కర్నూలులోనే హైకోర్టు

యువకులు, రైతులు, ఈ ప్రాంత భవిష్యత్తు, గౌరవం నిలబెట్టడానికి ఉద్యమ నిర్ణయం తీసుకున్నాం.. హైకోర్టు సాధించే వరకు ఇది కొనసాగుతుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రకటించారు.

Updated : 06 Dec 2022 10:19 IST

త్వరలో జగన్నాథగట్టుపై నిర్మిస్తాం

నలువైపులా పది కి.మీ. పరిధి కనిపించేలా నిర్మాణం

రాయలసీమ గర్జన సభలో ఆర్థిక మంత్రి బుగ్గన

కర్నూలుకు న్యాయ రాజధాని సబబేనన్న పెద్దిరెడ్డి

ఈనాడు, కర్నూలు: యువకులు, రైతులు, ఈ ప్రాంత భవిష్యత్తు, గౌరవం నిలబెట్టడానికి ఉద్యమ నిర్ణయం తీసుకున్నాం.. హైకోర్టు సాధించే వరకు ఇది కొనసాగుతుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రకటించారు. కర్నూలులోని జగన్నాథగట్టుపై త్వరలోనే హైకోర్టు నిర్మించబోతున్నామని స్పష్టం చేశారు. ఎటువైపు నుంచి కర్నూలుకు వచ్చినా పది కి.మీ. ముందు నుంచే కనిపించేలా హైకోర్టు కట్టబోతున్నామని వెల్లడించారు. సోమవారం కర్నూలులో నిర్వహించిన ‘రాయలసీమ గర్జన’లో ఆయన ప్రసంగించారు. ‘బాధ్యతగల వ్యక్తిగా జగన్‌ హైకోర్టు ఇస్తానంటే ఎందుకు అడ్డుపడుతున్నారు? అభివృద్ధి, పరిశ్రమలు, రోడ్లు అంటూ చంద్రబాబు ఏవేవో మాట్లాడుతున్నారు.. ఇవన్నీ వద్దయ్యా! కర్నూలులో హైకోర్టు పెట్టడానికి ఇష్టం ఉందా లేదా చెప్పు అని ఈ వేదిక నుంచి సూటిగా ప్రశ్నిస్తున్నా. అభివృద్ధి గురించి మాట్లాడితే మేమూ మాట్లాడొచ్చు. ముఖ్యమైన హంద్రీనీవా సుజల స్రవంతి, గాలేరు-నగరికి చంద్రబాబు మొదటి విడత సీఎంగా ఉన్నప్పుడు రూ.13-17 కోట్లు కేటాయిస్తే, వైఎస్‌ రాజశేఖరరెడ్డి రూ.4 వేల కోట్ల చొప్పున కేటాయించి పనులు పూర్తి చేయడం నిజమా.. కాదా? జగన్‌ వచ్చాక కర్నూలుకు విమానాశ్రయం కట్టినమాట నిజమా? కాదా? 1972లో స్థాపించిన సిల్వర్‌ జూబ్లీ కళాశాలకు మరుగుదొడ్లు, సరైన సదుపాయాల్లేకపోతే జగన్నాథగట్టుపై బ్రహ్మాండమైన భవనం కడుతుండటం వాస్తవమా? కాదా’ అని ప్రశ్నించారు. నంద్యాల- జమ్ములమడుగు, చిత్తూరు, అనంతపురంలో రూ.7500 కోట్లతో జాతీయ రహదారులు వైకాపా ప్రభుత్వంలో తెచ్చుకుంటే, 2018-19లో తెదేపా రాష్ట్రానికి తెచ్చింది రూ.250 కోట్లేనన్నారు. మీడియాను అడ్డుపెట్టుకుని ప్రజలకు పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు. శ్రీకాకుళం- చిత్తూరు వరకు అంతా సమాంతరంగా శాశ్వతంగా అభివృద్ధి చెందాలంటూ జగన్‌ ఆలోచిస్తున్నారన్నారు. కానీ చంద్రబాబుకు కృష్ణా, గుంటూరు, గోదావరి ఏ ప్రాంతంపైనా ప్రేమ లేదని.. 30 చ.కి.మీ ప్రాంతంలోని పార్టీ, బంధుమిత్రులు, రియల్‌ ఎస్టేట్‌ బృందంపై మాత్రమే ప్రేమ ఉందని బుగ్గన ఎద్దేవా చేశారు.

చంద్రబాబు ఏ ప్రాంతాన్నీ అభివృద్ధి చేయలేదు: పెద్దిరెడ్డి

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాయలసీమ నుంచి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రాష్ట్రవిభజనకు ముందు హైదరాబాద్‌నే అభివృద్ధి చేశారు తప్ప రాష్ట్రంలో ఏ ప్రాంతాన్నీ అభివృద్ధి చేయలేకపోయారని విమర్శించారు. అమరావతిలో రాజధాని వద్దని ముఖ్యమంత్రి చెప్పలేదని, అక్కడా రాజధాని ఉండి శాసనసభ వ్యవహారాలు చూస్తుందన్నారు. విశాఖలో పరిపాలనా రాజధాని అడిగినట్లే, కర్నూలుకు న్యాయరాజధాని ఇవ్వడం సబబన్నారు. అభివృద్ధి చేపట్టినా పరిగణనలోకి తీసుకోకుండా ఎక్కడా అభివృద్ధి జరగలేదని, రాజధాని నిర్మాణానికి డబ్బులెక్కడివని వ్యంగ్యంగా మాట్లాడుతున్న చంద్రబాబును రాయలసీమ ద్రోహిగా పరిగణించాలని అన్నారు.

పవన్‌కల్యాణ్‌.. కర్నూలుకు మద్దతు తెలుపు: గుమ్మనూరు

రాయలసీమ రక్తంతో పుట్టి ఉంటే కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు చంద్రబాబు మద్దతిస్తారని, ఇక్కడ పుట్టలేదంటే వ్యతిరేకిస్తారంటూ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు వత్తాసు పలికే పవన్‌ కల్యాణ్‌ సహా రాయలసీమ పేరు పెట్టుకుని కర్నూలు జిల్లా ప్రజలు ఇచ్చిన డబ్బులతో రూ.వేల కోట్లు సంపాదించుకున్న సినిమా పరిశ్రమ అంతా ఏకమై కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు మద్దతు తెలపాలన్నారు. చంద్రబాబును బహిష్కరించి, కర్నూలులో న్యాయరాజధానికి మద్దతు పలకాలని అందర్నీ హెచ్చరిస్తున్నానన్నారు.

చీపుర్లు, చెప్పులతో తరిమి కొట్టండి: అంజాద్‌బాషా

చంద్రబాబు కర్నూలులో పర్యటించి ఇక్కడ ప్రజలు, తెదేపా నాయకులతో ఒకే ప్రాంత అభివృద్ధికి     నినాదాలు చేయించడం రాయలసీమ ప్రజలను అవహేళన చేయడమేనని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా అన్నారు. ఒకే ప్రాంత అభివృద్ధిని కోరుతున్న తెదేపా, జనసేన రాయలసీమ నాయకులు మీ ఇంటికి వస్తే మహిళలు చీపుర్లతో, పురుషులు చెప్పులతో తరిమి కొట్టాలంటూ ఆయన పిలుపునిచ్చారు.

ఉనికి కోల్పోతారని బాబుకు భయం: ఉషశ్రీచరణ్‌

కర్నూలులో రాజకీయంగా వైకాపా బలంగా ఉందని.. హైకోర్టు ఏర్పాటు చేస్తే చంద్రబాబుకు, లోకేశ్‌కు ఎలాంటి ఉనికి ఉండదనే అడ్డుకుంటున్నారని మంత్రి ఉషశ్రీచరణ్‌ అన్నారు. కర్నూలుకు రావద్దంటూ ప్రజలందరూ వారి పర్యటనను అడ్డుకుని బుద్ధి చెప్పారన్నారు. ఉద్యోగాల్లేక రాయలసీమ జిల్లాల నుంచి వలస వెళ్తున్నారని, న్యాయరాజధాని వస్తే చాలా పరిశ్రమలు వచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. కర్ణాటకలో బెంగళూరు రాజధానిగా ఉన్నప్పటికీ శీతాకాల సమావేశాలు బెళగావిలోని మినీ విధానసౌధలో నిర్వహిస్తున్నారని గుర్తుచేశారు. గోరంట్ల అనే నాకు జ్వరమొస్తే.. బుగ్గనకి ఇంజక్షన్‌ ఇస్తా, చేపలు, గుడ్లు పెడతా అన్నట్లు ఉందంటూ చంద్రబాబును ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఎద్దేవా చేశారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు