నీతి ఆయోగ్‌ సీఈఓతో చంద్రబాబు భేటీ

తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తన దిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం నీతి ఆయోగ్‌ సీఈఓ పరమేశ్వరన్‌ అయ్యర్‌తో భేటీ అయ్యారు.

Published : 07 Dec 2022 03:50 IST

విజన్‌ 2047పై చర్చ

ఈనాడు, దిల్లీ: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తన దిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం నీతి ఆయోగ్‌ సీఈఓ పరమేశ్వరన్‌ అయ్యర్‌తో భేటీ అయ్యారు. లోక్‌సభలో తెదేపాపక్ష నేత కె.రామ్మోహన్‌నాయుడు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావులతో కలిసి చంద్రబాబు ఇక్కడి నీతి ఆయోగ్‌ కార్యాలయంలో పరమేశ్వరన్‌ అయ్యర్‌తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో తన అభిప్రాయాలను వ్యక్తం చేసిన చంద్రబాబునాయుడు అవే అంశాలను సీఈఓ దృష్టికి తీసుకొచ్చారు. డిజిటల్‌ నాలెడ్జ్‌పై దృష్టి సారించి దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విజన్‌ డాక్యుమెంట్‌ తయారీపై వారు చర్చించారు. 2047నాటికి భారతీయుల సగటు వయోపరిమితి పెరిగే అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచే ఆ సమస్యను అధిగమించేందుకు ప్రణాళికలు రూపొందించాలని ప్రధానికి చెప్పిన చంద్రబాబునాయుడు ఆ విషయంలో అనుసరించాల్సిన విధానం గురించి పరమేశ్వరన్‌ అయ్యర్‌కు వివరించారు. అలాగే పలు ఇతర అంశాలపైనా వారి మధ్య చర్చలు జరిగాయి. భారతీయులు ప్రపంచంలోని అనేక దేశాల్లో ఆర్థికంగా, రాజకీయంగా ప్రభావం చూపడంపట్ల ఇరువురూ సంతోషం వ్యక్తం చేశారు.యువతను మరింతగా ప్రోత్సహించాలని అభిప్రాయపడ్డారు. 2014-19 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడితో తనకున్న అనుభవాలను ఈ సందర్భంగా పరమేశ్వరన్‌ గుర్తు చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని