నవరత్నాల్లో కోనేరు భూ కమిటీ సిఫార్సులు చేర్చాలి

కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల్లో చేర్చి, పేదలకు భూ పంపిణీ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జనరల్‌ కౌన్సిల్‌ డిమాండ్‌ చేసింది.

Published : 08 Dec 2022 05:13 IST

ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్‌

ఈనాడు, అమరావతి: కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల్లో చేర్చి, పేదలకు భూ పంపిణీ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జనరల్‌ కౌన్సిల్‌ డిమాండ్‌ చేసింది. దీర్ఘకాలంగా పేదలు సాగు చేసుకుంటున్న, నివాసం ఉంటున్న ప్రభుత్వ భూములకు అన్ని హక్కులను కల్పిస్తూ పట్టాలు ఇవ్వాలని పేర్కొంది. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 21న విజయవాడలో రాష్ట్ర భూ సాధన సదస్సు నిర్వహించాలని కౌన్సిల్‌ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ అన్యాక్రాంతమయ్యాయో గుర్తించి, ప్రత్యక్ష పోరాటాలు చేయాలని పిలుపునిచ్చింది. దాసరి భవన్‌లో బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం జనరల్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. ‘కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదు? వేల ఎకరాల భూములు అన్యాక్రాంతమవుతున్నా ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోకపోగా..వారికి అండగా నిలవడం దుర్మార్గం. జగనన్న కాలనీల్లో ఇళ్లు ఉచితంగా నిర్మించి ఇవ్వడం లేదా రూ.5 లక్షల సాయం ఇచ్చే వరకు వినతులు సమర్పిస్తూనే ఉండాలి’ అని కోరారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జల్లి విల్సన్‌, ఆవుల శేఖర్‌ మాట్లాడుతూ.. ‘భూమిని నమ్ముకుని నిత్యం కష్టపడుతున్న వ్యవసాయ కార్మికులు రాష్ట్రంలో 59శాతం ఉన్నారు. అందులో దళితులు, గిరిజనులు, బలహీనవర్గాల వారే అధికం’ అని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని