ఇల్లు కొనగలమా?

కీలక రెపోరేటును ఆర్‌బీఐ మరో 35 బేసిస్‌ పాయింట్లు (0.35%) పెంచి 6.25 శాతానికి చేర్చింది.

Updated : 08 Dec 2022 07:21 IST

పెరిగిన వడ్డీ రేట్లు
మధ్యతరగతిపై నెలవారీ వాయిదాల భారం

ఈనాడు, బిజినెస్‌ బ్యూరో: కీలక రెపోరేటును ఆర్‌బీఐ మరో 35 బేసిస్‌ పాయింట్లు (0.35%) పెంచి 6.25 శాతానికి చేర్చింది. దీంతో గృహ, వాహన, ఇతర రుణాల నెలవారీ వాయిదాలు (ఈఎంఐలు) మరింత భారం అవుతాయి. ఒక పక్క ఇంటి నిర్మాణ ధరలు పెరుగుతున్నాయి.. మరోవైపు రుణాలపై వడ్డీ రేట్లు అధికమవుతున్నాయి. వెరసి మధ్యతరగతి వర్గాలకు సొంతింటి కల దూరమయ్యే రోజులు వచ్చాయి. వడ్డీరేట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 2.25 శాతం పెరిగాయి. మొత్తం మీద వడ్డీ రేట్ల పెంపు రుణగ్రహీతల ఇంటి బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. దేశంలో కీలక వడ్డీగా పరిగణించే రెపో రేటు (వాణిజ్య బ్యాంకులకు రుణాలిచ్చేందుకు ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు) 6.25 శాతానికి చేరింది. కొవిడ్‌ పరిణామాల నేపథ్యంలో చాలాకాలం పాటు 4% వద్దే ఉన్న రెపోరేటు వల్ల రుణగ్రహీతలకు తక్కువ వడ్డీకే రుణాలందాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుండటం, ఇతర కారణాలతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఏప్రిల్‌లో తొలిసారిగా రెపోరేటు పెంచింది. అక్కడి నుంచి అయిదు విడతల్లో ఇది 6.25 శాతానికి చేరింది. దీంతో ఇప్పుడు రెపో ఆధారిత వడ్డీ రేట్లను (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌) అమలుచేసే బ్యాంకులు తమ గృహరుణాల వడ్డీరేట్లను అనివార్యంగా పెంచుతాయి.

కొత్త వారికి భారం ఎలా?

ఒక వ్యక్తి రూ.40 లక్షల గృహరుణాన్ని, 25 ఏళ్ల వ్యవధికి తీసుకోవాలనుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఆయనకు వర్తించే ఈఎంఐ, వడ్డీ భారం ఇప్పుడు ఎలా పెరిగిందో చూద్దాం.. ఏప్రిల్‌లో రెపోరేటు 4 శాతం ఉండగా, గృహరుణ రేటు 6.50 శాతంగా ఉంది. ఇప్పుడు రెపో రేటు 6.25 శాతం కాబట్టి, గృహరుణ రేటు 8.75 శాతానికి చేరే అవకాశం ఉంది.

ఈఎంఐ పెరుగుతుందా?

రెపోరేటు మారినప్పుడల్లా బ్యాంకులు ఈఎంఐని తగ్గించడం లేదా పెంచడం లాంటివి చేయవు. చెల్లింపు కాలవ్యవధినే సవరిస్తాయి. కానీ, ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. చాలా బ్యాంకులు ఈసారి ఈఎంఐని పెంచే అవకాశం ఉంది. దీనికి కారణం లేకపోలేదు. బ్యాంకులు గృహరుణాన్ని గరిష్ఠంగా 360 నెలల (30 ఏళ్లు) వ్యవధికే ఇస్తాయి. ఇప్పుడు వడ్డీరేటు పెరగడంతో ఒక్కసారిగా వ్యవధి పెరుగుతోంది. రుణగ్రహీత ఇంతకాలం ఈఎంఐలను చెల్లించడం దాదాపు అసాధ్యం. రుణం తీసుకున్న వ్యక్తికి ఇప్పటికే 45-50 ఏళ్లు దాటాయనుకోండి.. అప్పుడు వ్యవధి పెంచడానికి బ్యాంకులు ఇష్టపడకపోవచ్చు. కాబట్టి, కచ్చితంగా ఈఎంఐ పెంచుతాయి.

డిపాజిట్‌ రేట్లపై తాత్సారమే

రుణరేట్లు పెంచుతున్నా బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిటర్లకు మాత్రం ప్రయోజనాన్ని బదిలీ చేయడంలో తాత్సారం చేస్తున్నాయి. వడ్డీరేట్లు పెరుగుతున్నా, రుణాలకు గిరాకీ తగ్గడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు మంచి ప్రతిఫలం (అధికవడ్డీ) లభించడం లేదనే కారణంతో డిపాజిట్‌ చేసేందుకు చాలామంది ఆసక్తి చూపట్లేదు. ప్రస్తుతం బ్యాంకులు 3-5 ఏళ్ల వ్యవధి డిపాజిట్లపై 6.10% వరకు వడ్డీనిస్తున్నాయి. ఇప్పుడు మరో 10-20 బేసిస్‌ పాయింట్ల మేరకు పెరిగే అవకాశం ఉంది. సీనియర్‌ సిటిజన్లకు అరశాతం వడ్డీ అధికంగా లభిస్తుంది.

20 ఏళ్లకు తీసుకుంటే 43 ఏళ్లు

కొత్తగా రుణం తీసుకునేవారికి ఈఎంఐ భారం అవుతుండగా, ఇప్పటికే రుణం తీసుకున్నవారికి చెల్లింపు వ్యవధి పెరుగుతుంది. ఉదాహరణకు రూ.40 లక్షల రుణాన్ని 6.50 శాతానికి 240 నెలల (20 ఏళ్లు) వ్యవధికి తీసుకున్నారనుకుందాం. వడ్డీ ఇప్పుడు 8.75 శాతానికి చేరితే లెక్కలు ఎలా మారుతున్నాయో చూద్దాం..

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు