Kurma Village: ప్రకృతి ఒడిలో శ్రమైక జీవన సౌందర్యం

అదో కుగ్రామం.. పేరు కూర్మ. శ్రీకాకుళం జిల్లా హిరమండలం పరిధిలోని అంతకాపల్లి అడవుల్లో కన్పిస్తుంది. అక్కడ విద్యుత్తు లేదు. కానీ గ్రామస్థుల ఆలోచనల్లో చైతన్య కాంతి ప్రసరిస్తోంది.

Updated : 07 Dec 2022 10:50 IST

సుదూరంగా క్రాంత జీవనం
న్యూస్‌టుడే, టెక్కలి, హిరమండలం

అదో కుగ్రామం.. పేరు కూర్మ. శ్రీకాకుళం జిల్లా హిరమండలం పరిధిలోని అంతకాపల్లి అడవుల్లో కన్పిస్తుంది. అక్కడ విద్యుత్తు లేదు. కానీ గ్రామస్థుల ఆలోచనల్లో చైతన్య కాంతి ప్రసరిస్తోంది. టీవీలు, సెల్‌ఫోన్లు లేవు. బాహ్యప్రపంచాన్ని ఆధ్యాత్మిక చింతనతో దర్శిస్తున్నారు. ఆధునిక హంగులేవీ లేవు. ప్రకృతి ఒడిలోనే సుఖంగా బతుకున్నారు. ఉన్నత చదువులు, పెద్ద ఉద్యోగాలతో సంపన్న శ్రేణి జీవనాన్ని అనుభవించినప్పటికీ.. జీవిత పరమార్థం ఇది కాదని భావించారు. ఆ అన్వేషణలో భాగంగా ‘పరమాత్మకు చేరువయ్యే వికాసమార్గం.. సనాతన ధార్మిక జీవనం’గా భావించి సరికొత్త జీవన విధానాన్ని అనుసరిస్తున్నారు.

కృష్ణచైతన్య సమాజం పేరుతో కూర్మగ్రామంలో 56 మంది నివాసముంటున్నారు. 12 గృహస్థు జీవన కుటుంబాలు కాగా, 16 మంది విద్యార్థులు, ఆరుగురు బ్రహ్మచారులు. 2018 జులైలో భక్తివేదాంతస్వామి ప్రభుపాదుల ఆదేశాలపై భక్తివికాస్‌స్వామి సారథ్యంలో ఈ పల్లె ఏర్పడింది. సరళ జీవనం, ఉన్నత చింతనం వీరి విధానం.అత్యవసరాలైన కూడు, గూడు, గుడ్డ ప్రకృతి నుంచే పొందవచ్చని నిరూపిస్తూ ప్రకృతి సేద్యంతోనే వీటిని సముపార్జిస్తున్నారు. ఈ ఏడాది ఉమ్మడిగా 198 బస్తాల ధాన్యం పండించారు. సరిపడా కూరగాయలు పండిస్తున్నారు. విత్తు విత్తింది మొదలు కోతల వరకూ ఇతరులపై ఆధారపడలేదు. దంపుడు బియ్యాన్ని వండుకుంటున్నారు. దుస్తులకు వారే నేత కార్మికులు. ఇళ్లకు వారే మేస్త్రీలూ కూలీలు. ఇసుక, సున్నం, బెల్లం, మినుములు, కరక్కాయ, మెంతులు మిశ్రమంగా చేసి, గానుగలో ఆడించి, గుగ్గిలం మరగబెట్టిన మిశ్రమంతో ఇళ్లు కట్టుకున్నారు. కుంకుడుకాయ రసంతో దుస్తులు ఉతుక్కుంటారు.సనాతన ధర్మం, వైదిక సంస్కృతి, వర్ణాశ్రమ విధాన పునఃస్థాపన లక్ష్యంగా చెబుతున్నారు.

వైదికధర్మ ఆచరణ, ప్రచారం

పిల్లలు గురుకుల పద్ధతిలో వర్ణాశ్రమ విద్యనభ్యసిస్తున్నారు. సంస్కృతం, ఆంగ్లం, హిందీ, తెలుగులో అనర్గళంగా మాట్లాడుతున్నారు. వయస్సు, ఆసక్తిని బట్టి చేతివృత్తులపై శిక్షణ ఇస్తున్నారు. వేకువజామున 4:30 గంటలకు దైవానికి హారతితో వీరి దినచర్య మొదలవుతుంది. ఉదయం భజన, ప్రసాదం స్వీకరణ తర్వాత రోజువారీ పనులకు వెళ్తారు. వ్యవసాయం, ఇళ్ల నిర్మాణం, ధర్మప్రచారంలో మమేకమవుతారు. సాయంత్రాలు ఆధ్యాత్మిక చింతనలో కరిగిపోతాయి. ‘విద్యుత్తు ఉంటే దానిచుట్టూ సౌకర్యాలు పెరుగుతాయి. అందుకు డబ్బు అవసరం. యాంత్రిక జీవనంతో మనుషులూ యాంత్రికంగా మారుతారు. మనసు కలత చెందుతోంది. అందుకే వాటికి దూరంగా ఉన్నామ’న్నది వీరి మాట. ఒక గుడిసెతో ప్రారంభమైన కూర్మ గ్రామంలో నేడు 56 మంది నివసిస్తున్నారు. ఐదేళ్లలో 50 కుటుంబాలు ఏర్పడతాయని చెబుతున్నారు.


చైతన్యంలేని జీవితం ఎందుకు?

దేవుని గురించి చైతన్యంలేని జీవితం ఎందుకు? పశువుకు, మనిషికి తేడా ఏంటి? అన్న ప్రశ్నలకు జవాబే.. ప్రకృతితో సహజీవనం! ప్రతి పనిలో దైవచింతన, ధార్మిక ఆలోచన ఇక్కడ అలవరుస్తున్నాం. కృష్ణచైతన్యం అభ్యాసం ద్వారా పరమానందంగా గడుపుతున్నాం. రష్యా నుంచి వచ్చి ఇక్కడ ఆనందాన్ని వెతుక్కొన్నా. ఆహ్లాదంగా బతుకుతున్నా.

హరిదాస్‌


సనాతన ధర్మస్థాపనే ఆశయం

వర్ణాశ్రమ కళాశాలలో వృత్తికళలు, బతుకుదెరువుకు అవసరమైన శిక్షణ ఇస్తున్నాం. గుజరాత్‌, పంజాబ్‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ కూర్మ లాంటి గ్రామాలు నెలకొల్పాం. హంగేరిలో 800 ఎకరాలతో గ్రామం విస్తరిస్తోంది. చెక్‌ రిపబ్లిక్‌లోనూ ఓ పల్లె ఉంది. మనిషి జీవిత లక్ష్యంపై అవగాహన కల్పించడమే కృష్ణ చైతన్యం. సనాతన వైదిక ధర్మం, భారతీయ సంస్కృతి పునరుద్ధరణకు చిన్నప్రయత్నం ప్రారంభించాం.

నటేకర్‌ నరోత్తమ్‌దాస్‌, వర్ణాశ్రమ బోధకుడు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని