CM Jagan: జగన్‌ ప్రసంగం.. జనం పలాయనం

విజయవాడలోని ఇందిరాగాంధీ క్రీడా మైదానంలో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన జయహో బీసీ మహాసభలో ముఖ్యమంత్రి జగన్‌ ప్రసంగిస్తున్న సమయంలోనే సగం ప్రాంగణం ఖాళీ అయిపోయింది.

Updated : 08 Dec 2022 08:13 IST

సీఎం మాట్లాడుతుండగానే బయటకు వెళ్లిపోయిన వైకాపా శ్రేణులు
మధ్యాహ్నం 1.30 వరకు భోజనాలకు నిరాకరణ

ఈనాడు, అమరావతి: విజయవాడలోని ఇందిరాగాంధీ క్రీడా మైదానంలో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన జయహో బీసీ మహాసభలో ముఖ్యమంత్రి జగన్‌ ప్రసంగిస్తున్న సమయంలోనే సగం ప్రాంగణం ఖాళీ అయిపోయింది. ఒకవైపు జగన్‌ ప్రసంగం సాగుతుండగానే.. కుర్చీలలో నుంచి లేచి జనం భారీగా బయటకు వెళ్లిపోతుండడంతో వారిని ఆపేందుకు పోలీసులు, వైకాపా నాయకులు తీవ్రంగా ప్రయత్నించారు. ఇందిరాగాంధీ మైదానానికి అన్నివైపులా ఉన్న దారులను బారికేడ్లు, తాళ్లతో మూసేసి.. జనాన్ని లోపలే ఉంచేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఉదయం 8గంటల నుంచి సభా ప్రాంగణానికి భారీగా వైకాపా శ్రేణులు, జనాన్ని తరలించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి బస్సుల్లో సభ కోసం జనాన్ని తీసుకొచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. మధ్యాహ్నం 12 తర్వాత సీఎం జగన్‌ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి ప్రసంగం ప్రారంభించిన సమయంలో ప్రాంగణంలో భారీగానే జనం ఉన్నారు. అరగంట తర్వాత.. సగం కుర్చీలు ఖాళీ అయిపోయాయి. సీఎం ప్రసంగం గంటా 20నిమిషాలు సాగింది. ప్రసంగం ముగిసే సమయానికి.. ప్రాంగణంలోని చాలా కుర్చీలు ఖాళీగా మారాయి.

భోజనశాలల వద్ద అవస్థలు.. తోపులాట

సభకు వచ్చినవారి కోసం మాంసాహార, శాకాహార భోజనాలు సిద్ధం చేశారు. సభా ప్రాంగణానికి మూడువైపులా భోజనశాలలు ఏర్పాటుచేశారు. మటన్‌ బిర్యానీ, చికెన్‌, చేపల పులుసు, ఫ్రై, రొయ్యలు, కోడిగుడ్లు, వెజ్‌ బిర్యానీ, పన్నీరు గ్రీన్‌పీస్‌.. ఇలా పెద్ద మెనూనే సిద్ధం చేశారు. ఉదయం 10గంటలకే ఆహారం తీసుకొచ్చినా.. మధ్యాహ్నం ఒంటిగంట వరకూ తినేందుకు అనుమతించలేదు. నాలుగైదు గంటలకు పైగా వేచి ఉన్నవారు భోజనశాలల వద్దకు మధ్యాహ్నం 12గంటల నుంచి రావడం ఆరంభించారు. కానీ.. సీఎం ప్రసంగం పూర్తయ్యేవరకూ అనుమతించేది లేదని చెప్పడంతో.. సభకు వచ్చిన జనం తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తంచేశారు. కొందరు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు 1.30 తర్వాత లోపలికి అనుమతించారు. ఒక్కసారిగా కిక్కిరిసిపోవడంతో తోపులాట జరిగింది. స్టేడియం నుంచి బయటకు వెళ్లిపోయినవాళ్లు భోజనాల కోసం మళ్లీ రావడానికి ప్రయత్నించగా.. పోలీసులు గేట్లు మూసేసి ఆపేశారు.

మద్యం, గుట్కా ప్యాకెట్ల స్వాధీనం..

మహాసభ కోసం తరలివచ్చినవారి వద్ద భారీగా మద్యం సీసాలు, గుట్కా, సిగరెట్‌ ప్యాకెట్లను తనిఖీసిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ప్రాంగణంలోకి అనుమతించేటప్పుడు ప్రతి ఒక్కరినీ తనిఖీచేశారు.

* మధ్యాహ్నం బయటకు వెళ్లిపోయేందుకు ప్రయత్నించినవారిని పోలీసులు అడ్డుకోవడంతో కొంతమంది గ్యాలరీలపైకి ఎక్కి అక్కడినుంచి బయటకు వెళ్లిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని