వైకాపా నేత దేవినేని అవినాష్‌ ఇంట్లో ఐటీ సోదాలు

మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు, విజయవాడ తూర్పు నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జి దేవినేని అవినాష్‌ ఇంట్లో ఆదాయపన్ను విభాగం బృందాలు మంగళవారం సోదాలు చేపట్టాయి.

Published : 07 Dec 2022 03:50 IST

ఉదయం నుంచి కొనసాగుతున్న తనిఖీలు
ఇంటి వద్దకు భారీగా చేరుకున్న నాయకులు
రోడ్డుపై బైఠాయించి కార్యకర్తల నిరసన

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-గుణదల: మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు, విజయవాడ తూర్పు నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జి దేవినేని అవినాష్‌ ఇంట్లో ఆదాయపన్ను విభాగం బృందాలు మంగళవారం సోదాలు చేపట్టాయి. ఉదయం ఆరు గంటలకు విజయవాడలోని గుణదలలో ఆయన ఇంటికి ఐటీ అధికారులు చేరుకున్నారు. లోపలకు ఎవరినీ రానీయకుండా సీఆర్‌పీఎఫ్‌ బలగాలను ప్రధానగేటు వద్ద కాపలా ఉంచారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని రోడ్‌ నంబరు-2లోని స్థలం డెవలప్‌మెంట్‌ కోసం వంశీరామ్‌ బిల్డర్స్‌తో అవినాష్‌ ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించే ఐటీ సోదాలు జరిగినట్లు సమాచారం. రాత్రి 9 గంటలు దాటినా ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

నినాదాలు.. బైఠాయింపు

సోదాల విషయం తెలుసుకున్న నగర కార్పొరేటర్లు, వైకాపా నాయకులు, కార్యకర్తలు అక్కడకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మెయిన్‌ గేటు, రోడ్డుపై భారీగా గుమిగూడారు. చిన్న వయసులో నేతగా ఎదుగుతున్న అవినాష్‌పై కేంద్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘జై జగన్‌.. జై అవినాష్‌.. జోహార్‌ నెహ్రూ.. ప్రాణాలైనా అర్పిస్తాం’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో నినాదాలు చేస్తూ రామవరప్పాడు-గుణదల రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. పోలీసులు సర్దిచెప్పినా వినకపోవడంతో అదనపు బలగాలు చేరుకున్నాయి. ఉన్నతాధికారులు వచ్చి.. నేతలు, కార్యకర్తలకు నచ్చజెప్పి విరమింపజేశారు.

కనిపించేవరకూ వెళ్లబోమంటూ..

తమ నేత బయటకు వచ్చి కనిపించేవరకూ అక్కడి నుంచి కదిలేది లేదని నగర డిప్యూటీ మేయర్‌ బెల్లం దుర్గ, కార్పొరేటర్లు నిర్మలాకుమారి, ప్రసన్నకుమారి తదితరులు ఇంటి గేటు వద్ద కూర్చున్నారు. ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందోనని గమనిస్తూ అక్కడే ఉండిపోయారు. రాత్రి రోడ్డుపైనే టెంట్‌ వేశారు.


హైదరాబాద్‌లోని వంశీరామ్‌ బిల్డర్స్‌లో..

ఈనాడు, హైదరాబాద్‌: ప్రముఖ నిర్మాణ సంస్థ వంశీరామ్‌ బిల్డర్స్‌లో కార్యాలయం, వెంచర్లతోపాటు ఛైర్మన్‌, భాగస్వామి ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. పెద్దఎత్తున పత్రాలు, హార్డ్‌డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో భాగంగానే విజయవాడలో దేవినేని అవినాశ్‌ ఇంట్లోనూ సోదాలు జరిగాయి. బంజారాహిల్స్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వంశీరామ్‌ బిల్డర్స్‌ 1996 నుంచి నిర్మాణ రంగంలో ఉంది. ఐటీ శాఖకు చెందిన 25 బృందాలు విడిపోయి, ఒకేసారి బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 36లో ఉన్న సంస్థ ప్రధాన కార్యాలయం, రోడ్‌ నంబర్‌ 17లోని భాగస్వామి జనార్దనరెడ్డి ఇంట్లో, నందిహిల్స్‌లోని సంస్థ చైర్మన్‌ సుబ్బారెడ్డి ఇంట్లో తనిఖీలు చేపట్టాయి. ఇంకొన్ని బృందాలు నగర శివార్లలోని వెంచర్లకు చేరుకున్నాయి. రాత్రి వేళా సోదాలు కొనసాగుతున్నాయి. సుబ్బారెడ్డి వంశీరామ్‌ ఎస్టేట్స్‌, వంశీరామ్‌ ఏఆర్‌ఆర్‌ వెంచర్స్‌, వంశీరామ్‌ పృథ్వీ బిల్డర్స్‌, వంశీరామ్‌ వినీల్‌ వెంచర్స్‌ వంటి 19 సంస్థల్లో భాగస్వామిగా ఉన్నట్లు తెలుస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని