పట్టువిడుపులతోనే పరిష్కారం

మనమంతా ఒకదేశంలో ఉన్నామని, అంతర్రాష్ట్ర వివాదాలపై రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో వ్యవహరించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం హితవు పలికింది.

Published : 08 Dec 2022 05:17 IST

అంతర్రాష్ట్ర వివాదాలపై ఇచ్చిపుచ్చుకొనే ధోరణి ఉండాలి
పోలవరం కేసులో ప్రభావిత రాష్ట్రాలకు సుప్రీంకోర్టు హితవు
పనులను ఆపాలన్న ఒడిశా వినతిని అంగీకరించని కోర్టు
నిర్మాణంపై అభ్యంతరం లేదన్న తెలంగాణ
2నెలల్లో సీఎంల సమావేశం నిర్వహిస్తామన్న కేంద్రం

ఈనాడు, దిల్లీ: మనమంతా ఒకదేశంలో ఉన్నామని, అంతర్రాష్ట్ర వివాదాలపై రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో వ్యవహరించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం హితవు పలికింది. మధ్యవర్తిత్వం నడిచేటప్పుడు పట్టువిడుపులు ప్రదర్శిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టంచేసింది. పోలవరం నిర్మాణాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో ఒడిశా దాఖలు చేసిన వ్యాజ్యంపై బుధవారం జస్టిస్‌ సంజయ్‌కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓకా, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ప్రాజెక్టు పనులను ఆపేయాలన్న ఒడిశా వినతిని పరిగణనలోకి తీసుకోలేదు. ఈ కేసులో కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌(ఏఎస్‌జీ) ఐశ్వర్యభాటి వాదనలు వినిపిస్తూ... సమస్య పరిష్కారానికి ఇప్పటికే రెండు సమావేశాలు నిర్వహించామని, రాష్ట్రాలు తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా తెలిపాయన్నారు. తమకు సమయమిస్తే 2 నెలల్లోగా ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించి, కోర్టుకు తుది నివేదిక సమర్పిస్తామన్నారు. ఒడిశా తరఫు సీనియర్‌ న్యాయవాది అరుణ్‌కట్పాలియా అభ్యంతరం వ్యక్తంచేస్తూ... ‘సెప్టెంబరులో తొలి సమావేశం జరిగింది. అక్టోబరులో సాంకేతిక అంశాలపై మరో సమావేశం నిర్వహించారు. అందరి అభిప్రాయాలను లిఖితపూర్వకంగా చెప్పాలన్నారు. అక్టోబరు 19న మా అభ్యంతరాలను సమర్పించాం. తర్వాత ఏ స్పందనా రాలేదు. మరోవైపు ప్రాజెక్టు స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారు. వరద వచ్చినప్పుడు వెనుకజలాలు మమ్మల్ని ముంచెత్తుతాయి. పనులను నిలిపేయండి. అత్యవసరమైన అంతర్రాష్ట్ర వివాదంలో అక్టోబరు నుంచి ఎలాంటి పురోగతి లేదు’ అని వాదించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని జస్టిస్‌ సంజయ్‌కిషన్‌ కౌల్‌ ప్రశ్నించారు. ఏఎస్‌జీ స్పందిస్తూ ‘డిసెంబరు 2న సీడబ్ల్యూసీ నివేదిక వచ్చింది. రాష్ట్రాల నుంచీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వీటిపై మేం నివేదిక సమర్పించాక కోర్టు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు’ అని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌ న్యాయవాది స్పందిస్తూ... తమ అభిప్రాయాలను నవంబరు 4న సమర్పించామని, ఒడిశా విధానానికి తామూ కట్టుబడి ఉన్నామన్నారు. జస్టిస్‌ సంజయ్‌కిషన్‌ కౌల్‌ స్పందిస్తూ... ‘ఒక్కో రాష్ట్రం ఒక్కో అభిప్రాయం వ్యక్తం చేస్తే పరిష్కారాలు సాధ్యంకావు. మనమంతా ఒకే దేశంలో ఉన్నాం. రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో ఉండాలి’ అని వ్యాఖ్యానించారు.

రక్షణ గోడలు నిర్మించండి: తెలంగాణ

తెలంగాణ తరఫు న్యాయవాది సీఎస్‌ వైద్యనాథన్‌ కల్పించుకుని... ‘మేం పోలవరం నిర్మాణం కొనసాగాలని కోరుకుంటున్నాం. ముంపు తలెత్తకుండా ఏపీ ప్రభుత్వం ఇరువైపులా రక్షణ గోడలు నిర్మించాలి. ఇదివరకు గరిష్ఠ వరదను 36 మిలియన్‌ క్యూసెక్కులుగా అంచనా వేస్తే ఇప్పుడది 50 లక్షల క్యూసెక్కులకు చేరిన విషయాన్ని గుర్తించాలి’ అని తెలిపారు. ఏపీ తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది జైదీప్‌గుప్తా స్పందిస్తూ... కేసుకు ధర్మాసనం వద్ద పరిష్కారం లభించకుంటే, ట్రయల్‌ ఆన్‌ ఎవిడెన్స్‌కు వెళ్లాల్సి ఉంటుందన్నారు. అయితే మధ్యవర్తిత్వం నడవాలని కోరారు. జస్టిస్‌ సంజయ్‌కిషన్‌ కౌల్‌ స్పందిస్తూ... ‘మధ్యవర్తిత్వం కొనసాగడంతోపాటు సమస్యకు పరిధులను నిర్ధారించాలి. ప్రతి ఒక్కరూ తమ వాదనలకే కట్టుబడి ఉంటే ఎప్పటికీ ఏమీ జరగదు. అంతిమంగా సీడబ్ల్యూసీయే పరిష్కారం చూపాలి. సీఎంల సమావేశం ఏర్పాటుచేసి, సమస్యను తగ్గించేందుకు ప్రయత్నించాలి. ఆ తర్వాతే అంతిమంగా కోర్టు ఈ విషయాన్ని చూస్తుంది’ అని స్పష్టంచేశారు. ఏపీ ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ... ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో ఇంతవరకు ప్రజాభిప్రాయ సేకరణే చేపట్టలేదన్నారు. అందుకు ఒడిశా న్యాయవాది స్పందిస్తూ... ప్రాజెక్టు ముంపు ఎంతవరకు ఉంటుందన్నది తెలియనప్పుడు అభిప్రాయ సేకరణ ఎలా చేపడతామని ప్రశ్నించారు. అసలీ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులేలేవని పునరుద్ఘాటించారు. అందరి వాదనలను విన్న ధర్మాసనం కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 15కి వాయిదా వేసింది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు