Govt of India: ఏపీ ప్రభుత్వానికి కేంద్రం షాక్‌

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ, ఇతరత్రా రూపాల్లో ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన రూ.982 కోట్లను వెనక్కి తీసేసుకుంది. ఆ నిధులు వస్తాయనే అంచనాతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఊపిరి ఆడటం లేదు.

Updated : 07 Dec 2022 13:40 IST

రూ.982 కోట్ల జీఎస్టీ, ఇతర నిధులు వెనక్కి
పాత బకాయిల పేరుతో మినహాయింపు
ఉలిక్కిపడిన ఆర్థిక శాఖ
అసలే జీతాలు, పింఛన్లను  చెల్లించలేని దుస్థితి
ఇప్పటికే పరిమితి దాటిన అప్పులు
రోజువారీ రాబడే శరణ్యం

ఈనాడు, అమరావతి: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ, ఇతరత్రా రూపాల్లో ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన రూ.982 కోట్లను వెనక్కి తీసేసుకుంది. ఆ నిధులు వస్తాయనే అంచనాతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఊపిరి ఆడటం లేదు. ప్రభుత్వం అసలే ఆర్థిక సంక్షోభంలో ఉంది. దీనికితోడు దాదాపు రూ.వెయ్యి కోట్లు రాకుండా పోయాయి. కేంద్రం అన్ని రాష్ట్రాలకు ప్రతినెలా జీఎస్టీ వాటా నిధులు విడుదల చేస్తుంటుంది. అలా ఇటీవల అన్ని రాష్ట్రాలకు కలిపి ఇచ్చిన మొత్తంలో రూ.682 కోట్లు ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సి ఉంది. ఇవికాకుండా రూ.300 కోట్లు రాష్ట్రానికి ఇస్తున్నట్లు వర్తమానం అందినా అవేవీ చేరలేదు. రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు ఆరా తీయగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి పాత బకాయిలు రావాల్సి ఉన్నాయని, ఆ రూపంలో ఈ మొత్తాన్ని సర్దుబాటు చేసుకున్నారనే సమాచారం అందింది. దీంతో ఆర్థిక శాఖ అధికారులకు దిక్కుతోచడం లేదు.

ఏ రోజుకారోజు రాబడి లెక్కలు

రాష్ట్ర ఖజానాకు ఏ రోజు ఎంత మొత్తం, ఏ రూపంలో వచ్చిందో చెబుతూ ప్రతీరోజూ రాత్రిపూట రిజర్వుబ్యాంకు నుంచి ప్రభుత్వానికి సమాచారం అందుతుంది. అందులో ఆ రోజు రాష్ట్ర ఆదాయం, తీసుకున్న అప్పులు, చెల్లింపులు, కేంద్రం నుంచి ఏ రూపంలో ఎంత మొత్తం చేరిందో వివరంగా ఉంటుంది. ఆర్థిక శాఖలోని ఒకరిద్దరు ఉన్నతాధికారులకు మాత్రమే ఈ సమాచారం తెలుస్తుంది. కేంద్రం నిధులు విడుదల చేసినట్లు ఉత్తర్వులు వెలువడినా... ఆ మొత్తాలు జమ కాలేదని గమనించిన ఉన్నతాధికారులు ఆరా తీయగా పాత బకాయిల పేరుతో మినహాయించినట్లుగా తేలింది. వాటిని మళ్లీ కేంద్రం నుంచి తెచ్చుకునే అంశం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు జీతాలు చెల్లించలేని పరిస్థితిలో ఏది ఎలా సర్దుబాటు చేయాలో అర్థంకాక ఆర్థిక యంత్రాంగం తలలు పట్టుకుంటోంది.

అసలే సంక్షోభం... ఇది మరో ఇబ్బంది

రాష్ట్రం అసలే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఎవరికి, ఎప్పుడు జీతం వస్తుందో, ఎప్పుడు పింఛను అందుతుందో ఎవ్వరూ చెప్పలేని తీవ్ర దుస్థితి నెలకొంది. చాలామంది ఐఏఎస్‌ అధికారులకు సైతం ఇప్పటికీ వేతనాలు చెల్లించలేదు. విభాగాధిపతులదీ ఇదే పరిస్థితి. ఈ నెల 15వ తేదీ వచ్చేవరకు కూడా జీతాలను అప్పుడు కొందరికి, ఇప్పుడు కొందరికి జమ చేయాల్సిందే. అంతకుమించి మార్గం లేనంతగా ఖజానా తలుపులు మూసుకుపోయాయి. ఇలాంటి దుర్భర స్థితిలో కేంద్రం తానిచ్చిన రూ.982 కోట్లను మినహాయించుకోవడం పెద్ద షాకే. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు కలిపి రూ.5,500 కోట్లు ఒకటో తారీకు నాటికి ఇవ్వాల్సి ఉంటుంది. వీటిని అందుబాటులో ఉంచుకోవాల్సిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంతగా కునారిల్లిందో, ఆర్థిక నిర్వహణ ఎంత దారుణంగా ఉందో ఈ పరిస్థితులు విశదం చేస్తున్నాయి.

మరోవైపు బిల్లుల చెల్లింపు వివాదాల ముప్పు

రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగు బిల్లులపై కోర్టుల్లో లెక్కకు మించి కేసులున్నాయి. వాటి చెల్లింపుల ఒత్తిడి నుంచి తప్పించుకోవడం ఎలాగనే దానిపై సర్కారు పెద్దలు కొందరు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఆ కేసులన్నింటినీ ఆర్బిట్రేషన్‌కు తీసుకువచ్చేలా ప్రయత్నాలు చేయాలనుకుంటున్నారు. ఇందుకోసం విశ్రాంత న్యాయమూర్తులను కొందరిని నియమించుకునే ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం.


ఈసారి 15వ తేదీ దాటొచ్చు

రాష్ట్రంలో ఉద్యోగులు, పింఛనుదారులు, ఉపాధ్యాయులు తమ జీతాల కోసం రోజూ ఎదురుచూస్తున్నారు. అవి అందక, ఈఎంఐలు చెల్లించలేక, ఇతరత్రా అవసరాలు తీర్చుకోలేక అల్లాడుతున్నారు. ప్రస్తుతానికి ప్రతిరోజూ కొందరికి జీతాలను చెల్లిస్తున్నారు. అందరికీ చెల్లింపులు పూర్తయ్యేసరికి ఈ నెల 15వ తేదీ దాటుతుందనేది అంచనా. సాధారణంగా వేస్‌ అండ్‌ మీన్స్‌, ప్రత్యేక డ్రాయింగ్‌ సదుపాయం, ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌలభ్యం పేరిట రాష్ట్రం అప్పుల వెసులుబాటు వినియోగించుకుంటూ ఉంటుంది. ఓవర్‌ డ్రాఫ్ట్‌ పేరుతో వినియోగించుకోదగ్గ మొత్తమూ అంతంతే. పైగా నిర్దిష్ట గడువులోగా వాటిని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అందులోనూ ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇంకా రూ.2,900 కోట్లు పింఛన్లు, జీతాలు కలిపి చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో రుణం తీసుకోవాలంటే దానికీ పరిమితులు ఉన్నాయి. ఇప్పటికే ఏపీ తన పరిమితిని దాటేసింది. అంటే ఈ నెల అప్పు కూడా పుట్టదు. మరోవైపు కార్పొరేషన్ల నుంచి రుణం తీసుకునే అవకాశమూ లేదు. ఈ నెల ప్రారంభంలో రూ.2,000 కోట్లను ఏదో కార్పొరేషన్‌ పేరిట బ్యాంకుల నుంచి అప్పు తీసుకుని, రాష్ట్ర అవసరాల కోసం సర్దుబాటు చేసేశారు. ఇప్పటికే మద్యం సొమ్ముల పేరుతో రూ.8,300 కోట్లు, ఇతరత్రా కార్పొరేషన్ల పేరుతో మరో రూ.12,000 కోట్ల రుణాలు ప్రభుత్వం వినియోగించుకున్నట్లు సమాచారం. ఇక రోజువారీ వసూళ్లతోనే జీతాలు, పింఛన్లు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. సాధారణంగా ప్రభుత్వానికి రోజుకు రూ.400-450 కోట్ల వరకు ఆదాయం ఉంటుంది. ఒక నెలలో రూ.4,500 కోట్ల వరకు అప్పులు, వడ్డీల రూపంలోనే చెల్లించాల్సి ఉంటుంది. కార్పొరేషన్ల అప్పుల చెల్లింపులకు ప్రభుత్వం అందించే నిధులను కూడా కలిపి ఈ లెక్క వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఇతరత్రా అవసరాలు పోను రోజువారీ రాబడిలో ఎంత మొత్తం జీతాలకు, పింఛన్లకు చెల్లిస్తారనే అంశంపైనే... నవంబరు జీతాలన్నీ ఎప్పటికి చెల్లించగలరో తేలుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని