2024 మార్చికి పోలవరం పూర్తి కావాల్సి ఉంది

తాజా అంచనాల ప్రకారం పోలవరం సాగునీటి ప్రాజెక్టు 2024 మార్చి నాటికి, కాలువల నిర్మాణం 2024 జూన్‌ నాటికి పూర్తి కావాల్సి ఉంది.

Updated : 09 Dec 2022 05:01 IST

వరదల కారణంగా జాప్యమయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా
కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్‌ టుడు

ఈనాడు, దిల్లీ: ‘తాజా అంచనాల ప్రకారం పోలవరం సాగునీటి ప్రాజెక్టు 2024 మార్చి నాటికి, కాలువల నిర్మాణం 2024 జూన్‌ నాటికి పూర్తి కావాల్సి ఉంది. 2020, 2022 సంవత్సరాల్లో గోదావరికి భారీ వరదలు వచ్చిన కారణంగా కొంత జాప్యమయ్యే అవకాశం ఉంది’ అని కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ టుడు తెలిపారు. గురువారం లోక్‌సభలో తెదేపా ఎంపీ కేశినేని నాని, వైకాపా ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కోటగిరి శ్రీధర్‌లు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నలకు బదులిచ్చారు.

ఏపీలో 66.52% గ్రామీణ ఇళ్లకే కుళాయి నీటి సౌకర్యం

ఆంధ్రప్రదేశ్‌లో 66.52% గ్రామీణ ఇళ్లకే కుళాయి నీటి సౌకర్యం ఉన్నట్లు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ పటేల్‌ తెలిపారు. గురువారం లోక్‌సభలో వైకాపా సభ్యులు వల్లభనేని బాలశౌరి, మాగుంట శ్రీనివాసులురెడ్డి అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు.

ఏపీకి కేటాయించిన 50 వేల సౌర పంప్‌సెట్లు వెనక్కి

పీఎం కుసుమ్‌ కింద ఏపీలో 50 వేల వ్యవసాయ మోటార్లను సౌరవిద్యుత్తు కిందకి తీసుకురావాలని నిర్ణయించినప్పటికీ పథకం అమలులో పురోగతి లేకపోవడంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో  వెనక్కి తీసుకున్నట్లు కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్‌కేసింగ్‌ తెలిపారు. లోక్‌సభలో తెదేపా ఎంపీలు జయదేవ్‌, రామ్మోహన్‌నాయుడు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.

ఏపీలో పట్టణ ఇళ్లు 30% మాత్రమే పూర్తి

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పట్టణ) కింద 2015 నుంచి ఇప్పటివరకు ఏపీకి కేటాయించిన ఇళ్లలో 30% మాత్రమే పూర్తయినట్లు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి కౌశల్‌ కిశోర్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు 20,74,770 ఇళ్లు కేటాయించగా 19,08,828 మొదలవగా... 6,32,330 మాత్రమే పూర్తయినట్లు చెప్పారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు