మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట

మాజీమంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల కేసులో నారాయణ బెయిలు రద్దు చేస్తూ చిత్తూరు తొమ్మిదో అదనపు జిల్లా కోర్టు (ఏడీజే) ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది.

Published : 07 Dec 2022 03:50 IST

బెయిలు రద్దు ఉత్తర్వులు కొట్టివేత
తొందరపాటు చర్యలొద్దని పోలీసులకు స్పష్టీకరణ

ఈనాడు, అమరావతి: మాజీమంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల కేసులో నారాయణ బెయిలు రద్దు చేస్తూ చిత్తూరు తొమ్మిదో అదనపు జిల్లా కోర్టు (ఏడీజే) ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. అంతక్రితం మెజిస్ట్రేట్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల లోతుల్లోకి వెళ్లి మళ్లీ విచారణ చేయాలని తొమ్మిదో ఏడీజేను ఆదేశించింది. ఈ వ్యవహారాన్ని నాలుగు వారాల్లో తేల్చాలని స్పష్టంచేసింది. మరోవైపు పిటిషనర్‌ విషయంలో తొందరపాటు చర్యలొద్దని పోలీసులను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు మంగళవారం ఈ మేరకు తీర్పు ఇచ్చారు. ‘ప్రాసిక్యూషన్‌ వాదనలు వినిపించేందుకు మేజిస్ట్రేట్‌ కోర్టు అవకాశం ఇవ్వలేదని తొమ్మిదో ఏడీజే పేర్కొనడం సరికాదు. నిందితుడిగా ఉన్న పిటిషనర్‌ను పోలీసులు.. మేజిస్ట్రేట్‌ ముందు ప్రవేశపెట్టారనే విషయాన్ని ఏడీజే కోర్టు గుర్తించలేకపోయింది. విచారణ సందర్భంగా పీపీ కోర్టు ముందు హాజరయ్యేలా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది. మెజిస్ట్రేట్‌ కోర్టు సరైన నిర్ణయం తీసుకుందా లేదా అనే అంశం లోతుల్లోకి వెళ్లకుండా.. ప్రాసిక్యూషన్‌/పీపీ వాదనలు చెప్పేందుకు అవకాశం ఇవ్వలేదనే కారణంతో మెజిస్ట్రేట్‌ ఇచ్చిన ఉత్తర్వులను తొమ్మిదో ఏడీజే తప్పుపట్టింది. వాటిని కొట్టేస్తున్నాం. లోతైన విచారణ జరపాలని స్పష్టం చేస్తున్నాం’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. మరోవైపు మెజిస్ట్రేట్‌ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ తొమ్మిదో ఏడీజే కోర్టులో పోలీసులు దాఖలు చేసిన రివిజన్‌ పిటిషన్‌కు విచారణ అర్హత ఉందని స్పష్టంచేశారు.

ఇదీ కేసు నేపథ్యం

ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల కేసులో మాజీమంత్రి నారాయణను జ్యుడిషియల్‌ రిమాండ్‌కు ఇచ్చేందుకు చిత్తూరు మెజిస్ట్రేట్‌ కోర్టు నిరాకరిస్తూ.. ఆయనకు బెయిలు ఇచ్చింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ పోలీసులు.. చిత్తూరు తొమ్మిదో ఏడీజే కోర్టులో రివిజన్‌ దాఖలు చేశారు. మెజిస్ట్రేట్‌ కోర్టు ఉత్తర్వులను తప్పుపట్టిన తొమ్మిదో ఏడీజే.. నారాయణను కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. పోలీసుల తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదించారు. ఇటీవల వాదనలు ముగియడంతో న్యాయమూర్తి.. మంగళవారం తీర్పు ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని