దూసుకొస్తున్న తుపాను

బంగాళాఖాతంలో మరో తుపాను దూసుకొస్తోంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణశాఖ హెచ్చరించింది.

Published : 07 Dec 2022 03:50 IST

దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్షాలు

ఈనాడు, విశాఖపట్నం: బంగాళాఖాతంలో మరో తుపాను దూసుకొస్తోంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణశాఖ హెచ్చరించింది. అల్పపీడనం పశ్చిమ వాయవ్యదిశగా కదులుతూ మంగళవారం సాయంత్రానికి వాయుగుండంగా బలపడింది. ఈ సమయంలో ఇది కారైకాల్‌ (శ్రీలంక)కు 970 కి.మీ, చెన్నైకి 1020 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. ఇది బుధవారం సాయంత్రానికి తుపానుగా మారనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈ తుపాను పుదుచ్చేరి- ఉత్తర తమిళనాడు మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తుపాను ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి సూచనలు జారీచేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేడ్కర్‌ ప్రకటనలో తెలిపారు.

తీవ్ర ప్రభావం: తుపాను కారణంగా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 8, 9, 10 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 8వ తేదీన నెల్లూరు, తిరుపతి జిల్లాలో అధిక వర్షాలు ఉండొచ్చు. 9న ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య, బాపట్ల, వైయస్‌ఆర్‌, సత్యసాయి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చు. 10న కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఎన్‌టీఆర్‌, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో అధిక వర్షాలు కురుస్తాయి. అతిభారీ వర్షాలు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో ఉంటాయి. తుపాను ప్రభావంతో 7, 8, 9 తేదీల్లో సముద్రం అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. అందువల్ల శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, వెళ్లినవారూ వెంటనే తిరిగి రావాలని సూచించారు. అత్యవసర సాయం, సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే 18004250101 నంబరును సంప్రదించాలన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు