వర్సిటీ పాఠ్యాంశంగా ‘బల్దేర్‌ బండి’.. ఎంఏ సిలబస్‌లో చేర్చిన ఏయూ

పట్టుమని వంద ఇళ్లు కూడా లేని గిరిజన తండా అది. కూరగాయలు పండించి సమీప పట్టణాలకు వెళ్లి అమ్మితేనే అక్కడి వారికి పూట గడిచేది. అలాంటి కుటుంబంలోనే జన్మించిన రమేష్‌ కార్తీక్‌ గిరిజన సాహిత్యంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.

Updated : 06 Dec 2022 09:00 IST

గిరిజన యువకుడి కవితా సంపుటికి గుర్తింపు
ఎంఏ తెలుగు సిలబస్‌లో చేర్చిన ఆంధ్ర విశ్వవిద్యాలయం
నిజామాబాద్‌ జిల్లా వాసి ఘనత

ఈనాడు, నిజామాబాద్‌: పట్టుమని వంద ఇళ్లు కూడా లేని గిరిజన తండా అది. కూరగాయలు పండించి సమీప పట్టణాలకు వెళ్లి అమ్మితేనే అక్కడి వారికి పూట గడిచేది. అలాంటి కుటుంబంలోనే జన్మించిన రమేష్‌ కార్తీక్‌ గిరిజన సాహిత్యంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. 24 ఏళ్ల ఈ యువకుడు తన 20వ ఏట రాసిన కవితా సంపుటి ‘బల్దేర్‌ బండి’లోని జారేర్‌బాటి కవితను కాకతీయ విశ్వవిద్యాలయం అటానమస్‌ కళాశాల డిగ్రీ 5వ సెమిస్టర్‌ సిలబస్‌లో రెండేళ్ల కిందటే పెట్టారు. తాజాగా ఈ సంపుటికి మరో గుర్తింపు లభించింది. ఈ విద్యాసంవత్సరం నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయం(ఏయూ)లో ఎంఏ తెలుగు 4వ సెమిస్టర్‌ సిలబస్‌లో దాన్ని పొందుపరిచారు. రెండో యూనిట్‌లోని మూడో పాఠ్యాంశంగా దీనిని చేర్చినట్లు వర్సిటీ తెలుగు విభాగం అధిపతి జె.అప్పారావు ‘ఈనాడు’తో చెప్పారు.

చిత్రలేఖనం నుంచి సాహిత్యం దిశగా...

రమేష్‌ కార్తీక్‌ది నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలం వివేక్‌నగర్‌ తండా. ఈ కుటుంబానికి తల్లిదండ్రులు చేసే వ్యవసాయమే ఆధారం. పాఠశాలస్థాయి నుంచి చిత్రాలు గీస్తూ, చిత్రవ్యాఖ్యలు రాసే అలవాటు కాస్తా ఆయనను సాహిత్యంవైపు నడిపించింది. చిన్నతనంలో తాను రాసిన కవితలతో కూడిన సంపుటి 2018 డిసెంబరులో పుస్తకంగా వెలువడింది. గిరిజనసాహిత్యంలో ఈయన రాసిన విషాద గీతం(ఢావ్లో) కథా సంపుటి కూడా గత ఏడాది ఆగస్టులో విడుదలైంది. పేదరికంలో పుట్టిన రమేష్‌ టీటీసీ పూర్తయ్యాక.. దూరవిద్య ద్వారా బీఏ, ఆంగ్లంలో ఎంఏ కోర్సులు పూర్తిచేశారు. చదువుకునే రోజుల్లో పార్ట్‌టైంగా క్యాటరింగ్‌ పనులకు వెళ్తూ పుస్తకాల ఖర్చులు సంపాదించుకొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు