ఏపీహెచ్‌సీఏఏ కార్యవర్గం విషయంలో... సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై ధర్మాసనం స్టే

ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం (ఏపీహెచ్‌సీఏఏ) కార్యవర్గం విషయంలో హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై ధర్మాసనం స్టే విధించింది.

Published : 07 Dec 2022 05:15 IST

ఈనాడు, అమరావతి: ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం (ఏపీహెచ్‌సీఏఏ) కార్యవర్గం విషయంలో హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై ధర్మాసనం స్టే విధించింది. ఏపీ బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకోని ఓ న్యాయవాదికి ఏపీహెచ్‌సీఏఏ కార్యకలాపాల నిర్వహణకు ఏర్పాటు చేసిన తాత్కాలిక కమిటీలో ‘బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌’ స్థానం కల్పించడాన్ని ఆక్షేపించింది. ఏపీహెచ్‌సీఏఏ కార్యవర్గం నుంచి తాత్కాలిక కమిటీ తక్షణం బాధ్యతలు తీసుకోవాలని సింగిల్‌ జడ్జి ఈనెల 1న ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేసింది. మరోవైపు కాలపరిమితి ముగిసినా ప్రస్తుత కార్యవర్గం కొనసాగడం సరికాదని పేర్కొంది. ఇలాంటివన్నీ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పాడుచేస్తాయని వ్యాఖ్యానించింది. ఏపీహెచ్‌సీఏఏ నూతన కార్యవర్గం కోసం సాధ్యమైనంత త్వరగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించింది. ఎందుకు భయపడుతున్నారని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణలో ఈ వ్యాజ్యంపై విచారణ జరిపి ఎన్నికల నిర్వహణకు ఆదేశాలిస్తామంది. ఏపీహెచ్‌సీఏఏ తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి స్పందిస్తూ... కొత్త కార్యవర్గం కోసం ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగానే ఉన్నామని, షెడ్యూల్‌ ఇస్తామని చెప్పారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ విచారణను డిసెంబర్‌ 14కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యవర్గం కాలపరిమితి ఈ ఏడాది మార్చితో ముగిసినా ఎన్నికలు నిర్వహించకపోవడం, ఈ విషయమై ఏపీ బార్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసిన చర్యలు లేవని పేర్కొంటూ న్యాయవాది ఎన్‌.విజయభాస్కర్‌ హైకోర్టులో సింగిల్‌ జడ్జి వద్ద వ్యాజ్యం వేసిన విషయం తెలిసిందే.  దీనిపై వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు సింగిల్‌ జడ్జి.. ఏపీహెచ్‌సీఏఏ కార్యవర్గం నుంచి తక్షణమే బాధ్యతలు తీసుకోవాలని తాత్కాలిక కమిటీకి స్పష్టం చేశారు. వ్యాజ్యంపై విచారణను మూసివేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీహెచ్‌సీఏఏ అధ్యక్షుడు జానకిరామిరెడ్డి, కార్యదర్శి కె.నర్సిరెడ్డి ధర్మాసనం ముందు అప్పీళ్లు వేశారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు