సంక్షిప్త వార్తలు(10)

ఇంధన పరిరక్షణలో దక్షిణ మధ్య రైల్వే ఏడు జాతీయ స్థాయి అవార్డులకు ఎంపికైంది. రైల్వేస్టేషన్ల విభాగంలో కాచిగూడ మొదటి బహుమతిని కైవసం చేసుకుంది.

Updated : 09 Dec 2022 06:32 IST

ఇంధన పరిరక్షణలో ద.మ.రైల్వేకు 7 అవార్డులు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంధన పరిరక్షణలో దక్షిణ మధ్య రైల్వే ఏడు జాతీయ స్థాయి అవార్డులకు ఎంపికైంది. రైల్వేస్టేషన్ల విభాగంలో కాచిగూడ మొదటి బహుమతిని కైవసం చేసుకుంది. ఈ అవార్డులను 2022 సంవత్సరంలో ఇంధన పొదుపులో అవలంబించిన విధానాలకు ప్రకటించారు. బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ సంస్థ, కేంద్ర విద్యుత్‌శాఖ ఏటా వీటిని అందజేస్తున్నాయి. డిసెంబరు 14న దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డులను ప్రదానం చేస్తారని ద.మ.రైల్వే వర్గాలు తెలిపాయి.

* రైల్వేస్టేషన్ల విభాగంలో కాచిగూడ మొదటి, గుంతకల్లు రెండో బహుమతి సాధించాయి.

* విజయవాడ డివిజన్‌లోని విజయవాడ, రాజమండ్రి, తెనాలి రైల్వేస్టేషన్లు ప్రతిభ పురస్కారాలకు ఎంపికయ్యాయి.

* ప్రభుత్వ భవనాల విభాగంలో గుంతకల్లు రైల్వే ఆసుపత్రి, విజయవాడలోని ఎలక్ట్రిక్ర్‌ ట్రాక్షన్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లను అవార్డులు వరించాయి.
పై అవార్డులను సాధించడంలో కృషిచేసిన అధికారులను జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ అభినందించారు.


కూలీ రేట్లు పెంచాలంటూ హమాలీల ధర్నా

ఈనాడు-అమరావతి: కూలీరేట్లు పెంచాలని డిమాండు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బేవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, ఐఎంఎఫ్‌ఎల్‌ హమాలీ వర్కర్స్‌ యూనియన్‌ ఐకాస గురువారం ‘చలో ఎండీ ఆఫీస్‌’ కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రసాదంపాడులోని ఎక్సైజ్‌ కమిషనరేట్‌ ఎదుట ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ధర్నా నిర్వహించారు. ఏపీఎస్‌బీసీఎల్‌ సీజీఎం వేణుగోపాల్‌ కార్మికులతో మాట్లాడుతూ.. ఈ నెల 15న సిగ్మా కంపెనీ ప్రతినిధులు, హమాలీ సంఘాలతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


ధాన్యం సేకరణ సమస్యల పరిష్కారానికి అధికారుల నియామకం

ఈనాడు, అమరావతి: ధాన్యం సేకరణలో తలెత్తే సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రతి మండలానికి అధికారులను నియమించామని పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండియన్‌ తెలిపారు. ధాన్యం సేకరణ లక్ష్యాన్ని కుదించలేదని, అది తాత్కాలిక అంచనా అని పేర్కొన్నారు. గురువారం ‘ఈనాడు’లో ‘వరి రైతుకు పొగ’ శీర్షికన వచ్చిన కథనంపై పౌరసరఫరాల సంస్థ నుంచి వివరణ ఇచ్చారు.


బోగస్‌ ఓట్లు తొలగించండి: ఏపీటీఎఫ్‌

ఈనాడు, అమరావతి: పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గంలో నమోదైన బోగస్‌ ఓట్లను తొలగించాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనాకు ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య (ఏపీటీఎఫ్‌) అభ్యర్థి అనిల్‌ వెంకట ప్రసాద్‌రెడ్డి, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హృదయరాజు, చిరంజీవి వినతిపత్రం సమర్పించారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికలకు కంటే 8,000 అధికంగా ప్రైవేటు ఉపాధ్యాయుల ఓట్లు నమోదయ్యాయని తెలిపారు. కొన్నిచోట్ల ప్రైవేటు పాఠశాలలు మూతపడినా ఓట్లు నమోదయ్యాయని, నర్సరీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పని చేస్తున్న వారి పేర్లు ఓటర్ల జాబితాలో చేర్చారని తెలిపారు.


ఔషధ వినియోగంపై నియంత్రణ పాటించాలి : కృష్ణబాబు

ఈనాడు, అమరావతి: యాంటీబయాటిక్స్‌ ఔషధాల వినియోగంలో ప్రజలు నియంత్రణ పాటించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.కృష్ణబాబు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. మందులను విపరీతంగా వాడటం వల్ల మనుషులు, జంతువుల్లో యాంటీ మైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌ (ఎ.ఎం.ఆర్‌.) పెరుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. వ్యవసాయ రంగంలో విచ్చలవిడిగా క్రిమిసంహారకాల వినియోగంతో ఆహారోత్పత్తులు కలుషితమవుతున్నాయని తెలిపారు. గతనెల 25, 26 తేదీల్లో ఎ.ఎం.ఆర్‌.పై విజయవాడలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో రూపొందించిన ‘విజయవాడ డిక్లరేషన్‌’ అనుసరించి ప్రతి ఒక్కరూ ‘నేను సైతం’ నినాదంతో ఔషధ వినియోగ నియంత్రణకు ప్రతిన బూనాలని కోరారు.


స్మార్ట్‌ మీటర్ల భారం వినియోగదారులపై మోపం: డిస్కంలు

ఈనాడు-అమరావతి: స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుతో వినియోగదారులపై ఎలాంటి భారం మోపబోమని డిస్కంలు తెలిపాయి. 23 శాతం విద్యుత్‌ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ‘స్మార్ట్‌గా భారం’ పేరిట ‘ఈనాడు’లో గురువారం ప్రచురితమైన కథనంపై డిస్కంలు స్పందించాయి. ‘స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు కోసం గుత్తేదారు సంస్థ బిడ్‌లో పేర్కొన్న ధర ప్రకారం ప్రతినెలా నిర్వహణ వ్యయాన్ని చెల్లిస్తాం. స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు, పదేళ్లపాటు నిర్వహణను గుత్తేదారు సంస్థకు అప్పగించేలా టెండరు ప్రతిపాదనలను జ్యుడీషియల్‌ ప్రివ్యూ కమిటీ పరిశీలించి ఆమోదం తెలిపింది. ఈ మేరకు టెండర్ల ప్రక్రియను ప్రారంభించాం’ అని డిస్కంలు పేర్కొన్నాయి.


ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చట్టాన్ని కొనసాగించేందుకు సవరించాలి

అండ్ర మాల్యాద్రి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వచ్చే ఏడాది మార్చితో ముగియనున్న ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చట్టాన్ని కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సవరించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి గురువారం ఒక ప్రకటనలో డిమాండు చేశారు. ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధి కోసం కేటాయించే నిధుల చట్టంగా మార్పు చేయాలన్నారు. వైకాపా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. ఉపప్రణాళిక నిధుల్ని నవరత్నాల పేరుతో మళ్లిస్తోందని ఆరోపించారు. ఎస్సీ కార్పొరేషన్‌ను మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్‌గా విభజించినా ఒక్క రూపాయీ కేటాయించలేదని దుయ్యబట్టారు.


వీఆర్వోలపై ఒత్తిడిని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు

ఈనాడు, అమరావతి: వీఆర్వోలపై పెంచుతున్న పని ఒత్తిడిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు వెల్లడించారు. అధికారుల హడావుడి చర్యలతో భూముల రీ-సర్వేలో తప్పులు వస్తున్నాయని గురువారం ఓ ప్రకటనలలో పేర్కొన్నారు. వీటికి వీఆర్వోలను బాధ్యుల్ని చేస్తున్నారని మండిపడ్డారు. ‘ధాన్యం మిల్లుల వద్ద తుకాల్లోని తేడాల విషయంలోనూ వీఆర్వోలనే బాధ్యులు చేస్తున్నారు. విధుల నిర్వహణలో అధికారుల ఒత్తిడి భరించలేక..మనస్తాపం చెంది శ్రీకాకుళం జిల్లా ఆనందపుర గ్రామంలో వీఆర్వో సంతోష్‌కుమార్‌ ఆత్మహత్యయత్నం చేశారు. విధుల నిర్వహణలో భాగంగా క్షేత్రస్థాయిలో తిరిగేందుకు అవసరమయ్యే ఖర్చులను వారే సొంతంగా భరించాల్సి వస్తోంది. ఈ చర్యలను వ్యతిరేకిస్తూ వచ్చే సోమవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాన్ని చేపడతాం. ఆందోళన కార్యక్రమాలు ఎలా నిర్వహించాలన్న దానిపై త్వరలోనే కార్యాచరణ సిద్ధం చేస్తాం’ అని తెలిపారు.


‘అంగన్‌వాడీ కార్యకర్తలపై వేధింపులు ఆపాలి’

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆహార తనిఖీల పేరుతో కార్యకర్తలపై వేధింపులకు పాల్పడటం దారుణమని అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బేబీరాణి, సుబ్బరావమ్మ మండిపడ్డారు. ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్త సుబ్బలక్ష్మి గుండెపోటుతో మరణించారని గురువారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ‘మూడు నెలల నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు కందిపప్పు, గుడ్ల సరఫరా సక్రమంగా జరగడం లేదు. నాసిరకం వైఎస్సార్‌ కిట్లు సరఫరా చేస్తున్నారు. ఇవేమీ ఆహార తనిఖీ అధికారులకు కనిపించడం లేదా? కేంద్ర నిర్వహణ ఖర్చులను కూడా ప్రభుత్వం నెలల తరబడి పెండింగ్‌లో పెట్టి ఇప్పుడు తనిఖీలు చేయడం ఏమిటి?’ అని ధ్వజమెత్తారు. బాధితురాలి కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని, రూ.50 లక్షల నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్‌ చేశారు.


31లోగా విశాఖలో ప్రీమియం రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభం కావాలి: రజత్‌భార్గవ

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఎంపిక చేసిన జిల్లా కేంద్రాల్లో ప్రీమియం సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన భవనాలను ఈ నెల 31వ తేదీలోగా గుర్తించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రిజిస్ట్రేషన్లు) రజత్‌భార్గవ అధికారులను ఆదేశించారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పనితీరు, ఫీజుల వసూళ్లపై సచివాలయంలో గురువారం ఆయన సమీక్షించారు. ఈ మేరకు ఓ ప్రకటన జారీచేశారు. ‘కాకినాడ, తిరుపతి, గుంటూరు, నెల్లూరు, కడప, కర్నూలు, శ్రీకాకుళంలో భవనాలను అధికారులు గుర్తించాలి. విశాఖలో ఈ నెల 31వ తేదీలోగానే ప్రీమియర్‌ సెంటర్‌ కార్యకలాపాలు జరిగేలా చూడాలి. స్టాంప్‌ చట్టంలో అవసరమైన మార్పులు తెచ్చేందుకు ప్రతిపాదనలు పంపాలి. నిర్దేశించిన మేరకు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల ద్వారా వంద శాతం ఫీజుల వసూళ్లు జరిగేందుకు చర్యలు తీసుకోవాలి. గ్రామ సభల ద్వారా దస్తావేజుల రిజిస్ట్రేషన్ల గురించి ప్రజలకు వివరించాలి. ఇప్పటికే 2000 గ్రామ సచివాలయాల్లో ప్రారంభించిన రిజిస్ట్రేషన్ల పురోగతిని నేరుగా సమీక్షించాలి. పాతరికార్డుల డిజిటలైజేషన్‌ పక్కాగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని