Tiruchanur: పద్మావతీ అమ్మవారి భక్తులపై ధరాభారం.. భారీగా సేవా టికెట్ల రుసుములు పెంపు

తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆర్జిత సేవా టికెట్ల ధరలను తితిదే భారీగా పెంచింది.

Updated : 08 Dec 2022 10:34 IST

కొత్తగా సుపథం పేరిట రూ.200 దర్శనం
తిరుప్పావై సేవకు రూ.వెయ్యి

తిరుచానూరు, న్యూస్‌టుడే: తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆర్జిత సేవా టికెట్ల ధరలను తితిదే భారీగా పెంచింది. గుట్టుచప్పుడు కాకుండా రెట్టింపు చేసిన ధరలను తక్షణం అమల్లోకి తెచ్చింది. ఈ విషయమై కొన్ని రోజులుగా తర్జనభర్జన పడిన పాలకమండలి చివరకు భక్తులపై ఆర్థిక భారం మోపింది. తిరుమల తరహాలో తిరుచానూరులో కొత్తగా సుపథం టికెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.200 టికెట్‌ కొనుగోలు చేసిన భక్తులు త్వరగా దర్శనం చేసుకునేలా క్యూలో మార్పులు తెచ్చారు. ఆర్జిత సేవలకు డిమాండ్‌ పెరగడంతో వీటి ధరలను రెట్టింపు చేశారు.

* కుంకుమార్చన, అభిషేకానంతర దర్శనం సేవలను గతంలో రద్దు చేశారు. వీటిని కొత్త ధరలతో ప్రవేశపెడుతున్నారు. ఈ ధరలు రెండు, మూడు రోజుల్లో అమల్లోకి రానున్నట్లు సమాచారం. తిరుప్పావై సేవా టికెట్‌ ధరను గురువారం నుంచి అమలు చేయనున్నారు.

* అమ్మవారి ఆలయంలో గతంలో రాత్రి సమయంలో అమలు చేసిన వీఐపీ బ్రేక్‌ దర్శనాన్ని పునఃప్రారంభించేందుకు అధికారులు ఆసక్తి చూపలేదు. ఇద్దరు పాలకమండలి సభ్యులు పట్టుబట్టినా పట్టించుకోలేదు. స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ప్రతి మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు గ్రామస్థులను అనుమతించాలని తితిదే నిర్ణయించింది.

తితిదే పాలకమండలి నిర్ణయం అమలు: తితిదే పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తున్నాం. 2004 తర్వాత ఇప్పటి వరకు ఆర్జిత సేవా టికెట్ల ధరలను పెంచలేదు. కొత్త సాఫ్ట్‌వేర్‌ సిద్ధం చేశాక ఈ ధరలు అమలు చేస్తాం. రూ.వంద టికెట్‌ను రద్దు చేసి దాన్ని మాత్రం రూ.50కు తగ్గించాం. భక్తులు అందరూ సహకరించాలని మనవి.

లోకనాథం, డిప్యూటీ ఈవో, తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు