ఎన్నికలకు వైకాపా వ్యూహం.. ప్రత్యామ్నాయ సైన్యం!

మరి కొద్ది నెలల్లోనే యుద్ధం.. అని బుధవారం ప్రకటించిన వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌ గురువారమే ఆ యుద్ధానికి వైకాపా సైన్యాన్ని సన్నద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు.

Updated : 09 Dec 2022 07:05 IST

15,000 గ్రామాల్లో 5.20 లక్షల మంది ‘గృహసారథులు’  
ఇప్పుడున్న వాలంటీర్లను ఎన్నికల్లో వాడుకోలేమేమోననే సందేహంతో కొత్తవారి నియామకం  
సచివాలయాలకు 45,000 మంది సమన్వయకర్తలు
వైకాపా జిల్లా, ప్రాంతీయ నేతలతో ముఖ్యమంత్రి జగన్‌

ఈనాడు, అమరావతి: మరి కొద్ది నెలల్లోనే యుద్ధం.. అని బుధవారం ప్రకటించిన వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌ గురువారమే ఆ యుద్ధానికి వైకాపా సైన్యాన్ని సన్నద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రామ/వార్డు సచివాలయాలను ఒక క్లస్టర్‌గా తీసుకుని ఒక్కో దానికి ముగ్గురేసి చొప్పున సమన్వయకర్తలను నియమించాలని వైకాపా బాధ్యులకు స్పష్టం చేశారు. అలాగే వారికి తోడు ‘గృహసారథుల’ పేరుతో ప్రతి 50 ఇళ్లకు ఒక మహిళను, ఒక పురుషుడిని పార్టీ వాలంటీర్లుగా నియమించాలన్నారు. గురువారం ఆయన వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల పర్యవేక్షకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమన్వయకర్తలు, వాలంటీర్ల నియామకం చేపట్టాల్సిన తీరు, వారి అవసరం గురించి సీఎం క్షుణ్నంగా వివరించారు.

పోలరైజేషన్‌ మరింత పకడ్బందీగా

ఇప్పటికే ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున సుమారు 2.60 లక్షల మంది వాలంటీర్లున్నారు. వారంతా దాదాపు వైకాపాకు చెందినవారే. అయితే వారు ప్రభుత్వ వ్యవస్థలో భాగంగా ఉన్నందున పార్టీకి అనుకూలంగా ఎన్నికలకు వినియోగించుకునేందుకు సాంకేతిక సమస్యలు ఎదురు కావచ్చనే ఆలోచనతో ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా పక్కాగా పార్టీ వాలంటీర్లను నియమించేందుకు సీఎం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రతి 50 ఇళ్లకు ఇద్దరేసి చొప్పున గృహ సారథుల పేరుతో నియమించాలని పార్టీ బాధ్యులకు ఆదేశించారు. వీరు ఇప్పటికే ఉన్న వాలంటీర్లతో కలిసే పనిచేయనున్నారు. వారికి కేటాయించిన 50 ఇళ్లలోని వారికి ప్రభుత్వం పథకాలు అందాయో లేదో కనుక్కోవడం.. అందకపోతే అందేలా చేయడం.. ప్రభుత్వ పథకాలపై వివరించడం, పార్టీ కార్యక్రమాలను వారి దృష్టికి తీసుకువెళ్లడం వంటి పనులు చేస్తారు. ఎన్నికల్లో వైకాపాకు మద్దతుగా పోలరైజేషన్‌ పక్కాగా జరిగేలా ఐ-ప్యాక్‌ బృందం ఈ కార్యాచరణను సిద్ధం చేసిందని సీఎం వెల్లడించినట్లు తెలిసింది. ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావాన్ని కొంతవరకైనా తగ్గించగలిగేలా పార్టీ వాలంటీర్లను వినియోగించనున్నారు. ఎన్నికలకు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా ఇలా ఇంటింటికీ పార్టీ యంత్రాంగాన్ని పంపే కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర, ప్రాంతీయ, జిల్లా, నియోజకవర్గాల పార్టీ బాధ్యులు, సచివాలయ సమన్వయకర్తలు, వాలంటీర్లు ఇలా పైనుంచి కింది వరకు వ్యవస్థీకృతం చేసేలా రూపొందించిన కార్యాచరణను తాజా సమావేశంలో వెల్లడించారు.

గెలిపించుకు వస్తామంటేనే ఉండండి

ఎమ్మెల్యేలను బలోపేతం చేసేందుకే క్షేత్రస్థాయి వరకు పార్టీ యంత్రాంగాన్ని నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ‘జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, నియోజకవర్గాల పర్యవేక్షకులు పార్టీని గెలిపించుకుని రావాల్సిందే. అలా పని చేయగలమంటేనే ఉండండి. లేదంటే ఇప్పుడే చెప్పేయండి. కొత్తవారిని నియమిస్తా. అంతేతప్ప మీరు సరిగా పనిచేయకపోవడం వల్ల పార్టీకి నష్టం జరిగితే మిమ్మల్ని గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది’ అని ముఖ్యమంత్రి హెచ్చరించినట్లు సమాచారం. ఎమ్మెల్యేల పనితీరుపై నాలుగు రకాల వ్యవస్థలతో నిరంతర నిఘా ఉందని సీఎం అన్నట్లు తెలిసింది.

‘రాజకీయ ప్రత్యర్థులతో మనకు పెద్ద ఇబ్బందేమీ ఉండకపోవచ్చు.. మన పార్టీలోనే నాయకుల మధ్య అంతర్గత విభేదాలుంటే వాటన్నింటినీ పక్కనపెట్టి కలిసి పనిచేయాలి. పార్టీలో ఎక్కడెక్కడ విభేదాలున్నా వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత నియోజకవర్గాల పర్యవేక్షకులు, జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలదే’ అని సీఎం చెప్పారు.

1.66 కోట్ల కుటుంబాలను కలిసేలా..

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడిన వివరాలను ఆయన కార్యాలయం వెల్లడించింది. దాని ప్రకారం.. ‘గ్రామ/వార్డు సచివాలయాలకు నియమించనున్న ముగ్గురేసి సమన్వయకర్తలు 15 రోజుల్లో ఇంటింటికీ తిరగడం ద్వారా 1.66 కోట్ల కుటుంబాలను పార్టీ తరఫున కలిసేలా కార్యక్రమాన్ని రూపొందించాం. ఈ ముగ్గురు సమన్వయకర్తల్లో ఒక మహిళ ఉండాలి. ఈ నెల 20లోగా వీరి నియామకం చేపట్టాలి. వారు తమ పరిధిలోని ఇళ్లకు వెళ్లి పార్టీ సందేశం, ప్రచార పత్రాలనూ అందజేస్తారు. వారు ఒక రౌండ్‌ పూర్తి చేసేసరికి స్థానికంగా పార్టీకి ఉన్న అనుకూల, ప్రతికూల అంశాలపై అవగాహన వస్తుంది. మరోవైపు ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమం కింద ఎమ్మెల్యేలు నెలలో 4, 5 సచివాలయాల పరిధిలో ఇంటింటికీ వెళ్తారు’ అని వివరించారు. ‘15 వేల గ్రామాల్లో 5.2 లక్షలమంది గృహసారథులు వస్తారు. స్థానికులు, రాజకీయంగా అవగాహన ఉండి, చురుకైన వారినే నియమించుకోవాలి’ అని సూచించారు. 

ప్రోత్సాహకాలివి

‘సచివాలయ సమన్వయకర్తలు, గృహసారథుల పనితీరుపై నిరంతరం మదింపు ఉంటుంది.. వీరందరికీ ఉచిత జీవిత బీమా ఉంటుంది. పార్టీ విస్తృతస్థాయి సమావేశాలకు ఆహ్వానితులు. బూత్‌స్థాయి నుంచి పార్టీకి బలమైన నెట్‌వర్క్‌ను సిద్ధం చేయడమే వీరి నియామకంలో ఉద్దేశం. ఈ నెట్‌వర్క్‌ బలంగా ఉంటేనే విజయం సాధ్యమవుతుంది. ఇక్కడ నేను సంక్షేమ పథకాల సాయం పంపిణీకి బటన్‌ నొక్కడమే కాదు.. క్షేత్రస్థాయిలో నెట్‌వర్క్‌ కూడా బలంగా ఉండాలి. ‘వై నాట్‌ 175’ అనేదే మన లక్ష్యం’ అని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని