మట్టి అక్రమ తవ్వకాల వివాదం

మట్టి అక్రమ తవ్వకాల వివాదంలో తెదేపా కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేయడం విమర్శలకు తావిస్తోంది.

Updated : 06 Dec 2022 06:27 IST

దాడులు చేసిన వైకాపా వర్గీయులను వదిలి తెదేపా వారిపై పోలీసుల కేసులు

ఈనాడు డిజిటల్‌, ఏలూరు:  మట్టి అక్రమ తవ్వకాల వివాదంలో తెదేపా కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొప్పాకలో ఆదివారం రాత్రి మట్టి తవ్వకాల నేపథ్యంలో దాడి జరిగింది. దాంతో సోమవారం ఆ గ్రామంలో పోలీసులు పికెట్‌ ఏర్పాటు చేశారు. ఆదివారం పెదకడిమిలోని రాజాతోటకు వెళుతుండగా వైకాపా వర్గీయులు కర్రలు, రాడ్డులతో దాడి చేయడంతో మాజీ ఎమ్మెల్యే చింతమనేని అనుచరుడు శివబాబు, మరో ముగ్గురికి గాయాలయ్యాయని పెదవేగి పోలీసుస్టేషన్‌లో తెదేపా వర్గీయులు ఫిర్యాదు చేశారు. అయినా... వైకాపా వర్గీయులపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకుంటామన్న ఆందోళనతో తమపై దాడి చేయడమే కాకుండా వైకాపా నాయకులు కేసులు పెట్టించారని తెదేపా నాయకులు ఆరోపించారు. దీనిపై ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ మాట్లాడుతూ... ‘తెదేపా వర్గీయులు ఫిర్యాదు చేశారు. బాధితులు చికిత్స పొందుతున్న గుంటూరు ఆసుపత్రి నుంచి స్టేట్‌మెంట్‌ వచ్చిన వెంటనే తప్పని సరిగా కేసు నమోదు చేస్తాం...’ అని తెలిపారు. మరో వైపు ఆసుపత్రి వద్ద తనపై దాడి చేశారని వైకాపాకు చెందిన పులుసు శివకుమార్‌ ఫిర్యాదుతో  సోమవారం రాత్రి తెదేపాకు చెందిన శివబాబు, శ్రీనివాసరావు, సతీష్‌, శ్రీను, పవన్‌, దాము, రవి, చిన్నా, వాసు, సూర్యనారాయణపై టూటౌన్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు.  ఆదివారం రాత్రి గ్రామంలో ఉండగా కొంతమంది వచ్చి దాడులకు పాల్పడ్డారని, చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి రాగా అక్కడ అడ్డగించి మళ్లీ దాడి చేశారని పెదవేగి మండలం కొప్పాకకు చెందిన శివకుమార్‌ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని