ఎవరూ లేరని... ఎదురే ఉండదని!

శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల పట్టణంలో రూ.7.5 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అధికార పార్టీ అండతో కొందరు ఆక్రమించేస్తున్నారు.

Published : 06 Dec 2022 04:16 IST

వైకాపా అండతో గోరంట్లలో ప్రభుత్వ భూమి ఆక్రమణ

రూ.7.5 కోట్ల స్థలంలో సెలవు రోజున పునాదుల తవ్వకం

గోరంట్ల, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల పట్టణంలో రూ.7.5 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అధికార పార్టీ అండతో కొందరు ఆక్రమించేస్తున్నారు. సెలవు రోజున రాత్రికిరాత్రే పొక్లెయిన్లతో పునాదులు తవ్వేశారు. అధికారులు తమ కార్యాలయంలోని కిటికీలో నుంచి చూసినా ఆక్రమణలు కనిపిస్తాయని, వారు మొదటి నుంచీ సరిగా స్పందించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. గోరంట్లలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద స్థలాలు ఇవ్వడానికి 2008-09లో తహసీల్దారు కార్యాలయానికి ఆనుకుని 272-2 సర్వే నంబరులో 3.05 ఎకరాల అసైన్డ్‌ పొలాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. అందులో నుంచి 2012లో ఒక్కొక్కరికి 4 సెంట్ల చొప్పున 13 మందికి, 2013లో ఒకరికి రెండు సెంట్లు, 2015లో మాజీ సైనికుడికి రెండు సెంట్లు చొప్పున మొత్తం 56 సెంట్లపై ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఖాళీగా ఉన్న 2.5 ఎకరాల భూమిపై చాలామంది కన్నుపడింది. మధ్యలో కొందరు దొంగ పట్టాలు సృష్టించి స్థలాలను ఆక్రమించుకున్నారు. వాటి క్రయవిక్రయాలు జరిగినా రెవెన్యూ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోలేదు. ఆ స్థలాల్లోకి ఎవరూ ప్రవేశించకూడదని బోర్డు పెట్టి, చేతులు దులిపేసుకున్నారు. కొన్నిరోజులకు అదీ మాయమైంది. స్థలాల పంపిణీ దస్త్రమూ మాయమైనట్లు ఆరోపణలున్నాయి. ఈ ప్రాంతంలో సెంటు స్థలం రూ.3 లక్షలు పలుకుతోంది. తాజాగా వైకాపా నాయకుల అండతో పలువురు శని, ఆదివారాల్లో రెచ్చిపోయారు. ఎవరికి నచ్చిన చోట వారికి కావాల్సినంత స్థలంలో పునాదులు తీసుకున్నారు. అయితే... తమ వద్ద పట్టాలు ఉన్నాయని, ఇళ్ల నిర్మాణాలకు అనుమతివ్వాలని కోరుతూ 10 మందికి పైగా హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆక్రమణల విషయమై తహసీల్దారు రంగనాయకులును వివరణ కోరగా... ‘ఆదివారం అక్కడ పునాదులు తీశారు. సోమవారం మొత్తం పరిశీలించా. గతంలో ఇచ్చిన పట్టాలను కార్యాలయంలోని రికార్డులతో సరిచూసి తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని వివరించారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు