పంచిన ఆహార ధాన్యాలు 62.15 లక్షల మెట్రిక్‌ టన్నులే

ప్రజాపంపిణీ వ్యవస్థ, జాతీయ ఆహారభద్రత చట్టం కింద 2019-20 నుంచి 2022-23 (ఈ ఏడాది అక్టోబర్‌ వరకు)వరకూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 66,86,340 మెట్రిక్‌ టన్నుల ఆహారధాన్యాలు తీసుకోగా, పంపిణీ చేసింది మాత్రం 62,15,348 మెట్రిక్‌ టన్నులేనని కేంద్ర ఆహారం, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు.

Updated : 08 Dec 2022 06:35 IST

ఈనాడు, దిల్లీ ప్రజాపంపిణీ వ్యవస్థ, జాతీయ ఆహారభద్రత చట్టం కింద 2019-20 నుంచి 2022-23 (ఈ ఏడాది అక్టోబర్‌ వరకు)వరకూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 66,86,340 మెట్రిక్‌ టన్నుల ఆహారధాన్యాలు తీసుకోగా, పంపిణీ చేసింది మాత్రం 62,15,348 మెట్రిక్‌ టన్నులేనని కేంద్ర ఆహారం, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. రెండింటి మధ్య 4,70,992 మెట్రిక్‌ టన్నుల తేడా ఉన్నట్లు చెప్పారు. బుధవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.

* ఆంధ్రప్రదేశ్‌లో ఆన్‌లైన్‌ ఆర్థిక మోసాలు ప్రతి ఏటా పెరుగుతున్నాయి. ఇలాంటివి 2019లో 703 కేసులు నమోదుకాగా, 2020లో 764, 2021లో 952 కేసులు నమోదైనట్లు కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ సహాయమంత్రి రాజీవ్‌చంద్రశేఖర్‌ లోక్‌సభలో చెప్పారు. ఇందులో 2019లో జీరో, 2020లో 2, 2021లో 3 కేసుల్లో మాత్రమే శిక్షపడినట్లు వెల్లడించారు.


రూ.31వేల కోట్ల అప్పుచేసిన విశాఖస్టీల్‌
అందులో రూ.12వేల కోట్ల చెల్లింపు

ఈనాడు, దిల్లీ విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ గత 20 ఏళ్లలో రూ.31,357 కోట్ల రుణాలు తీసుకున్నట్లు కేంద్ర ఉక్కుశాఖ సహాయమంత్రి ఫగణ్‌సింగ్‌ కులస్థే తెలిపారు. అందులో రూ.12,751 కోట్లు తిరిగి చెల్లించినట్లు వెల్లడించారు. బుధవారం లోక్‌సభలో తెదేపా ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు అడిగిన  ప్రశ్నకు ఆయన ఈ సమాధానమిచ్చారు. 2000 నుంచి ఆర్‌ఐఎన్‌ఎల్‌ ఎలాంటి బాండ్లూ విడుదల చేయలేదని చెప్పారు. సంస్థ పెట్టే మొత్తం ఖర్చులో 63.76% ముడిసరకు కోసమే వెళ్లినట్లు తెలిపారు. 

రైల్వే జోన్‌ వెంటనే ప్రారంభించాలి

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే జోన్‌ వెంటనే ప్రారంభించాలని తెదేపా లోక్‌సభాపక్ష నేత కె.రామ్మోహన్‌నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆయన లోక్‌సభ జీరో అవర్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘మూడేళ్ల క్రితం ఎన్నికలకు ముందు అప్పటి రైల్వే మంత్రి పీయూష్‌గోయల్‌ ఏపీలో విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు. ఇప్పటి వరకూ ప్రారంభం కాలేదు. 2020-21 బడ్జెట్‌లో కేటాయింపులు జరిపినా ఒక్క పైసా కూడా ఖర్చుచేయలేదు. గత నెలలో ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చినప్పుడు ఆయన దీనిపై ఏదో ఒకటి చెబుతారు, శంకుస్థాపన చేస్తారని ప్రజలు ఎంతో ఆశించారు. ఏమీ జరగలేదు. అందువల్ల రైల్వేమంత్రి ఇప్పటికైనా స్పందించి  కొత్త జోన్‌ ప్రారంభించాలి’ అని డిమాండ్‌ చేశారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు