నరకం చూపించిన ఆర్టీసీ

నరకం అంటే ఎలా ఉంటుందో ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ బుధవారం చూపించింది.

Updated : 08 Dec 2022 10:06 IST

రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికుల పడిగాపులు
వైకాపా సభకు 1,630 బస్సులు

ఈనాడు-అమరావతి, ఈనాడు, న్యూస్‌టుడే యంత్రాంగం: నరకం అంటే ఎలా ఉంటుందో ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ బుధవారం చూపించింది. విజయవాడలో వైకాపా బీసీ సభకు 1,630 బస్సులను పంపించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ప్రాంగణాలు బోసిపోయాయి. గంటలతరబడి ఎదురుచూసినా బస్సులు రాకపోవడం, సమాచారం లేకపోవడం, అడపాదడపా వచ్చిన బస్సులు కిక్కిరిసి ఉండటంతో చాలామంది ప్రయాణాలను మానుకుని వెనుతిరిగారు. దూరప్రాంతాలకు తిరిగే ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌, సూపర్‌లగ్జరీ సర్వీసులను సభకు పంపేయడంతో ఊళ్లకు అరకొరగా నడిచాయి. విజయవాడ, విశాఖపట్నంలో తిరిగే సిటీ ఆర్డినరీ సర్వీసులను దూరప్రాంతాలకు నడిపించారు.

* ఎన్టీఆర్‌ జిల్లాలో 100 పల్లెవెలుగు బస్సులను సభకు పంపారు. జగ్గయ్యపేట, తిరువూరు, నందిగామ, నూజివీడు, మైలవరం డిపోల పరిధిలోని గ్రామాలకు సర్వీసులు రద్దుచేశారు.

* విశాఖపట్నం నుంచి పార్వతీపురం, బొబ్బిలి, శ్రీకాకుళం, పలాస, ఇచ్ఛాపురం, అరకు, అనకాపల్లి, నర్సీపట్నం మార్గాల్లో సర్వీసులు పరిమితంగా నడిచాయి. విజయనగరం, శ్రీకాకుళం, పలాసకు విశాఖ సిటీ సర్వీసులను నడిపారు. ఉత్తరాంధ్రలో దూర ప్రాంత సర్వీసులు చాలావరకు రద్దయ్యాయి.

బెజవాడ చక్రబంధనం

* బీసీ సభ  విజయవాడ నడిబొడ్డున రద్దీగా ఉండే బందరురోడ్డులో నిర్వహించడంతో నగరవాసులు, విజయవాడ మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు. పోలీసులు పలురోడ్లను మూసేశారు. ప్రజారవాణాను అనుమతించలేదు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న వారు సకాలంలో కార్యాలయాలకు, విద్యాసంస్థలకు వెళ్లలేకపోయారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు