెప్పారు. సరోజినీ ఆదర్శాలను తాను ఝార్ఖండ్ గవర్నర్‌గా ఉన్నప్పుడు పాటించానని ముర్ము వెల్లడించారు.
వారంతా చిరస్మరణీయులు
‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్ నిర్వహించుకుంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, త్రివర్ణ పతాకాన్ని జాతికి అందించిన పింగళి వెంకయ్యలాంటి మహనీయులను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మహిళా సాధికారత గురించి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటుంటాను. రాష్ట్రపతులుగా సేవలందించిన భారతరత్న వీవీ గిరి, నీలం సంజీవరెడ్డిలను గుర్తు చేసుకోవడం నా కర్తవ్య పాలనలో ఉపయుక్తంగా ఉంటోంది’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు.
రాష్ట్రానికి రావడం అదృష్టం
దేశ ప్రజలందరికీ ఆశీర్వాదాలు అందించే శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన ఈ పవిత్ర భూమికి రావడం అదృష్టంగా భావిస్తున్నానని ద్రౌపదీ ముర్ము చెప్పారు. ప్రజలందరికీ సుఖసంతోషాలను ప్రసాదించాలని సోమవారం తిరుమలలో బాలాజీని దర్శించుకుని ప్రార్థిస్తానని తెలిపారు. ‘విజయవాడ ప్రజలకు కనకదుర్గమ్మ ఆశీస్సులు నిండుగా ఉన్నాయి. బౌద్ధ గురువు నాగార్జునుడి పేరుతో నాగార్జునసాగర్‌ను ఇక్కడ నిర్మించడమనేది అభివృద్ధిని మన వారసత్వంతో జోడించే అద్భుత ఘట్టమే. ప్రఖ్యాత నాట్యకళ కూచిపూడికి పుట్టినిల్లయిన కూచిపూడి ఏపీలోనే ఉండటం గర్వకారణం’ అని చెప్పారు.
వందేళ్ల కిందటే
‘జాతీయ విద్యావిధానం-2020లో మన సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూనే ఆధునిక ప్రపంచంలో మనకు ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకునే దిశగా కార్యాచరణ పొందుపరిచారు. దీన్ని డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు వందేళ్ల కిందటే చేసి చూపించారు. బయోకెమిస్ట్రీ రంగంలో ఆయన ప్రయోగాల ఫలితంగానే మానవాళికి అవసరమైన ఎన్నో ఔషధాల సృష్టి జరిగింది. దేశ పురోభివృద్ధిలోనూ ఏపీ ప్రజల భాగస్వామ్యాన్ని కొనసాగించాలి’ అని ఆకాంక్షించారు. జై హింద్, జై భారత్, జై ఆంధ్రప్రదేశ్’ అంటూ రాష్ట్రపతి ప్రసంగాన్ని ముగించారు.
ప్రధాన విద్యాకేంద్రంగా ఏపీ: గవర్నర్
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ.. మూడు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, 20 స్వయంప్రతిపత్తి సంస్థలు, 25 రాష్ట్ర, 4 డీమ్డ్, 5 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలతో ఆంధ్రప్రదేశ్ దేశంలో ఒక ప్రధాన విద్యా కేంద్రంగా ఉందన్నారు. సమీప భవిష్యత్తులో కీలక అభివృద్ధి రంగాల్లో రాష్ట్రం మరింత ముందుకు సాగుతుందని, అధిక వృద్ధి రేటును సాధించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఆంధ్రుల సాంస్కృతిక సంపద, పండుగలు, సాహిత్యం, సంగీతం, నృత్యం, నాటకం, కళలు ప్రజల జీవన విధానాన్ని ప్రతిబింబిస్తాయి. ఓడరేవులు, విమానాశ్రయాలు, రోడ్డు, రైలు మార్గాలు, నిరంతర విద్యుత్తు సరఫరా వంటి మౌలిక వసతులతో ఆంధ్రప్రదేశ్ కొత్త వ్యాపార అవకాశాలకు మార్గం చూపుతోంది’ అని చెప్పారు.
ముర్మూ ప్రతి మహిళకూ ఆదర్శం: సీఎం
మారుమూల గిరిజన గ్రామంలో జన్మించి భారత ప్రథమ పౌరురాలుగా బాధ్యతలు చేపట్టిన ద్రౌపదీ ముర్ము మహిళా సాధికారతకు నిజమైన ప్రతిబింబమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొనియాడారు. ‘దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక గిరిజన మహిళ రాష్ట్రపతి పదవిని చేపట్టడం మనందరికీ గర్వకారణం. సామాజికవేత్తగా, ప్రజాస్వామ్యవాదిగా, అణగారిన వర్గాల కోసం అచంచలమైన కృషి చేసిన వ్యక్తిగా.. అన్నింటికీ మించి ఒక గొప్ప మహిళగా రాష్ట్రపతి ఉదాత్తమైన జీవితం ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం’ అని ప్రస్తుతించారు. వేదికపైనున్న రాష్ట్రపతి ముర్మును ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘ఒడిశాలోని అత్యంత వెనుకబడి మయూర్భంజ్ ప్రాంతంలోని సంతాలీ గిరిజన కుటుంబంలో జన్మించిన మీరు ప్రాథమిక విద్యను పూర్తి చేయడానికి కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. చదువు మాత్రమే జీవితాలను మారుస్తుందని గట్టిగా విశ్వసించి భువనేశ్వర్‌కు వెళ్లి, బీఏ పూర్తి చేశారు. కొన్నాళ్లు నీటిపారుదలశాఖలో ఉద్యోగం చేసి, రాజకీయాల్లోకి వచ్చారు. కౌన్సిలర్‌గా ప్రారంభమై మంత్రి వరకూ రాజకీయ ప్రస్థానం సాగించారు. ప్రజాసేవలో మీ చిత్తశుద్ధి, కార్యదీక్ష, నిజాయతీ మిమ్నల్ని ఝార్ఖండ్ గవర్నర్‌గా అక్కడి నుంచి రాష్ట్రపతి పీఠం అధిరోహించేలా చేశాయి. ప్రతి మహిళా మీలానే స్వయంసాధికారత సాధించాలని, సామాజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా ఎదగాలని కాంక్షిస్తూ.. ఎన్నో కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోంది’ అని పేర్కొన్నారు.
పెద్దగా కనిపించని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు
అనంతరం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి కిషన్‌రెడ్డి, ముఖ్యమంత్రి జగన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర రాష్ట్రపతిని సత్కరించి జ్ఞాపికలను బహూకరించారు. ఈ కార్యక్రమానికి పలువురు వైకాపా ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు కొందరు మంత్రులు కూడా హాజరవకపోవడం చర్చనీయాంశమైంది.
రాజ్‌భవన్‌లో గవర్నర్ విందు
ఈనాడు, అమరావతి: రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గౌరవార్థం గవర్నర్ ఆదివారం రాజ్‌భవన్‌లో విందు ఇచ్చారు. గవర్నర్ దంపతులు బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతి, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, కొందరు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గవర్నర్, ముఖ్యమంత్రి దంపతులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.
తిరుమల చేరుకున్న రాష్ట్రపతి
తిరుమల, న్యూస్‌టుడే: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం రాత్రి తిరుమల చేరుకున్నారు. స్థానిక శ్రీ పద్మావతి అతిథిగృహం వద్ద ఆమెకు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి, సీవీఎస్వో నరసింహకిశోర్ పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. రాష్ట్రపతి సోమవారం ఉదయం 9.30 గంటలకు శ్రీవరాహ స్వామివారిని, 9.40 గంటలకు శ్రీవారిని దర్శించుకుంటారు. పద్మావతి అతిథిగృహంలో అల్పాహారం స్వీకరించి, తిరుపతికి బయలుదేరి వెళతారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
SKY: క్లిష్ట పరిస్థితుల్లోనూ.. ప్రశాంతంగా ఉండటం అలా వచ్చిందే..: సూర్యకుమార్
-
Politics News
KTR: పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్
-
Sports News
IND vs NZ: ఉమ్రాన్ ఇంకా నేర్చుకోవాలి.. మణికట్టు మాంత్రికుడు ఉండాల్సిందే: వసీమ్ జాఫర్
-
India News
Budget 2023: ఎన్నికల ఎఫెక్ట్.. బడ్జెట్లో కర్ణాటకకు ‘ప్రత్యేక’ కేటాయింపులు
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
Virat Kohli: నేను కూడా జంక్‌ఫుడ్ తిన్నా.. కానీ: విరాట్ కోహ్లీ