తుపానుపై అప్రమత్తంగా ఉండండి

తుపాను ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాల కలెక్టర్లకు సూచించారు.

Updated : 09 Dec 2022 04:46 IST

సమీక్షలో సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి, విశాఖపట్నం: తుపాను ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాల కలెక్టర్లకు సూచించారు. గురువారం ఉదయం క్యాంపు కార్యాలయం నుంచి తుపాను ప్రభావంపై ఆయన సమీక్షించారు. రైతులకు సహాయంగా నిలవాలని, పంట నష్టపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

విపత్తు సహాయ బృందాలను సిద్ధం చేశాం

మాండౌస్‌ తుపాను ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రికి పుదుచ్చేరి, మహాబలిపురం, శ్రీహరికోటల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. సచివాలయం నుంచి ఆయన తిరుపతి, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య, వైయస్‌ఆర్‌ జిల్లాల కలెక్టర్లతో వీడియో సమావేశంలో మాట్లాడారు. 10వ తేదీ వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లోని కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అర్ధరాత్రి తీరం దాటనున్న తుపాను

బంగాళాఖాతంలో ఏర్పడిన మాండౌస్‌ తుపాను పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య శుక్రవారం అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఎస్‌.స్టెల్లా తెలిపారు. తుపాను తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు 65 కి.మీ. నుంచి 85 కి.మీ. వరకు ఉండవచ్చని వాతావరణ కేంద్రం సంచాలకులు ఎస్‌.స్టెల్లా అన్నారు. మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. తుపాను కారణంగా శుక్రవారం సముద్రం అల్లకల్లోలంగా ఉండొచ్చన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని