శ్రీశైలం, సాగర్ నిర్వహణ మళ్లీ మొదటికి!
ముసాయిదా నివేదికకు అంగీకారం తెలిపితే ప్రతి సంవత్సరం ఏపీ 50 నుంచి 60 టీఎంసీలు ఎక్కువగా వాడుకొంటుంది. ఇది పెద్ద అసమానతలకు దారితీస్తుంది.
ముసాయిదాను వ్యతిరేకిస్తూ ఆర్.ఎం.సి. భేటీకి తెలంగాణ గైర్హాజరు
సిఫార్సులకు అంగీకారం తెలిపిన ఆంధ్రప్రదేశ్, బోర్డు ప్రతినిధులు
అంశాల వారీగా అభ్యంతరాలతో బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ
ఈనాడు - హైదరాబాద్
ముసాయిదా నివేదికకు అంగీకారం తెలిపితే ప్రతి సంవత్సరం ఏపీ 50 నుంచి 60 టీఎంసీలు ఎక్కువగా వాడుకొంటుంది. ఇది పెద్ద అసమానతలకు దారితీస్తుంది.
లేఖలో తెలంగాణ అభ్యంతరం
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు, పవర్‌హౌస్‌ల నిర్వహణపై ఏకాభిప్రాయం కుదరలేదు. వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. కృష్ణా బోర్డు ఏర్పాటు చేసిన రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్.ఎం.సి.) లక్ష్యం నెరవేరలేదు. ఈ కమిటీ రూపొందించిన ముసాయిదా నివేదికపై సోమవారం జరిగిన చివరి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులిద్దరూ సంతకాలు చేయగా, తెలంగాణ ప్రతినిధులు గైర్హాజరయ్యారు. అంతేకాకుండా ముసాయిదాను తీవ్రంగా వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు లేఖ రాసింది. దీంతో ఆర్.ఎం.సి. కన్వీనర్, బోర్డు నుంచి ఉన్న మరో సభ్యుడు సంతకాలు చేసి నివేదికను బోర్డుకు పంపినట్లు తెలిసింది. అయితే దీనికి తెలంగాణ అంగీకరించకపోవడంతోపాటు వ్యతిరేకిస్తూ అంశాల వారీగా లేఖ రాసిన నేపథ్యంలో ఈ నివేదిక అమలులోకి వచ్చే అవకాశం లేదు.
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణకోసం అవసరమైన విధానాలు రూపొందించేందుకు ఆరు నెలల క్రితం కృష్ణా నదీ యాజమాన్యబోర్డులో కీలక అధికారిగా ఉన్న రవికుమార్ పిళ్లై నేతృత్వంలో ఆర్.ఎం.సి. ఏర్పాటైంది. ఈ కమిటీలో రెండు రాష్ట్రాల నీటిపారుదల, జెన్కో చీఫ్ ఇంజినీర్లు సభ్యులుగా ఉన్నారు. పవర్‌హౌస్‌ల నిర్వహణ, వరద నీటి వినియోగం, రిజర్వాయర్ల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోవడం ఈ కమిటీ బాధ్యత. గత శనివారం కమిటీ ఆరో సమావేశం నిర్వహించగా రెండు రాష్ట్రాల అధికారులు హాజరై ముసాయిదా నివేదికపై చర్చించారు. సోమవారం మళ్లీ సమావేశమై తుది ఆమోదం తెలపాల్సి ఉండగా, తెలంగాణ ప్రతినిధులు గైర్హాజరయ్యారు. వారు లేకుండానే కమిటీ చర్చించింది. కమిటీలో ఆరుగురు సభ్యులుండగా నలుగురు ఆమోదం తెలిపి బోర్డుకు పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ముసాయిదాలోని ముఖ్యాంశాలు
* శ్రీశైలంలో కనీస నీటి మట్టం జులై ఒకటి నుంచి అక్టోబరు 31 వరకు 854 అడుగులకు పైనే ఉండాలి. మిగిలిన సమయంలో విద్యుత్తు అవసరాలకు తగ్గట్లుగా దిగువన నీటిని తీసుకోవచ్చు కానీ తాగునీటి అవసరాలను పరిగణనలోకి తీసుకొని ఎటువంటి పరిస్థితుల్లోనూ 815 అడుగుల కంటే దిగువ నీటిని తీసుకోరాదు. రిజర్వాయర్ల నిర్వహణలో పవర్‌హౌస్‌లు కీలకం. విద్యుదుత్పత్తి ప్రయోజనాలు 50:50 నిష్పత్తిలో ఉండాలి. దీనికి తగ్గట్లుగా కచ్చితంగా పవర్‌హౌస్‌ల నిర్వహణ ఉండాలి. పవర్‌హౌస్‌లు బోర్డు పరిధిలోకి ఇచ్చేవరకు వరద ఉన్నప్పుడు రోజువారీగా, మిగిలిన సమయాల్లో పదిరోజులకోసారి విద్యుత్తు పంపిణీ జరగాలి. దిగువన సాగు, తాగు నీటి అవసరాలను పరిగణనలోకి తీసుకొని మాత్రమే శ్రీశైలం రెండు విద్యుత్తు కేంద్రాలలో ఉత్పత్తి జరగాలి. శ్రీశైలంలో ఉన్న రివర్సబుల్ టర్బైన్ల వల్ల ఎడమగట్టు విద్యుత్తు కేంద్రంలో 13 శాతం నీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. దిగువన ఒక టీఎంసీ నీరు అవసరమైతే ఎడమగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి 0.531 టీఎంసీ, కుడివైపు నుంచి 0.469 టీఎంసీ నీటితో విద్యుదుత్పత్తి జరుగుతుంది. మొత్తం రిజర్వాయర్ల యాజమాన్యాన్ని పవర్‌హౌస్‌లను పరిగణనలోకి తీసుకొని చేసేందుకు ఆర్.ఎం.సి. స్థానంలో పర్మనెంట్ స్టాండింగ్ కమిటీ (పి.ఎస్.సి.)ని ఏర్పాటు చేయాలి. రెండు పవర్‌హౌస్‌ల నుంచి నీటి విడుదలకు సంబంధించిన మార్గదర్శకాలను పి.ఎస్.సి. ఇస్తుంది. శ్రీశైలంలో రివర్సబుల్ పంపింగ్ సౌకర్యం ఎడమవైపున తెలంగాణకు మాత్రమే ఉంది. అయితే తెలంగాణ దీన్ని వినియోగించుకొలేని సమయంలో ఈ రివర్సబుల్ టర్బైన్లు ఏపీకి అందుబాటులో ఉండాలి.దీనికి ప్రభుత్వ స్థాయిలో ఆమోదం ఉండటంతోపాటు అదనంగా ఖర్చు వస్తే ఏపీ భరించాలి.
* శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు సంబంధించిన రూల్‌కర్వ్‌ను 2021 డిసెంబరు 29న బోర్డుకు కేంద్ర జలసంఘం పంపింది. కొన్ని అదనంగా చేర్చి జలసంఘం సూచనలను అమలు చేయాలని ముసాయిదా ప్రతిపాదించింది. దీని ప్రకారం జూన్ 1నుంచి అక్టోబరు 31వరకు సాగునీటి అవసరాలను పరిగణనలోకి తీసుకొని శ్రీశైలం మట్టం 854 అడుగులు అంతకంటే ఎక్కువ ఉండాలి. అక్టోబరు 31 తర్వాత విద్యుదుత్పత్తిని పెంచేందుకు మట్టాన్ని దిగువకు తేవచ్చు. ఎటువంటి పరిస్థితిలో రిజర్వాయర్ మట్టాన్ని దిగువస్థాయికి తీసుకుపోరాదు. దీనివల్ల తాగు, సాగు అవసరాలపై ప్రభావం పడుతుంది. విద్యుదుత్పత్తిని ప్రారంభించడానికి ముందుగా 75 శాతం నీటి లభ్యత ఆధారంగా శ్రీశైలంలో నీటిని రెండు రాష్ట్రాలు పరిగణనలోకి తీసుకోవాలి. నాగార్జునసాగర్‌కు సంబంధించినంతవరకు తమ అభిప్రాయాలను రూల్‌కర్వ్‌లో చేర్చడానికి రెండు రాష్ట్రాలు కేంద్ర జలసంఘాన్ని సంప్రదించాలి.
* 75 శాతం నీటి లభ్యతకు మించి మిగులు జలాలు ఎంత ఉన్నాయనేది తేల్చడానికి స్పష్టంగా ఓ విధానాన్ని అనుసరించాలి. సబ్ బేసిన్ల నుంచి వచ్చే నీటిని పూర్తిగా లెక్కించడంతో పాటు ఏటా వినియోగించుకొన్న, వినియోగించుకోలేని నీటికి లెక్కలుండాలి. ప్రతి రాష్ట్రం నికర జలాల వినియోగం, మిగులు జలాల మళ్లింపు ఎంతన్నది స్పష్టంగా ఉండాలి. మిగులు జలాలు ఉన్నప్పుడు, మిగిలిన సమయంలో వాడుకొన్నవి నికర జలాలే. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నిండి గేట్లు ఎత్తినపుడు తీసుకొనే నీటినే మిగులు జలాలుగా పరిగణిస్తారు. ఈ నీటినీ ఏ రాష్ట్రం ఎంత మళ్లించిందని లెక్కల్లోకి తీసుకొంటారు. నీటి సంవత్సరం ఆరంభం, ముగింపులో మిగులు జలాలు వచ్చిన సమయాన్ని కృష్ణా బోర్డు నోటిఫై చేస్తుంది. మిగిలిన నీటి వినియోగాన్ని 75 శాతం నీటి లభ్యత కింద ఉన్న కేటాయింపుగా పరిగణిస్తారు. ఆర్.ఎం.సి. ముసాయిదాలోని ఈ అంశాలు బోర్డు ఆమోదం తర్వాతే అమలులోకి వస్తాయి. ఆర్.ఎం.సి. సిఫార్సులను కానీ, రూల్‌కర్వ్‌పై కేంద్ర జలసంఘం ఇచ్చిన నివేదికను ఏ రాష్ట్రమూ కృష్ణా ట్రైబ్యునల్-2 ముందు వినియోగించుకోరాదు. తెలంగాణ హాజరై ఉంటే
జలాశయాల నిర్వహణ కొలిక్కి వచ్చేది: ఏపీ ఈఎన్సీ
జలాశయాల నిర్వహణ కమిటీ (ఆర్.ఎం.సి.) తుది సమావేశానికి తెలంగాణ హజరై ఉంటే శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నిర్వహణలో రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడుతున్న సమస్యలు కొలిక్కి వచ్చి ఉండేవని ఏపీ జల వనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆర్.ఎం.సి. సమావేశం అనంతరం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. నివేదికపై ఏపీ సంతకం చేసిందని, తెలంగాణ కూడా చేసి ఉంటే చాలా సమస్యలకు పరిష్కారం దొరికేదన్నారు. శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి విషయంలోనూ ఇరు రాష్ట్రాల మధ్య స్పష్టత వచ్చేదని పేర్కొన్నారు. త్రిసభ్య కమిటీకి బదులు శాశ్వత ఆర్ఎంసీ కూడా ఏర్పాటు అయ్యేదని, ఇకపై ఆర్ఎంసీ ఉంటుందా లేదా అనేదానిపై స్పష్టత లేదన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Diabetes: ‘డి’ విటమిన్‌తో మధుమేహం నుంచి రక్షణ!
-
Technology News
Whatsapp: వాట్సప్.. ఇక చిటికెలో ఫాంట్‌ను మార్చుకోవచ్చు!
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Crime News
Delhi Liquor Case: దిల్లీ మద్యం కేసు.. ఎమ్మెల్సీ కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్ అరెస్ట్
-
Ap-top-news News
AP Constable Exam: అభ్యర్థుల గోడు వినండి.. మొదటి కీలో ఒకలా.. తుది కీలో మరోలా!
-
India News
ఆస్ట్రాజెనెకా టీకాతో గుండెపై దుష్ప్రభావాలు: ప్రముఖ హృద్రోగ నిపుణుడి వ్యాఖ్యలు