మరో పాతికేళ్లలో విశ్వగురువుగా భారత్‌

దేశ ప్రజల్లో మహత్తర శక్తి ఉందని, స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి విశ్వగురువుగా భారత్‌ మారుతుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు.

Published : 05 Dec 2022 04:39 IST

విశాఖ నౌకాదళ దినోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

ఈనాడు, విశాఖపట్నం: దేశ ప్రజల్లో మహత్తర శక్తి ఉందని, స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి విశ్వగురువుగా భారత్‌ మారుతుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ఆదివారం విశాఖలోని సాగరతీరంలో నిర్వహించిన నౌకాదళ దినోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నౌకాదళ సిబ్బంది ప్రదర్శించిన విన్యాసాలను తిలకించిన అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 1971 యుద్ధంలో భారత్‌ సాధించిన విజయానికి చిహ్నంగా నౌకాదళ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. ఉజ్వల భవిష్యత్తును సాకారం చేసుకునే దిశగా అమృతకాలంలోకి ప్రవేశించిన ప్రస్తుత తరుణంలో దేశాన్ని ప్రగతిపథంలో నడిపించడానికి మనందరం పునరంకితం కావాలన్నారు.  దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించే సముద్రాలను పరిరక్షించే బాధ్యతను భారత నౌకాదళం సమర్థంగా నిర్వహిస్తోందని ప్రశంసించారు. 

అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన పలు ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను వేదిక పై నుంచే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వర్చువల్‌గా నిర్వహించారు. ‘డిఫెన్స్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ రీసెర్చ్‌ ల్యాబరేటరీ’ కర్నూలులో స్థాపించిన ‘నేషనల్‌ ఓపెన్‌ ఎయిర్‌ రేంజ్‌’ దేశానికి గొప్ప ఆస్తి అని కొనియాడారు. ముదిగుబ్బ- పుట్టపర్తి రహదారి విస్తరణకు శంకుస్థాపన చేశారు. రాయచోటి నుంచి అంగల్లు వరకు నిర్మించిన జాతీయ రహదారి, కర్నూలులో నాలుగు వరుసల రహదారి పైవంతెన, ఆరు వరుసల గ్రేడ్‌ సపరేటర్‌ (పైవంతెన), బుట్టాయగూడెం, చింతూరు, రాజవొమ్మంగి, గుమ్మలక్ష్మీపురంలలో నిర్మించిన నాలుగు ఏకలవ్య పాఠశాలలను రాష్ట్రపతి ప్రారంభించారు. నౌకాదళాధిపతి అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ మాట్లాడుతూ 1971 యుద్ధ సమయంలో తూర్పు నౌకాదళం కీలకపాత్ర పోషించిందని, విశాఖ అప్పుడు కేంద్ర స్థానంగా మారిందన్నారు.

నౌకాదళ దినోత్సవాల్లో భాగంగా నౌకాదళ వీరుల విన్యాసాలకు వీక్షకులు మంత్రముగ్ధులయ్యారు. హాక్‌, మిగ్‌-29కే యుద్ధవిమానాలు వాయువేగంతో గిరగిరా తిరుగుతూ చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. 8వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న ఏఎల్‌హెచ్‌ హెలికాప్టర్‌ నుంచి మెరైన్‌ కమాండోలు పారాచూట్ల సాయంతో వేదిక దగ్గర దిగి ‘ఎ డికేడ్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌- సిగ్నలింగ్‌ పవర్‌ ఆఫ్‌ పార్ట్‌నర్‌షిప్స్‌’ అనే పుస్తకాన్ని రాష్ట్రపతికి అందించగా ఆమె ఆవిష్కరించారు. నౌకాదళ నూతన గీతం ‘కాల్‌ ఆఫ్‌ ది బ్లూ వాటర్స్‌’ను ప్రముఖ గాయకుడు శంకర్‌మహదేవన్‌ పాడి అలరించారు. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, రక్షణశాఖ సహాయమంత్రి అజయ్‌భట్‌, అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, రాష్ట్ర మంత్రులు అమర్‌నాథ్‌, రజిని, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి.సింధు తదితరులు పాల్గొన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని