Seema Garjana: గర్జనకు కొరవడిన స్పందన..ఆసాంతం జగన్‌ భజన

కర్నూలులో సోమవారం నిర్వహించిన రాయలసీమ గర్జన సభ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని పొగడటానికే పెట్టినట్లు నేతలు వ్యవహరించారు.

Updated : 06 Dec 2022 06:50 IST

నేతల ప్రసంగ సమయంలోనే వెనుదిరిగిన ప్రజలు

ఈనాడు, కర్నూలు: కర్నూలులో సోమవారం నిర్వహించిన రాయలసీమ గర్జన సభ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని పొగడటానికే పెట్టినట్లు నేతలు వ్యవహరించారు. రాజకీయేతర ఐకాస నేతలూ చంద్రబాబును విమర్శించి వైకాపా నేతల మన్ననలు పొందే ప్రయత్నం చేశారు. న్యాయరాజధాని మినహా రాయలసీమ అభివృద్ధికి ఎలాంటి డిమాండ్లనూ సభలో లేవనెత్తలేదు. నేతలు ప్రసంగిస్తుంటే హాజరైనవారిలో ఎక్కడా ఉత్సాహం కనిపించలేదు. చివరకు మూడు రాజధానుల నినాదం చెప్పి చేతులెత్తించే ప్రయత్నం చేసినా ప్రజల నుంచి ప్రతిస్పందన కరవైంది. రాజకీయేతర ఐకాస నేతలకు 1-2 నిమిషాలకు మించి ప్రసంగించడానికి మైకు ఇవ్వలేదు. వైకాపా నేతలకు ఐదు నిమిషాలకు పైగా సమయమిచ్చినా వారు ప్రసంగాలతో ఆకట్టుకోలేకపోయారు. ఓర్వకల్లు విమానాశ్రయానికి ఎన్నికలకు ముందే చంద్రబాబు ప్రారంభోత్సవం చేశారు. తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి హోదాలో జగన్‌మోహన్‌రెడ్డి దాన్ని ప్రారంభించిన విషయం విదితమే. సభలో మంత్రి బుగ్గన మాట్లాడుతూ విమానాశ్రయం పూర్తి చేసింది జగనే అంటూ చెప్పుకొచ్చారు. సాగునీటి ప్రాజెక్టులకూ పెద్దపీట వేసినట్లు చెప్పడంతో నిధులిచ్చారా అన్న విమర్శలకు తావిచ్చింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో రాయలసీమ నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులయినా సీమ అభివృద్ధికి ఎవరూ ఏమీ చేయలేదన్నారు. అందులో చంద్రబాబు 14 ఏళ్లు ఉండి అన్యాయం చేశారని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే సీమ నుంచే వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా చేశారని మరిచిపోయారా? లేకపోతే వైఎస్‌ కూడా సీమకు అన్యాయం చేశారని ఒప్పుకొన్నారా? అంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వచ్చాయి.

సమీకరణలో చతికిలబడ్డారు

వైకాపా రాయలసీమ గర్జన సభను లక్షమందితో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని   భావించింది. చివరికి తక్కువ   సామర్థ్యం ఉన్న ఎస్టీబీసీ  మైదానాన్నే నింపలేని పరిస్థితి నెలకొంది. విద్యార్థులు, మహిళలే లక్ష్యంగా ఆంక్షలతో రప్పించాలని ప్రయత్నించినా విజయవంతం కాలేదు. చిత్తూరు, కడప జిల్లాల నుంచి తక్కువ మందే హాజరయ్యారు. సభకు   వచ్చినవారిలో అత్యధిక శాతం ఉమ్మడి కర్నూలు జిల్లావారేనని వైకాపా నాయకులే చెబుతున్నారు. కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌, కుడా ఛైర్మన్‌    కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి.. కర్నూలు నగరంలో    ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ వర్గాలు విడివిడిగా జనసమీకరణ చేసినా సకాలంలో సభ వద్దకు చేర్చలేకపోయారు.  

వేచి చూసినా నిండని కుర్చీలు

ఉదయం 10 గంటలకు సభ ప్రారంభించాలని అనుకున్నా.. 11 గంటల వరకు సభలో కుర్చీలు నిండలేదు. వైకాపా నేతల ప్రసంగం మొదలవగానే విద్యార్థులు, మహిళలు వెనుదిరిగారు. ఆ సమయంలో కొన్ని గ్యాలరీల్లో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. ఎండ ఎక్కువగా ఉండటంతో ప్లకార్డులు నెత్తిన పెట్టుకుని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సభ జరుగుతుండగా విద్యార్థులు వెనుదిరుగుతుండటంతో ఇరువైపులా గేట్లు మూసివేశారు. చాలామంది గోడలు దూకి వెళ్లిపోయారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ వేదిక దిగి వారి వద్దకు వచ్చి, వెళ్లొద్దంటూ అభ్యర్థించినా ఫలితం లేకపోయింది.

ఆ నేతలు గైర్హాజరు

ప్రభుత్వ ఉద్యోగులు కూడా గర్జన సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. 5వ తేదీ వచ్చినా జీతాలు అందకపోవడంతో చాలామంది ఉద్యోగులు గైర్హాజరయ్యారు. కర్నూలు పార్లమెంట్‌ వైకాపా అధ్యక్ష పదవి నుంచి తొలగించినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి సభకు రాలేదు. గర్జనపై ముందు నుంచి సూచనలు చేస్తున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వస్తారనుకున్నా రాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు