వేతనాలకు నెలనెలా యాతనేనా

ఎనిమిదో తేదీ దాటినా వేతనాల కోసం ఉద్యోగులు ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొందని ఏపీఆర్‌ఎస్‌ఏ, ఏపీ ఐకాస అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 09 Dec 2022 04:59 IST

ఉద్యోగుల సంఘం నేత బొప్పరాజు ఆవేదన

కర్నూలు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఎనిమిదో తేదీ దాటినా వేతనాల కోసం ఉద్యోగులు ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొందని ఏపీఆర్‌ఎస్‌ఏ, ఏపీ ఐకాస అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలులో రెవెన్యూ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులకు రూ.వెయ్యి కోట్ల మేర వేతనాలు, రూ.800 కోట్ల పింఛన్లు, రూ.200 కోట్ల గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాల్సి ఉందన్నారు. ఉద్యోగులు ఒక నెల, రెండు, మూడు నెలలు ఓపికతో భరిస్తున్నారని.. ఇది అలవాటుగా మారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఒకటో తేదీ ఏముంది.. ఏ తేదీనైనా తీసుకోవచ్చు’ అని ఓ ఉన్నతాధికారి అనడం సరికాదన్నారు.   తమ కుటుంబ అవసరాల కోసం దాచుకున్న సొమ్మును కూడా తాము తీసుకోలేకపోతున్నామని ఉద్యోగులు బాధపడుతున్నారని చెప్పారు. ఉద్యోగ విరమణ చేసినవారికి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలూ అందడం లేదని.. ఏళ్లు గడుస్తున్నా ఎదురుచూపులే మిగిలాయని అన్నారు.8-9 మాసాల నుంచి డీఏ బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం ఇచ్చిన జీవోల కాలపరిమితి గడువు ముగిసిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.

ఫిబ్రవరి 5న కర్నూలులో మహాసభ

సీపీఎస్‌ రద్దు చేసి పాత పింఛను విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకుండాపోయిందని బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు.ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఫిబ్రవరి 5న కర్నూలులో పెద్దఎత్తున మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని