రాష్ట్రంలో ఈ పూట గడిచేదెలా?

అయిదో తేదీ వచ్చినా ఇంకా రాష్ట్రంలో చాలామంది ఉద్యోగులకు డిసెంబరు నెల జీతాలు అందలేదు.. పెన్షనర్లకు కొందరికి ఇంకా పింఛను జమ కాలేదు.

Updated : 05 Dec 2022 07:05 IST

ఎక్కడా అప్పు పుట్టని పరిస్థితి
జీతాలందక ఉద్యోగులకు కష్టాలు

ఈనాడు-అమరావతి: అయిదో తేదీ వచ్చినా ఇంకా రాష్ట్రంలో చాలామంది ఉద్యోగులకు డిసెంబరు నెల జీతాలు అందలేదు.. పెన్షనర్లకు కొందరికి ఇంకా పింఛను జమ కాలేదు. అనేకమంది టీచర్లు జీతాల కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ఖజానా వెలవెలబోతోంది. మరోవైపు అప్పు పుట్టే పరిస్థితీ కనిపించడం లేదు! ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తన పరిమితి మేరకు అప్పులు చేసింది. దీంతో కొత్తగా బహిరంగ మార్కెట్‌ నుంచి రుణం పుట్టించే పరిస్థితీ లేదు. ఈ మంగళవారం ఆర్‌బీఐ సెక్యూరిటీల వేలంలో అయిదు రాష్ట్రాలు పాల్గొననున్నాయి. రూ. 9,250 కోట్ల రుణం కోసం వారు ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రుణ అనుమతులు లేకపోవడంతో అప్పు తీసుకునే పరిస్థితులు లేకుండా పోయాయి. మరోవైపు ఖజానా నుంచి చెల్లింపులు చేయాలంటే ఓవర్‌ డ్రాఫ్ట్‌లోకి వెళ్లవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఆ వెసులుబాటుకు పరిమితి ఉంటుంది. ఇప్పుడు ఏ రకంగా నిధులు సమీకరిస్తారనేది చూడాలి.

ఏపీ ఇప్పటికే రుణ పరిమితిని దాటేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 44,574 కోట్ల మేర బహిరంగ మార్కెట్‌ రుణానికి కేంద్రం అనుమతులు ఇవ్వగా రాష్ట్రం రూ. 45,503 కోట్ల మేర రుణం స్వీకరించింది. రాష్ట్ర ఆర్థిక పెద్దలు దిల్లీ పెద్దలను కలిసిన నేపథ్యంలో విద్యుత్తు సంస్కరణలు అమలు చేయడం వల్ల అదనంగా ఇచ్చే రుణ పరిమితి నుంచి రెండు వారాల కిందట కొంత అనుమతి లభించింది. అందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 6,300 కోట్లు రుణం ఆ రూపేణా తీసుకునే అవకాశం ఉందని సమాచారం. అమలు చేసిన సంస్కరణల ఆధారంగానే ఈ అనుమతులు లభిస్తాయి. కిందటి ఆర్థిక సంవత్సరంలో రూ. 5,300 కోట్ల మేర ఇలా రుణం పొందే ఆస్కారం ఉన్నా ఏపీకి రూ. 3,200 కోట్ల మేర మాత్రమే అనుమతులు లభించాయి.

నెల ప్రారంభంలో జీతాలు, పెన్షన్లు చెల్లించడానికి రాష్ట్రం కష్టాలు పడవలసి వస్తోంది. రాష్ట్రంలో పెన్షన్లు, జీతాల కోసం రూ. 5,500 కోట్లు అవసరం కాగా, సగం మొత్తాలే చెల్లింపులు జరిగినట్లు సమాచారం. అక్టోబరు నుంచి డిసెంబరు నెలాఖరు వరకు రూ.10 వేల కోట్ల రుణం అవసరమని రిజర్వు బ్యాంకుకు ఇండికేటివ్‌ క్యాలండర్‌ కోసం ఏపీ సమాచారం పంపింది. ఆ ప్రకారం అక్టోబరు నుంచి ఇంతవరకు రూ. 7,000 కోట్ల రుణం అవసరమవుతుందని రాష్ట్ర అధికారులు అంచనా వేశారు. పరిమితులకు మించి రుణం వాడేయడంతో ప్రస్తుతం రూ, 4,913 కోట్ల రుణం తీసుకుంది. ఇప్పటికే రుణాల పరిమితి దాటిపోవడంతో ప్రస్తుతం నిధుల సమీకరణకు ఇబ్బందులు పడవలసి వస్తోందని సమాచారం. పైగా ఇప్పటికే కార్పొరేషన్ల ద్వారా సమీకరించిన రుణాలు దాదాపు రూ.20 వేల కోట్లు దాటిపోయాయి.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని