బెంగళూరు-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు నిర్మాణం 2025నాటికి పూర్తి

బెంగళూరు-కడప-విజయవాడ మధ్య జాతీయరహదారి 544జి పేరుతో నిర్మించే గ్రీన్‌ఫీల్డ్‌ యాక్సెస్‌ కంట్రోల్డ్‌ కారిడార్‌ నిర్మాణం 2023లో మొదలై 2025 నాటికి పూర్తవుతుందని కేంద్ర రహదారి రవాణశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు.

Updated : 08 Dec 2022 10:29 IST

ఈనాడు, దిల్లీ బెంగళూరు-కడప-విజయవాడ మధ్య జాతీయరహదారి 544జి పేరుతో నిర్మించే గ్రీన్‌ఫీల్డ్‌ యాక్సెస్‌ కంట్రోల్డ్‌ కారిడార్‌ నిర్మాణం 2023లో మొదలై 2025 నాటికి పూర్తవుతుందని కేంద్ర రహదారి రవాణశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. బుధవారం రాజ్యసభలో భాజపా సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. రూ.12,500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే 342.50 కిలోమీటర్ల ఈ రహదారి కొడికొండ చెక్‌పోస్ట్‌, శెట్టిపల్లె, నల్లమాడ, ఓదులపల్లె, దొరిగల్లు, వేల్పుల, ఉలిమెల్ల, ముతుకూరు, సోమాపురం, పాపిరెడ్డిపల్లె, కవులకుంట్ల, సీతారామాపురం, గుండ్లపల్లె, ఉప్పలపాడు, వంగపాడు, మర్రిపూడి, తాళ్లూరు, కుంకుపాడు, అద్దంకి, ముప్పవరంల మీదుగా సాగుతుందని వెల్లడించారు. 2022 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 8,744 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఉన్నట్లు వైకాపా సభ్యుడు బీదమస్తాన్‌రావు అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విశాఖపట్నం-భోగాపురం మధ్య ఆరు వరసల  బీచ్‌కారిడార్‌ నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్‌ తయారీ 2023 మార్చి నాటికి పూర్తవుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.10,297 కోట్ల విలువైన 1,056 కిలోమీటర్ల పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. నెల్లూరు-తడ మధ్య ఎన్‌హెచ్‌-16ని బీఓటీ పద్ధతిలో 4 వరసలుగా నిర్మించారని, 2031 వరకు దానికి కన్సెషన్‌ పీరియడ్‌ ఉందని తెలిపారు. అందువల్ల ఆ గడువు పూర్తయ్యేంతవరకూ దాన్ని ఆరు వరసలుగా విస్తరించడం సాధ్యంకాదని చెప్పారు.

రాష్ట్రాల సహకారంతోనే విభజన సమస్యలకు పరిష్కారం

ఇరు రాష్ట్రాల పరస్పర సహకారంతోనే విభజన సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని, పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం కేవలం సమన్వయకర్తగా వ్యవహరించడమే కేంద్ర ప్రభుత్వ విధానమని కేంద్రహోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ తెలిపారు. ఆయన బుధవారం రాజ్యసభలో వైకాపా సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన  ప్రశ్నకు బదులిచ్చారు. ‘విభజన సమస్యల పరిష్కారంకోసం కేంద్రహోంశాఖ ఒక సమన్వయ కమిటీని ఏర్పాటుచేసింది. అయినప్పటికీ హోంశాఖ ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం అమలు పురోగతి గురించి సంబంధిత మంత్రిత్వశాఖలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలతో సమీక్షిస్తూ వస్తోంది’ అని కేంద్రమంత్రి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని