బొగ్గు బ్లాకులకు మళ్లీ వేలం

కేంద్ర బొగ్గు గనుల శాఖ దేశవ్యాప్తంగా 141 బొగ్గు బ్లాక్‌ల ఈ-వేలానికి సిద్ధపడుతోంది.

Published : 08 Dec 2022 05:13 IST

ఈనాడు డిజిటల్‌, ఏలూరు, చాట్రాయి, న్యూస్‌టుడే: కేంద్ర బొగ్గు గనుల శాఖ దేశవ్యాప్తంగా 141 బొగ్గు బ్లాక్‌ల ఈ-వేలానికి సిద్ధపడుతోంది. డిసెంబరు 26న నిర్వహించే వేలంలో రాష్ట్రానికి చెందిన నాలుగు బ్లాక్‌లు ఉన్నాయి. వీటిలో ఏలూరు జిల్లాలోని చింతలపూడి-సెక్టార్‌ ఎ-1 (ఎన్‌డబ్ల్యూ పార్ట్‌), చింతలపూడి సెక్టార్‌, ఎ-1 (ఎస్‌ఈ పార్ట్‌), చాట్రాయి మండలం సోమవరం ఉత్తర, దక్షిణ బ్లాక్‌లు ఉన్నాయి. వీటి నుంచి 850.78 మెట్రిక్‌ టన్నుల బొగ్గును సేకరించేందుకు అవకాశం ఉందని పేర్కొంది. ఇక్కడ లభించే బొగ్గు నాణ్యత జి-12, జి-13గా ప్రకటించింది. చాట్రాయి మండలం సోమవరం నుంచి తడికలపూడి, ధర్మాజీగూడెం, చింతలపూడి, జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బొగ్గు నిక్షేపాలు లభిస్తాయని నివేదికల్లో పేర్కొన్నారు. ఏలూరు జిల్లాలోని ఈ నాలుగు బ్లాకులకు గతేడాది కాలంలో రెండుసార్లు టెండర్లు పిలిచారు. మొదటిసారి గతేడాది అక్టోబరులో దేశవ్యాప్తంగా 99 బొగ్గు గనులకు టెండర్లు పిలిచినా గుత్తేదారులెవరూ రాలేదు. అదే ఏడాది డిసెంబరులో మరోసారి పిలిచారు. పలుమార్లు గడువు పొడిగించి ఎవరూ రాక టెండర్లు రద్దు చేశారు. ఆ జాబితాలో ఏలూరు జిల్లాలోని నాలుగు బ్లాకులు కూడా ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని