గంటన్నర.. నరకయాతన!

రైలు దిగే క్రమంలో ప్రమాదవశాత్తు జారిపడి బోగీకి, ప్లాట్‌ఫాంకు మధ్యలో చిక్కుకుపోయిన ఓ విద్యార్థిని గంటన్నర సేపు నరకయాతన అనుభవించింది.

Published : 08 Dec 2022 04:31 IST

రైలు, ప్లాట్‌ఫాంకు మధ్య ఇరుక్కుపోయిన విద్యార్థిని
దువ్వాడలో రైలు దిగేందుకు సిద్ధపడుతుండగా ప్రమాదం

విశాఖపట్నం (కూర్మన్నపాలెం), అన్నవరం, న్యూస్‌టుడే: రైలు దిగే క్రమంలో ప్రమాదవశాత్తు జారిపడి బోగీకి, ప్లాట్‌ఫాంకు మధ్యలో చిక్కుకుపోయిన ఓ విద్యార్థిని గంటన్నర సేపు నరకయాతన అనుభవించింది. కాపాడమంటూ ఆమె చేసిన ఆర్తనాదాలు అక్కడివారికి కంటతడి పెట్టించాయి. ఈ విషాద ఘటన బుధవారం ఉదయం విశాఖపట్నం దువ్వాడ రైల్వేస్టేషన్‌లో చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా అన్నవరానికి చెందిన ఎం.శశికళ(22) విశాఖ జిల్లా దువ్వాడలో ఎంసీఏ చదువుతోంది. రైల్వే పాస్‌ తీసుకుని రోజూ కాలేజీకి వచ్చి వెళ్తోంది. బుధవారం ఉదయం అన్నవరంలో గుంటూరు- రాయగడ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కింది. రైలు దువ్వాడ స్టేషన్‌కు చేరుకున్న క్రమంలో దిగడానికి సన్నద్ధమవుతూ గుమ్మం దగ్గరకు వచ్చి నిల్చుంది. రైలు ఆగేముందు ఒక్కసారిగా జర్క్‌ ఇవ్వడంతో.. గుమ్మం దగ్గర ఉన్న ఆమెను వెనుక ఉన్న డోర్‌ వచ్చి గుద్దుకుంది. ఆమె తూలి కిందకు జారిపోయి.. రైలుకు, ప్లాటుఫాంకు మధ్య ఖాళీలో ఇరుక్కుపోయింది. తోటి విద్యార్థులు, ప్రయాణికులు గట్టిగా కేకలు వేయడంతో జీఆర్పీ సిబ్బంది రైలు నిలిపేశారు. ఉన్నతాధికారులు వెంటనే ఆమెను బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. కనీసం కదిలే వీలు లేకపోవడంతో ఆమె నరకయాతన అనుభవిస్తూ తీవ్రంగా రోదించింది. సిబ్బంది ఎంత ప్రయత్నించినా.. వీలు కాకపోవడంతో ప్లాట్‌ఫాం తవ్వేందుకు సిద్ధమయ్యారు. ఈలోపు వైద్య సిబ్బందిని తీసుకొచ్చి ప్రథమ చికిత్స చేసి సెలైన్‌ ఎక్కించారు. అతి కష్టం మీద ఆమెను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. యూరిన్‌ బ్లాడర్‌ దెబ్బతినడం, ఎముకలు నలిగిపోవడంతో శస్త్రచికిత్స చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు. శరీరం సహకరించకపోవడంతో ప్రస్తుతం అత్యవసర విభాగంలో ఉంచి వైద్యం అందిస్తున్నారు. బాధితురాలి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఆసుపత్రివర్గాలు పేర్కొన్నాయి. వాల్తేర్‌ రైల్వే డీఆర్‌ఎం అనూప్‌ సత్పతి సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

వసతిగృహంలో చేరేలోపే ప్రమాదం..

అన్నవరం గ్రామానికి చెందిన రేషన్‌ డీలరు మెరపల బాబూరావు కుమార్తె శశికళ. ఒక్కగానొక్క కుమార్తె కావడంతో తల్లిదండ్రులు అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. దువ్వాడలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. రోజూ రాకపోకలకు కష్టం కావడంతో అక్కడే వసతిగృహంలో ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుంది. ఇంతలోనే రెప్పపాటులో జరిగిన ప్రమాదంతో తీవ్ర గాయాలపాలైన కుమార్తెను చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు