నిరసనలు, పాదయాత్రలు ప్రజాస్వామ్యానికి పునాదులు

కడప ఉక్కు పరిశ్రమ సాధన కోసం డిసెంబరు 9 నుంచి 13 వరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆధ్వర్యంలో తలపెట్టిన పాదయాత్ర, బహిరంగ సమావేశాలకు అనుమతి ఇవ్వాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

Updated : 09 Dec 2022 04:36 IST

సమావేశాలు ప్రాథమిక హక్కు
సీపీఐ పాదయాత్రకు అనుమతివ్వండి
వైయస్‌ఆర్‌ జిల్లా పోలీసులకు హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: కడప ఉక్కు పరిశ్రమ సాధన కోసం డిసెంబరు 9 నుంచి 13 వరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆధ్వర్యంలో తలపెట్టిన పాదయాత్ర, బహిరంగ సమావేశాలకు అనుమతి ఇవ్వాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. నిరసనలు, పాదయాత్రలు, బహిరంగ సమావేశాలు ప్రాథమిక హక్కులో భాగమని న్యాయస్థానాలు పలుమార్లు చెప్పినప్పటికీ పోలీసులు అనుమతి నిరాకరించడం సరికాదని హితవు పలికింది. బలమైన ప్రజాస్వామ్య నిర్మాణానికి అవి పునాదులని పేర్కొంది. అనుమతి ఇవ్వకపోవడం సరికాదంది. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్న సందేహం ఉంటే తప్ప అనుమతి నిరాకరించలేరని స్పష్టంచేసింది. వంద మందితో శాంతియుతంగా పాదయాత్ర నిర్వహిస్తామని వారు చెబుతున్నా ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించింది. వారికి అనుమతి ఇవ్వాలని వైయస్‌ఆర్‌ జిల్లా పోలీసులను ఆదేశించింది. కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూసుకోవాలని పిటిషనర్లకు సూచించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు.

అభ్యంతరం ఎందుకు?

కడప ఉక్కు పరిశ్రమ సాధన డిమాండ్‌తో వైయస్‌ఆర్‌ జిల్లాలో తాము తలపెట్టిన పాదయాత్రకు అనుమతి ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఉమ్మడి కడప జిల్లా సీపీఐ కార్యదర్శి గాలి చంద్ర గురువారం హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యం వేశారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కేఎస్‌ మూర్తి వాదనలు వినిపిస్తూ.. అనుమతి కోసం పలుమార్లు దరఖాస్తు చేసినా పోలీసులు స్పందించలేదన్నారు. శాంతియుతంగా కార్యక్రమం నిర్వహించనున్నామని తెలిపారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి స్పందిస్తూ.. క్రమశిక్షణ కలిగిన పార్టీ వందమందితో కార్యక్రమం నిర్వహిస్తామంటే అభ్యంతరం ఎందుకన్నారు. ప్రభుత్వ న్యాయవాది చైతన్య వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ వినతిని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఆ వాదనలను తోసిపుచ్చిన న్యాయమూర్తి.. అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని