ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో.. విద్యార్థులు బడి మానేసే పరిస్థితి

జాతీయ విద్యా విధానం, విద్యా హక్కు చట్టం నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలో పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ జరుగుతోందని పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఎ.సత్యప్రసాద్‌ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులు బడి మానేసే పరిస్థితి ఏర్పడిందన్నారు.

Updated : 08 Dec 2022 06:29 IST

మాతృభాషలో బోధనను దూరం చేస్తున్నారు
హైకోర్టులో పిటిషనర్ల తరఫు న్యాయవాది
కౌంటర్‌ వేయాలని కేంద్రానికి హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: జాతీయ విద్యా విధానం, విద్యా హక్కు చట్టం నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలో పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ జరుగుతోందని పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఎ.సత్యప్రసాద్‌ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులు బడి మానేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలో ఉండాలని విద్యాహక్కు చట్టం సూచిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం తద్భిన్నంగా వ్యవహరిస్తోందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ ఈ వ్యవహారం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానంతో ముడిపడి ఉన్నందున కేంద్రం స్పందన తెలుసుకోవాల్సి ఉందని అభిప్రాయపడింది. వివరాలు సమర్పించాలని, అవసరమైతే కౌంటర్‌ వేయాలని కేంద్ర ప్రభుత్వం తరఫు డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ హరినాథ్‌కు సూచిస్తూ విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది. న్యాయమూర్తులు జస్టిస్‌ యూ.దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ టి.మల్లికార్జునరావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. పాఠశాల విద్యావ్యవస్థ దెబ్బతినేలా రాష్ట్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుందని, పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణపై జారీచేసిన జీవోలు 117, 128, 84, 85లను రద్దు చేయాలని కోరుతూ కడప, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు, ఏపీ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్‌ బి.రమేశ్‌చంద్ర సింహగిరి పట్నాయక్‌, డాక్టర్‌ గుంటుపల్లి శ్రీనివాస్‌ హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు వేసిన విషయం తెలిసిందే.

ఈ నిర్ణయంతో డ్రాపవుట్లకు ఆస్కారం

విచారణ సందర్భంగా న్యాయవాది ఎ.సత్యప్రసాద్‌ వాదిస్తూ ‘ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను పాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తున్నారు. చిన్నారులు మూడు కిలోమీటర్ల దూరం వెళ్లి చదువుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వ నిర్ణయంతో చిన్నారులు, ముఖ్యంగా బాలికలు లక్షల సంఖ్యలో చదువుకు దూరమయ్యే (డ్రాపవుట్‌) ప్రమాదముంది.ఆంగ్ల మాధ్యమాన్ని తెచ్చేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది.  విద్యాహక్కు చట్ట ప్రకారం ప్రతి 60 మంది విద్యార్థులకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆ చట్టానికి వక్రభాష్యం చెబుతూ విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిని పట్టించుకోవడం లేదు’ అని వాదించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని