దళితవాడలను పంచాయతీలు కాకుండా అడ్డుకున్నారు

‘మనలోనే ఇద్దరు గొప్ప నాయకులు ఉన్నారు. దళితవాడలను పంచాయతీలుగా చేసే మంచి అవకాశాన్ని వారే చెడగొట్టారు.

Published : 09 Dec 2022 03:20 IST

మాలల ఆత్మీయ సమావేశంలో సీఐడీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌ ఆరోపణ

ఈనాడు, అమరావతి - న్యూస్‌టుడే, మైలవరం: ‘మనలోనే ఇద్దరు గొప్ప నాయకులు ఉన్నారు. దళితవాడలను పంచాయతీలుగా చేసే మంచి అవకాశాన్ని వారే చెడగొట్టారు. దీనిపై గత ప్రభుత్వంలో చర్చ సాగినప్పుడు ‘ఇదంతా అవతలి వారి కుట్ర సార్‌...! మీరు దళితులను ఊళ్ల నుంచి విడగొడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది’ అని వారే అడ్డుకున్నారు. ప్రభుత్వం మారగానే లేడి పిల్లల్లా మొదట వైకాపాలోకి దూకింది వారిద్దరే. వారు ఎక్కడున్నా సామాజికవర్గానికి ఉపయోగపడతారన్నది అత్యాశే’ అని ఏపీ సీఐడీ చీఫ్‌, అంబేడ్కర్‌ ఇండియా మిషన్‌ (ఎయిమ్‌) వ్యవస్థాపకుడు పీవీ సునీల్‌కుమార్‌ ఆరోపించారు. ‘గూగుల్‌ మ్యాప్‌లో చూస్తే ఊరికి, వాడకు కిలోమీటరు దూరం ఉంది. ఇది నేనో, నువ్వో పెట్టింది కాదు కదా... ఎప్పటి నుంచో భౌగోళికంగా ఇలాగే ఉంది. పంచాయతీగా చేస్తే విడదీయడం ఎలా అవుతుంది. గతంలో 13 జిల్లాలు ఉండేవి. ఇప్పుడు 26 అయ్యాయి. విడిపోయాయని అంతా కత్తులు దూసుకోలేదు కదా. గతంలో ఎలా ఉన్నారో.. ఇప్పుడూ అలాగే ఉన్నారు’ అని గుర్తుచేశారు. గురువారం ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం నియోజకవర్గ మాలల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘300 అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న ఏ ప్రదేశాన్ని అయినా పంచాయతీగా ప్రకటించొచ్చని చట్టం చెబుతోంది. ఇలాంటి దళితవాడలు మన రాష్ట్రంలో 3,000 వరకు ఉన్నాయి. వీటిని పంచాయతీలుగా గుర్తిస్తే మంచిది’ అని సునీల్‌ కుమార్‌ సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని