సంక్షిప్త వార్తలు(12)

కృష్ణా నదీ జలాల వివాద పరిష్కారంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ విచారణను సర్వోన్నత న్యాయస్థానం జనవరి 10కి వాయిదా వేసింది.

Updated : 07 Dec 2022 05:37 IST

కృష్ణా జలాల వివాదంపై విచారణ జనవరి 10కి వాయిదా

ఈనాడు, దిల్లీ: కృష్ణా నదీ జలాల వివాద పరిష్కారంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ విచారణను సర్వోన్నత న్యాయస్థానం జనవరి 10కి వాయిదా వేసింది. 2014లో దాఖలైన ఈ పిటిషన్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జె.కె.మహేశ్వరితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుటకు మంగళవారం విచారణకు వచ్చింది. జస్టిస్‌ సూర్యకాంత్‌ మరో ధర్మాసనంలో విచారణకు వెళ్లాల్సి రావడంతో ఆ రోజున తొలి కేసుగా విచారణకు స్వీకరిస్తామని పేర్కొంది.


సీఎంఎఫ్‌ నుంచి ఏపీ ఈ-విక్రయ కార్పొరేషన్‌కు రూ.10 కోట్లు

ఈనాడు-అమరావతి: సరకు రవాణా నిమిత్తం కేంద్రీయ మార్కెట్‌ నిధి(సీఎంఎఫ్‌) నుంచి ఏపీ ఈ-విక్రయ కార్పొరేషన్‌కు రూ.10 కోట్లను బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు మార్కెటింగ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. సొంత వనరులు సమకూర్చుకున్నాక ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించారు.


ముఖ గుర్తింపుతో విద్యార్థుల హాజరు
90 సెకన్లలోనే 60 మందిని గుర్తించే యాప్‌

ఈనాడు, హైదరాబాద్‌: అత్యాధునిక సాంకేతికతను వినియోగించి ముఖ గుర్తింపు ఆధారంగా హాజరు తీసుకునేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పాట్లు చేస్తోంది. మొబైల్‌ యాప్‌లో నేరుగా విద్యార్థులు, ఆచార్యుల నుంచి హాజరు తీసుకునేలా ఇందులో అవకాశం ఉంటుంది. అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో బయోమెట్రిక్‌ అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఇప్పటికే ఓయూ క్యాంపస్‌లో బయోమెట్రిక్‌ హాజరు అమలు చేస్తున్నారు. దీని స్థానంలో ముఖ గుర్తింపు సాంకేతికతతో కూడిన హాజరు తీసుకువస్తున్నట్లు ఓయూ వీసీ ప్రొఫెసర్‌ డి.రవీందర్‌ తెలిపారు. ప్రస్తుతం వినియోగిస్తున్న బయోమెట్రిక్‌ హాజరుకు సమయం ఎక్కువగా పడుతోంది. తక్కువ సమయంలోనే ఎక్కువ మంది హాజరు తీసుకునేలా మొబైల్‌ యాప్‌ సాంకేతికత పనిచేస్తుంది. దీన్ని తొలుత ప్రయోగాత్మకంగా ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాలలోని మెకానికల్‌ విభాగంలో మరో వారం, పది రోజుల్లో అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. దీని ఫలితాల ఆధారంగా వర్సిటీలోని అన్ని విభాగాలకు   విస్తరించనున్నారు.


కేఆర్‌ఎంబీ సభ్యుడు బదిలీ

ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) సభ్యుడు బి.రవికుమార్‌ పిళ్లై  కేంద్ర జలసంఘం ప్రధాన కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఈ మేరకు కేంద్రం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.


‘వివాదాస్పద రిజిస్టర్‌’లో సబ్‌ డివిజన్‌ వారీగా నమోదు జరగాలి

ఈనాడు, అమరావతి: వెబ్‌ల్యాండ్‌లోని ‘వివాదాల రిజిస్టర్‌’ కాలమ్‌లో విస్తీర్ణానికి సంబంధించిన వివరాలు మాత్రమే పొందుపరచాలని జిల్లాల కలెక్టర్లకు భూ పరిపాలన విభాగం ఆదేశించింది. కోర్టు తీర్పులు, కుటుంబాల మధ్య వివాదాలు తలెత్తినప్పుడు, ఇతర సందర్భాల్లో ‘వివాదాల రిజిస్టర్‌’ కాలమ్‌లో సర్వే నంబరు మాత్రమే నమోదు చేస్తున్నారు. దీనివల్ల వివాదాస్పద భూమికి సంబంధించిన విస్తీర్ణం మాత్రమే కాకుండా ఆ నంబరులో ఉన్న మిగిలిన వారి భూమి కూడా ‘వివాదాల రిజిస్టర్‌’లోనికి వెళ్లిపోతోంది. ఫలితంగా వీరి భూముల క్రయ, విక్రయాలు జరగక తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో వివాదాస్పద భూమికి సంబంధించి సబ్‌డివిజన్‌ వివరాలను మాత్రమే ‘వివాదాల రిజిస్టర్‌’లో నమోదు చేయాలని, సర్వే నంబరు మాత్రమే నమోదు చేయొద్దని సీసీఎల్‌ఏ జిల్లాల కలెక్టర్లకు స్పష్టంచేశారు.


ఎయిడ్స్‌ బాధితుల రక్షణకు అంబుడ్స్‌మన్‌

ఈనాడు, అమరావతి: హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ బాధితుల హక్కుల రక్షణకు అంబుడ్స్‌మన్‌ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం గెజిట్‌ ప్రచురించింది. హెచ్‌ఐవీ బాధితులకు చికిత్స, ఇతర విషయాల్లో వివక్ష లాంటి సమస్యలు ఎదురైతే అంబుడ్స్‌మన్‌ ద్వారా న్యాయం పొందేందుకు అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం 2017లో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ నిరోధకత, నియంత్రణ చట్టం తెచ్చింది. ఇది 2018 సెప్టెంబరు 10 నుంచి అమలులోకి వచ్చింది. అంబుడ్స్‌మన్‌ ఏర్పాటుపై 2019లోనే రాష్ట్రంలో చర్చలు జరిగినా ఉత్తర్వులు రాలేదు. ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఆదేశాలతో రాష్ట్ర, జిల్లా స్థాయిలో అంబుడ్స్‌మన్‌ల నియామకాలు జరుగుతాయి.


నరేగాలో మరో 5 కోట్ల అదనపు పని దినాల కేటాయింపు

ఈనాడు-అమరావతి: జాతీయ ఉపాధి హామీ పథకం (నరేగా)లో ఈ ఏడాది రాష్ట్రానికి మరో ఐదు కోట్ల పని దినాలను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని అధికారులు తెలిపారు. రాష్ట్రానికి ఇప్పటివరకు కేటాయించిన మొత్తం పని దినాలు 24 కోట్లకు పెరిగినట్లు వారు పేర్కొన్నారు. రాష్ట్రంలో నరేగా అమలుపై దిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు సోమ, మంగళవారాల్లో నిర్వహించిన సమీక్ష సందర్భంగా అదనపు పని దినాలు కేటాయించారన్నారు. ఉపాధి నిధుల బకాయిలు కూడా రూ.680 కోట్లు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని వెల్లడించారు.


ఈ-సంజీవనిలో తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్‌

ఈనాడు, దిల్లీ: ఈ-సంజీవనిని (ఉచిత టెలిమెడిసిన్‌ సర్వీస్‌) దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 8 కోట్ల మంది వినియోగించుకోగా 2.82 కోట్ల కాలర్లతో ఆంధ్రప్రదేశ్‌ తొలి స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఏపీ తర్వాత స్థానాల్లో వరుసగా పశ్చిమ బెంగాల్‌ (1 కోటి), కర్ణాటక (94.46 లక్షలు), తమిళనాడు (87.23 లక్షలు), మహారాష్ట్ర (40.70 లక్షలు), ఉత్తరప్రదేశ్‌ (37.63 లక్షలు), మధ్యప్రదేశ్‌ (32.83 లక్షలు), బిహార్‌ (26.24 లక్షలు), తెలంగాణ (24.52 లక్షలు), గుజరాత్‌ (16.73 లక్షలు) ఉన్నాయని పేర్కొంది.


నైపుణ్యాలు అందించేందుకు సేలర్‌ అకాడమీతో ఒప్పందం

ఈనాడు, అమరావతి: విద్యార్థులకు కమ్యూనికేషన్‌, లీడర్‌షిప్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌, ఆంగ్ల భాష నైపుణ్యాలు, వృత్తిపరమైన అభివృద్ధి, వాణిజ్య పరిపాలన, ఆర్థిక, రాజకీయశాస్త్రాలతోపాటు 21వ శతాబ్దపు నైపుణ్యాలు అందించేందుకు ఉన్నత విద్యామండలి మంగళవారం కానిస్టిట్యూషన్‌ ఫౌండేషన్‌ (సేలర్‌ అకాడమీ), మేరీల్యాండ్‌, అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది. విద్యార్థులు కోర్సుల్లో సాధించిన క్రెడిట్లను మార్పు చేసుకునేందుకు అవకాశం ఉన్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ ఒప్పందంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి, వైస్‌ ఛైర్మన్‌ రామమోహన్‌రావు, కార్యదర్శి నజీర్‌, సేలర్‌ అకాడమీ కార్యనిర్వాహక డైరెక్టర్‌ ఎఫెరీ ఎస్‌.డేవిడ్సన్‌ పాల్గొన్నారు.


సర్వీసు నిబంధనలు ఉల్లంఘిస్తూ సర్దుబాటు

ఈనాడు, అమరావతి: పురపాలక ఉపాధ్యాయులను నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పని సర్దుబాటు కింద పురపాలక పాఠశాలల్లో పనిచేస్తున్న వారిని జిల్లా, మండల పరిషత్తు పాఠశాలలకు బదిలీలు చేస్తున్నారు. మరోవైపు జిల్లా, మండల పరిషత్తు వారిని పురపాలక బడుల్లో నియమిస్తున్నారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురపాలక పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలను పాఠశాల విద్యాశాఖకు అప్పగించినా సర్వీసు నిబంధనలు మాత్రం ప్రత్యేకంగానే అమలు చేయాల్సి ఉన్నా దీన్ని పట్టించుకోవడం లేదని వెల్లడించారు. ఏలూరు జిల్లాలో సుమారు 70మంది పురపాలక ఉపాధ్యాయులను జిల్లా పరిషత్తు బడులకు బదిలీ చేయగా.. నెల్లూరు జిల్లాలో జిల్లాపరిషత్తు వారిని పురపాలక బడులకు సర్దుబాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ చేస్తున్న సర్దుబాటుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పురపాలక ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు.


మసీదు స్థలాన్ని ఆక్రమణ నుంచి విడిపించాలి
మైనార్టీ కమిషన్‌కు ఫిర్యాదు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గం ఎడ్లూరుపాడు గ్రామానికి చెందిన మసీదు, శ్మశాన వాటిక స్థలాన్ని కొంతమంది ఆక్రమించారని, వారి నుంచి విడిపించాలని ముస్లిం దూదేకుల రాజకీయ ఐకాస అధ్యక్షులు దస్తగిరి రాష్ట్ర మైనార్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. మంగళగిరిలోని కార్యాలయంలో కమిషన్‌ ఛైర్మన్‌ ఇక్బాల్‌ అహ్మద్‌ను కలిసి మంగళవారం వినతిపత్రం అందించారు. ఆక్రమణ చేశారని ఫిర్యాదు చేసినా స్థానిక తహసీల్దారు పట్టించుకోవడం లేదన్నారు. ఆక్రమణదారుల నుంచి ప్రాణహాని ఉందని వెల్లడించారు. దీనిపై కమిషన్‌ సానుకూలంగా స్పందించినట్లు దస్తగిరి తెలిపారు.


సీఎస్‌ను కలిసిన సమాచార కమిషనర్లు

సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ఛీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌ ఆర్‌యూ బాషా, కమిషనర్లు బీవీ రమణకుమార్‌, కట్టా జనార్దనరావు, ఐలాపురం రాజా, రేపాల శ్రీనివాసరావు, యు.హరిప్రసాద్‌రెడ్డి, కాకర్ల చెన్నారెడ్డి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని